గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పెళ్లి పీటల వరకు చేరింది. ఇన్ని రోజులూ కేవలం ఊహాగానాలు, రూమర్లకే పరిమితమైన వీళ్ళ బంధంపై ఇప్పుడు అధికారిక ముద్ర పడింది. ఇకపై అలా జరుగుతుందంట, పెళ్లి అప్పుడంట అనే గుసగుసలకు ఆస్కారం లేదు. ఇద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో, అభిమానుల ఆశీస్సులతో ఈ స్టార్ కపుల్ తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ జంట పెళ్లికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే కాకుండా, వెడ్డింగ్ కార్డ్ కూడా బయటికి రావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రౌడీ బాయ్ విజయ్, నేషనల్ క్రష్ రష్మికల వివాహ వేడుకకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.
ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. వివాహానంతరం, మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్లు కూడా సిద్ధమై, అతిథులకు అందుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగబోతున్న ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న ఈ జంట.. పెళ్లి కోసం చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు. ఇటీవలే రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి సినిమా మేజర్ షెడ్యూల్‌ను విజయ్ పూర్తి చేశారు. తిరిగి మార్చి తర్వాతే ఆయన షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం పెళ్లి పనులను దగ్గరుండి చూసుకునే పనిలో విజయ్ బిజీగా మారారు. మరోవైపు రష్మిక మందన్న కూడా తన సినిమా షూటింగ్స్‌కు కాస్త విరామం ప్రకటించి, పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. వీళ్ళిద్దరూ తమ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ను పక్కన పెట్టి, ఈ స్పెషల్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు.
ఈ స్టార్ వెడ్డింగ్ వేడుకను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేయడానికి ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే స్ట్రీమింగ్ హక్కుల కోసం దాదాపు రూ. 60 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. అయితే విజయ్ దేవరకొండ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. తమ పెళ్లిని వ్యాపారవస్తువుగా మార్చడం ఇష్టం లేదని, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వ్యక్తిగత వేడుకగా జరుపుకోవడానికే ఆయన మొగ్గు చూపారు. డబ్బు కంటే తమ ప్రైవసీకి, సాంప్రదాయ విలువలకు ఈ జంట ఇస్తున్న ప్రాముఖ్యతను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మార్చి 4న జరగబోయే రిసెప్షన్ వేడుక ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారనుంది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. బాలీవుడ్ అండ్ ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా భారీ సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ జంటను ఆశీర్వదించడానికి దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు క్యూ కట్టే అవకాశం ఉంది. మొత్తానికి రీల్ లైఫ్‌లో బ్లాక్ బస్టర్ పెయిర్‌గా నిలిచిన విజయ్-రష్మిక.. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ ఒక్కటి కాబోతుండటం ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.