విశ్వంభరతో అసలు సినిమా.. మెగాస్టార్ సోలో స్టామినాకు అసలైన అగ్నిపరీక్ష..!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఆయన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2026 | 11:14 AMLast Updated on: Jan 28, 2026 | 11:14 AM

The Film With Vishwambhara Is The Real Test A True Trial By Fire For Megastars Solo Stamina

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఆయన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. ఆ క్రెడిట్ మొత్తం కేవలం చిరంజీవి ఖాతాలోకే వెళ్తుందా అంటే విశ్లేషకులు ఆలోచించాల్సిందే అంటున్నారు. ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ.. ఆ విజయం వెనుక అనేక ఇతర బలమైన కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న విశ్వంభర చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ సోలో మార్కెట్ చూపించే అసలైన లిట్మస్ టెస్ట్ అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. 50 ఏళ్ళ మెగాస్టార్ ఇమేజ్‌ను ప్రశ్నించడం కాదు కానీ.. గత పదేళ్లలో కేవలం సంక్రాంతికి వచ్చినపుడే బాస్ సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. మధ్యలో వచ్చిన ఆచార్య, సైరా, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి సినిమాలు తేలిపోయాయి.

మన శంకరవరప్రసాద్ గారు సినిమా సాధించిన అఖండ విజయాన్ని తక్కువ చేయలేం కానీ ఆ సక్సెస్ వెనుక హిట్ మెషిన్ అనిల్ రావిపూడి బ్రాండ్ ఇమేజ్ చాలా బలంగా పనిచేసింది. ప్రేక్షకులకు ఏం కావాలో పక్కాగా తెలిసిన అనిల్.. తనదైన మార్క్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. దానికి తోడు సంక్రాంతి సీజన్ కలిసి రావడం వసూళ్ల వర్షానికి ప్రధాన కారణంగా నిలిచింది. పండుగ సెలవుల్లో ఎంటర్టైన్మెంట్ కోరుకునే సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ గా నిలిచింది తప్ప.. అది కేవలం చిరంజీవి స్టార్‌డమ్ వల్ల మాత్రమే వచ్చిన సోలో కలెక్షన్స్ కాదనేది కొందరి వాదన. ఆ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌కు మరో ప్రధాన బలం విక్టరీ వెంకటేష్ క్యామియో. అప్పటికే ఒక భారీ రీజినల్ ఇండస్ట్రీ హిట్‌తో జోరుమీదున్న వెంకీ.. ఈ సినిమాలో మెరవడంతో హైప్ అమాంతం పెరిగిపోయింది. చిరు-వెంకీ కాంబినేషన్ చూడాలన్న ఆసక్తి ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచింది.

ఇలాంటి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ పుష్కలంగా ఉండటం వల్లే మన శంకరవరప్రసాద్ గారు సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంటే అక్కడ చిరంజీవి ఇమేజ్‌కు అదనపు హంగులు తోడవ్వడం వల్ల మెగాస్టార్‌పై బాక్సాఫీస్ భారం కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇక్కడే విశ్వంభర ప్రాముఖ్యత తెరపైకి వస్తుంది. ఈ చిత్రానికి పైన చెప్పుకున్న అదనపు ఆకర్షణలేవీ లేవు. ఇది సోషియో-ఫాంటసీ జోనర్‌లో వస్తున్న ప్రయోగాత్మక చిత్రం. ఇక్కడ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ కానీ, అనిల్ రావిపూడి లాంటి మినిమం గ్యారెంటీ డైరెక్టర్ బ్రాండ్ కానీ.. మల్టీస్టారర్ హంగులు కానీ లేవు. కేవలం వశిష్ఠ టేకింగ్, విజువల్స్, మెగాస్టార్ చరిష్మా మాత్రమే ఈ సినిమాను గట్టెక్కించాలి. ఎలాంటి సేఫ్టీ నెట్స్ లేకుండా చిరంజీవి తన భుజాలపై ఈ సినిమాను మోయాల్సి ఉంది.

అందుకే ఇది చిరంజీవికి, ఆయన స్టార్ డమ్‌కు నిజమైన బాక్సాఫీస్ పరీక్షగా మారింది. చివరగా చెప్పాలంటే విశ్వంభర ఫలితమే మెగాస్టార్ బాక్సాఫీస్ పొటెన్షియల్‌కు సరైన కొలమానం కానుంది. ఎలాంటి బయటి సపోర్ట్ లేకుండా, కేవలం తన స్టార్‌డమ్‌తో ఈ సినిమాను హిట్ చేస్తే.. అప్పుడు చిరంజీవి స్టామినా గురించి ఎవరూ వేలెత్తి చూపలేరు. ఈ సినిమా కనుక బ్రేక్ ఈవెన్ దాటి భారీ లాభాలు తెస్తే.. ఈ జనరేషన్‌లో కూడా చిరంజీవికి తిరుగులేని ఫాలోయింగ్ ఉందని ప్రూవ్ అవుతుంది. అందుకే ఈ చిత్రం హిట్ అయితేనే మెగా స్టామినాపై ఉన్న సందేహాలు పటాపంచలై, ఆయన బాక్సాఫీస్ రారాజుగా మరోసారి నిరూపించుకున్నట్లవుతుంది.