సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో, కేవలం తన సహజసిద్ధమైన నటనతో, అద్భుతమైన డాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకుంది ఈ ‘ఫిదా’ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ దాటి బాలీవుడ్ వరకు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అయితే, కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న సాయి పల్లవి, గతంలో జరిగిన ఒక సంఘటనపై స్పందిస్తూ తాజాగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ బడా బడా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రామాయణ’ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అలాగే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ‘ఏక్ దిన్’ అనే సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాయి పల్లవి తనపై గతంలో జరిగిన ఒక దుష్ప్రచారంపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె తెలిపారు."నేను ఎప్పుడూ చెప్పని మాటలను నా పేరుతో ప్రచారం చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఫేక్ న్యూస్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను" అని సాయి పల్లవి తన మనసులోని మాటను పంచుకున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవిని ఒకరు ప్రశ్నిస్తూ.. "మీరు మలయాళీ కదా.. మరి తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారు?" అని అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ.. "నేను మలయాళీని కాదు, నేను తమిళ అమ్మాయిని. తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టి పెరిగాను" అని సమాధానం ఇచ్చారు.
అయితే, ఈ చిన్న విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుగా వక్రీకరించారు. "సాయి పల్లవి మలయాళీ అని పిలిస్తే కోప్పడింది", "ఇతర భాషలను ఆమె అవమానించింది" అంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఈ తప్పుడు వార్తలు తనను ఎంతగానో కలచివేసినట్లు ఆమె తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేను ఎప్పుడూ ఏ భాషను గానీ, ఏ ప్రాంత ప్రజలను గానీ తక్కువ చేసి మాట్లాడలేదు. ప్రతి భాషపై, ప్రతి సంస్కృతి మీద నాకు గౌరవం ఉంది. నన్ను మలయాళీ అని పిలిచినప్పుడు, కేవలం నా మాతృభాష తమిళం అని, నేను కోయంబత్తూరుకు చెందిన అమ్మాయిని అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అని పల్లవి వివరించింది. సెలబ్రిటీల మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల వారు ఎంతటి మానసిక వేదన అనుభవిస్తారో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం సాయి పల్లవికి అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఎప్పుడూ గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేసే సాయి పల్లవి, ప్రస్తుతం పీక్ కెరీర్ లో దూసుకెళ్తోంది.