వరస విజయాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమిళ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వైవిధ్యమైన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో ఒక కొత్త సినిమా రాబోతోంది. ఇటీవల 'కొరియన్ కనకరాజు' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్, ఈ జోష్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌లను మరింత జాగ్రత్తగా, ఆసక్తికరంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కార్తీక్ సుబ్బరాజ్‌తో ఆయన చేయబోయే కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సినీ అభిమానుల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా కార్తీక్ సుబ్బరాజ్ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది డార్క్ కామిమెడీ, గ్యాంగ్‌స్టర్ డ్రామాలు లేదా ఒక రకమైన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్లు. 'పిజ్జా', 'జిగర్తాండ', 'పేట్ట' వంటి సినిమాలతో ఆయన తనదైన మార్క్ వేసుకున్నారు. అయితే, వరుణ్ తేజ్‌తో చేయబోయే సినిమా మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రం వరుణ్ తేజ్ ప్రస్తుత వయసుకు, ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే ఒక విభిన్నమైన లవ్ స్టోరీగా రూపుదిద్దుకోనుంది.ఇటీవల వరుణ్ తేజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కార్తీక్ సుబ్బరాజ్ రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌కి పూర్తి భిన్నంగా, ఒక సరికొత్త కోణంలో ఈ లవ్ స్టోరీ సాగుతుందని చెప్పారు.
ఇప్పటివరకు రొటిన్ ప్రేమకథలు చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విభిన్నమైన కాన్సెప్ట్‌లను, నటీనటుల నుంచి కొత్త తరహా నటనను రాబట్టడంలో కార్తీక్ సుబ్బరాజ్ దిట్ట. అలాంటి దర్శకుడి చేతిలో వరుణ్ తేజ్ పడితే లవ్ స్టోరీ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణ సినీ అభిమానులకు సైతం వినోదాన్ని అందిస్తూనే, ఒక వైవిధ్యమైన ప్రేమకథను తెరపైకి తీసుకురావడానికి ఈ కాంబో సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.