టీవీకే చీఫ్ విజయ్ ట్రాప్.. ఓట్లు పడతాయా.. ప్రచారానికి వచ్చిన జనం అంతా వేస్తారా..?

తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ ప్రస్తుతం రాజకీయంగా ఒక ఆసక్తికరమైన.. అదే సమయంలో ప్రమాదకరమైన ట్రాప్ లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.

Post Published By: dialnews
Updated : 2 February 2026, 5:32 PM IST

తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ ప్రస్తుతం రాజకీయంగా ఒక ఆసక్తికరమైన.. అదే సమయంలో ప్రమాదకరమైన ట్రాప్ లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉంటే.. విజయ్ అంచనాలు మాత్రం మరోలా ఉన్నాయి. తాజా సర్వేల ప్రకారం.. విజయ్ పార్టీ కేవలం 15 శాతం ఓట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందని.. కనీసం కింగ్ మేకర్ పాత్ర పోషించే సీట్లు కూడా రావని తేల్చి చెబుతున్నాయి. కానీ విజయ్ మాత్రం ఈ లెక్కలను కొట్టిపారేస్తూ.. తన సభలకు పోటెత్తుతున్న జనసందోహాన్ని చూపిస్తూ ఈ జనాన్ని చూస్తున్నారు కదా.. నేనే గెలుస్తాను అనే ధీమాతో ఉన్నారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చే స్టార్లకు ఎప్పుడూ ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఇదే. వెండితెరపై తమను ఆరాధించే అభిమానులను, కేవలం స్టార్‌ను చూడటానికి వచ్చే కుతూహల జనాలను చూసి.. అదంతా తమకు పడే ఓటు బ్యాంక్ అని అపోహ పడుతుంటారు.

విజయ్ కూడా ప్రస్తుతం అదే భ్రమలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్ డమ్ చూసి జనం రావడం వేరు, ఆ అభిమానం పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటుగా మారడం వేరు. ఈ కీలకమైన తేడాను గమనించకపోతే రాజకీయాల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరోవైపు విజయ్.. తనకు ఎంజీయార్, జయలలితలే ఆదర్శం అని బహిరంగంగా చెబుతున్నారు. అయితే, వారు స్థాపించి, పెంచి పోషించిన అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికీ తమిళనాడులో బలంగానే ఉందన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. ఎంజీయార్, జయలలిత లేకపోయినా.. ఆ పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, సంప్రదాయ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేయడం లేదా వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవడం కేవలం మాటలతో సాధ్యం కాదు.

ఈ రాజకీయ వాస్తవాన్ని విజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది.కేవలం సభలకు వచ్చే జనాలను చూసి గెలుపు ధీమా వ్యక్తం చేయడం రాజకీయ పరిపక్వత అనిపించుకోదు. వాస్తవ రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల వారీగా కుల సమీకరణాలు, పొత్తులు, ప్రత్యర్థుల బలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహాలు పన్నడమే అసలైన రాజకీయం. కానీ విజయ్ టీమ్ మాత్రం ఇంకా క్రౌడ్ మేనేజ్‌మెంట్ నే నమ్ముకున్నట్లు, సోషల్ మీడియా హైప్ మీదనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. గ్రౌండ్ రియాలిటీని విస్మరించి, కేవలం జనం వచ్చారని సంబరపడితే చివరకు ఫలితాలు నిరాశజనకంగా ఉండే ప్రమాదం ఉంది.

ఇప్పటికైనా విజయ్ ఆ క్రౌడ్ ట్రాప్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 15 శాతం ఓట్లతో అధికారం దక్కదు సరికదా.. కనీసం ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉండదు. అందుకే, తనకున్న స్టార్ ఇమేజ్‌ని ఓట్లుగా మార్చుకునే పక్కా పొలిటికల్ స్ట్రాటజీని సిద్ధం చేసుకోవాలి. సభల ఆర్భాటాలను పక్కనబెట్టి, ప్రజల సమస్యలపై పోరాడి, బలమైన రాజకీయ శక్తిగా ఎదిగితేనే ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. లేదంటే సినిమాల నుంచి వచ్చి విఫలమైన అనేక మంది నేతల జాబితాలో విజయ్ కూడా చేరిపోయే ప్రమాదం ఉంది.

Published : 
  • 2 February 2026, 5:32 PM IST