తెలుగు సినిమా చరిత్రలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. గతంలో నటసింహం బాలకృష్ణ నటించిన 'బంగారు బుల్లోడు', 'నిప్పురవ్వ' చిత్రాలు 1993 సెప్టెంబర్ 3న ఒకేసారి విడుదలైతే.. అందులో బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన నిప్పురవ్వ నిరాశ పరిచింది. ఆ తర్వాత 2015 మార్చి 21న నాచురల్ స్టార్ నాని కూడా 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'జెండాపై కపిరాజు' సినిమాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రేసులో 'ఎవడే సుబ్రహ్మణ్యం' విజయం సాధించింది. జెండాపై కపిరాజు మాత్రం మంచి సినిమాగా ముద్ర వేసుకుంది కానీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఇప్పుడు దశాబ్దం తర్వాత.. శ్రీ విష్ణు విషయంలో ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఫిబ్రవరి 27న బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న మృత్యుంజయ్, విష్ణు విన్యాసం సినిమాలు ఒకేరోజు విడుదలయ్యేలా కనిపిస్తున్నాయి.
వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు.. ఈసారి ఏకంగా రెండు సినిమాలను ఒకే రోజున థియేటర్లలోకి తీసుకురావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నిర్మాతలు తమ సినిమాలకు సోలో రిలీజ్ డేట్ దొరకాలని కోరుకుంటారు.. కానీ ఇక్కడ ఒకే హీరో రెండు వేర్వేరు సినిమాలతో తనతో తానే పోటీ పడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ అనూహ్య నిర్ణయం వెనుక బలమైన వాణిజ్య కారణాలు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు సొంతం చేసుకున్నాయి. మృత్యుంజయ్ సినిమాను నెట్‌ఫ్లిక్స్ తీసుకోగా.. విష్ణు విన్యాసం Ott హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు తమ స్ట్రీమింగ్ స్లేట్‌కు, షెడ్యూల్‌కు అనుగుణంగా ఫిబ్రవరి 27నే సినిమా విడుదల చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీ అగ్రిమెంట్ల ప్రకారం థియేటర్ రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో.. నిర్మాతలు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ క్లాష్‌కి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితి శ్రీ విష్ణుకు ఒక విచిత్రమైన సవాలును విసురుతోంది. ఒకే సమయంలో రెండు వేర్వేరు జానర్ల సినిమాలను ప్రమోట్ చేయడం హీరోకి కత్తి మీద సాము లాంటిదే. ఉదయం ఒక సినిమా ప్రెస్ మీట్, సాయంత్రం మరో సినిమా ఇంటర్వ్యూ అంటూ హడావిడి చేయాల్సి వస్తుంది. పైగా ప్రేక్షకులు ఏ సినిమాకు వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఏ ఒక్క సినిమా ప్రమోషన్ తగ్గినా, అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి.. శ్రీ విష్ణు ఈ ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.గత చరిత్రను పరిశీలిస్తే బాలకృష్ణ, నాని సందర్భాల్లో రెండు సినిమాల్లో ఒకటి మాత్రమే బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగింది. మరి ఇప్పుడు శ్రీ విష్ణు విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేదా కంటెంట్ బాగుంటే రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా? అనేది చూడాలి. ఏదేమైనా ఫిబ్రవరి 27న శ్రీ విష్ణు బాక్సాఫీస్ దగ్గర తనతో తానే తలపడుతూ చేస్తున్న ఈ ప్రయోగం ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.