టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ ప్రొడక్షన్ హౌస్‌గా మారిపోయింది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం కథ అనుకునేవారు.. కానీ మైత్రీ వారు మాత్రం కాంబినేషన్ అండ్ స్కేల్ అనే రెండు మంత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న లైనప్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో టాలీవుడ్ మార్కెట్ వీరి గుప్పెట్లో ఉండబోతోందని స్పష్టమవుతోంది. ప్రతి ప్రాజెక్ట్ ఒకదాని మించి మరొకటి అన్నట్లుగా, డిస్ట్రిబ్యూటర్లకు హాట్ కేక్స్ లా మారాయి.
ఈ లిస్ట్‌లో ఉన్న పెద్ద సినిమాల పేర్లు వింటేనే గూస్ బంప్స్ రావడం ఖాయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్.. ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఫౌజీ.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న డ్రాగన్.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో అణుబాంబులా కనిపిస్తోంది. వీటికి తోడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ స్థాయి స్టార్ డమ్ ఉన్న సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకురావడం కేవలం మైత్రీకే సాధ్యం. కేవలం స్టార్ హీరోలే కాదు, కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా మైత్రీ అడ్డాగా మారింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకర్స్‌తో జై హనుమాన్ వంటి మైథలాజికల్ వండర్.. విజయ్ దేవరకొండ రణబాలి.. రామ్ చరణ్ తో పెద్ది వంటి మాస్ మసాలా చిత్రాలు వీరి లైనప్‌లో వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి. అలాగే రవితేజ ఇరుముడి.. జెట్లీ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు కూడా ఉన్నాయి.
శ్రీ విష్ణు-రామ్ అబ్బరాజు కాంబినేషన్ వంటి మినిమం గ్యారెంటీ ఎంటర్టైనర్లను కూడా ప్లాన్ చేస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ రాబోయే మూడేళ్లకు సరిపడా కంటెంట్ అండ్ షూటింగ్ షెడ్యూల్స్ కోసం దాదాపు 2000 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ దూకుడు చూస్తుంటే.. ఒకేసారి మల్టిపుల్ సినిమాలను రిలీజ్ చేయడానికి లేదా షూటింగ్స్ పూర్తి చేయడానికి వారు ఎంత గట్టిగా నిర్ణయించుకున్నారో అర్థమవుతోంది.
మార్కెట్‌లో వీరి సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, బిజినెస్ పరంగా కూడా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ చూసే రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్ లిస్ట్ చూస్తుంటే ఇది కేవలం సినిమాల లిస్ట్ కాదు.. బాక్సాఫీస్ రికార్డుల లిస్ట్ అనిపిస్తోంది. చిన్న సినిమా నుండి పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాల వరకు అన్నీ పక్కా ప్లానింగ్‌తో రెడీ చేస్తున్నారు. ప్రతీ ప్రాజెక్ట్ హాట్ కేక్ ప్రాజెక్టే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్న మాటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. రాబోయే కాలం మైత్రీ నామ సంవత్సరంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.