భారతీయ చలనచిత్ర రంగంలో విలక్షణమైన ముద్ర వేసిన దర్శకుల్లో ఒకరు సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ఈ దర్శకుడు, తన ఇన్స్పిరేషన్ గురించి ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ప్రకారం, తన ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యాల వెనుక ఉన్న అసలైన గురువు రామ్ గోపాల్ వర్మ అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. "నేను సత్య సినిమా చూసి స్క్రీన్ ప్లే మరియు ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను" అని పేర్కొన్నారు.
ఒక సినిమా కథను కేవలం మాటల ద్వారా కాకుండా, కెమెరా యాంగిల్స్ మరియు ఎడిటింగ్ టేబుల్ మీద ఎలా అద్భుతంగా మలచవచ్చో చెప్పడానికి 'సత్య' ఒక పాఠ్యపుస్తకం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పింది. రంగీలా వంటి ఒక కలర్ ఫుల్ మ్యూజికల్ హిట్ ఇచ్చిన తర్వాత, వెంటనే సత్య వంటి డార్క్, రా-అండ్-రస్టిక్ గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే ఏ దర్శకుడికైనా చాలా 'ధైర్యం' ఉండాలి అని సందీప్ రెడ్డి ప్రశంసించాడు.
రంగీలా.. గ్లామర్, అద్భుతమైన పాటలు, విజువల్స్ తో నిండిన సినిమా. సత్య.. చీకటి ప్రపంచం, ముంబై అండర్ వరల్డ్ లోని క్రూరత్వం, అత్యంత సహజమైన చిత్రీకరణ. ఈ రెండు భిన్నమైన ధ్రువాల వంటి సినిమాలను వరుసగా తీయడానికి కావాల్సిన ఆ 'గట్స్' ఉన్న ఏకైక దర్శకుడు RGV మాత్రమే అని సందీప్ రెడ్డి వంగా కొనియాడారు. ఆర్జీవీలోని ఆ సాహసమే తనను బాగా ఇన్ ఫ్లూయెన్స్ చేసిందని ఆయన వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా సినిమాలను గమనిస్తే, అందులో పాత్రల ప్రవర్తన చాలా 'రా' గా ఉంటుంది.
'యానిమల్' చిత్రంలో రణబీర్ కపూర్ పాత్రలో ఉండే తీవ్రత గానీ, సినిమా ఎడిటింగ్ స్టైల్ గానీ వర్మ ప్రభావం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి. సినిమా రన్ టైమ్ విషయంలో గానీ, వైలెన్స్ ప్రెజెంటేషన్ లో గానీ సందీప్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయరు. అదే వర్మ మార్క్ మేకింగ్. రామ్ గోపాల్ వర్మ తన మేకింగ్‌తో ఎందరో యువ దర్శకులను ప్రభావితం చేశారు. నేటి తరం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకోవడమే వర్మ సాధించిన విజయానికి నిదర్శనం. సోషల్ మీడియాలో ప్రస్తుతం సందీప్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'యానిమల్' లాంటి మాసివ్ హిట్ తర్వాత కూడా తన మూలాలను, తన ఇన్స్పిరేషన్ ను మర్చిపోకుండా చెప్పడం వంగాకే సాధ్యమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.