మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది'. ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ శృతి హాసన్ రంగంలోకి దిగుతున్నారు.పెద్ది' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. కేవలం ఒక ప్రత్యేక గీతం చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ పాట కోసం సరైన కథానాయికను ఎంపిక చేసే పనిలో చిత్రబృందం గత కొద్దిరోజులుగా తలమునకలైంది. మృణాల్ ఠాకూర్ వంటి పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ, చివరకు శృతి హాసన్ అయితేనే ఈ పాటకు పూర్తి న్యాయం జరుగుతుందని చిత్ర బృందం భావించి ఆమెను ఖరారు చేసింది.
ఈ నెల 26వ తేదీ నుండి హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సాంగ్ కోసం శృతి హాసన్ తనదైన శైలిలో డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టడానికి సిద్ధమయ్యారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమాలో 'జంక్షన్ లో...' అనే సాంగ్‌తో థియేటర్లలో ఒక ఊపు ఊపింది శృతి హాసన్. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా 'పెద్ది' లో చేస్తున్న ఈ సాంగ్ ఆమె కెరీర్‌లో రెండో తెలుగు స్పెషల్ సాంగ్ కావడం విశేషం. గతంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్ 'ఎవడు' సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అప్పట్లో సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది.
మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత, వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం మెగా అభిమానులకు పెద్ద పండగ లాంటి వార్తే. దర్శకుడు బుచ్చిబాబు సానా 'ఉప్పెన' తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇది జాన్వీకి తెలుగులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పెషల్ సాంగ్ అంటేనే మాస్ ఆడియన్స్‌కు ఒక కిక్కు. అందులోనూ చరణ్ స్టెప్పులు, శృతి హాసన్ గ్లామర్ తోడైతే ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే. 'ఆగడు' సాంగ్ కంటే మిన్నగా ఈ పాటను ప్లాన్ చేస్తున్నారట బుచ్చిబాబు. జూన్ నెలలో విడుదల కానున్న 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.