Top Story: బెంగాల్‌పై బీజేపీ గురి… కాషాయ జెండా ఎగురుతుందా… ?

పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడుతుందా ? టీఎంసీ విజయాలకు బీజేపీ అడ్డుకట్ట వేస్తుందా ? ప్రధాని మోడీ, అమిత్ షా వ్యూహాలు పారుతాయా ? గంగానది ఏ యే రాష్ట్రాల్లో పారుతుందో...ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వస్తోంది.

Post Published By: dialnews
Updated : 19 March 2026, 1:06 PM IST

పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడుతుందా ? టీఎంసీ విజయాలకు బీజేపీ అడ్డుకట్ట వేస్తుందా ? ప్రధాని మోడీ, అమిత్ షా వ్యూహాలు పారుతాయా ? గంగానది ఏ యే రాష్ట్రాల్లో పారుతుందో...ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ అయిపోయింది...నెక్స్ట్‌ పశ్చిమ బెంగాలేనా ?ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ...రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాషాయ పార్టీ అయితే...ఆపరేషన్‌ బెంగాల్‌ పేరుతో కొన్ని నెలల క్రితమే ప్రచారం మొదలు పెట్టింది. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా...వరుసగా పర్యటనలు చేస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

ఇప్పటికే 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ...త్వరలో ఎన్నికలు జరగనున్న బెంగాల్, తమిళనాడుపైన కన్నేసింది. దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత...నెక్స్ట్‌ టార్గెట్‌ బెంగాలేనని ప్రధాని మోడీ ప్రకటించారు. గంగానది ప్రవాహం ఏ యే రాష్ట్రాల్లో మీదుగా వెళ్తుందో...ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందే...బెంగాల్‌లో బీజేపీదే విజయమని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా బీజేపీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

15 ఏళ్లుగా బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. మమతా బెనర్జీకి ఎలాగైనా చెక్‌ పెట్టాలని మోడీ, అమిత్ షా భావిస్తున్నారు. సంవత్సరాలుగా చాపకింద నీరులా పార్టీని విస్తరిస్తున్నారు. పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో...టీఎంసీని ఎలా దెబ్బకొట్టాలో ప్రణాళికబద్దంగా పని చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే 2016లో కేవలం 3 సీట్లు గెలిచిన కాషాయ పార్టీ...ఐదేళ్లు తిరిగేసరికి టీఎంసీతో నువ్వానేనా అన్నట్లు తలపడింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 77 సీట్లు సాధించి...సంచలనం సృష్టించింది. దీంతో బీజేపీ శ్రేణులకు కొత్త ఊపు వచ్చింది. బెంగాల్‌లో కూడా విజయం సాధించవచ్చని కమలనాథులు అంచనాకు వచ్చారు.

గెలుపునకు సామ, దాన, భేద, దండోపాయాలన్నింటినీ వినియోస్తున్నారు. విస్తృతస్థాయిలో ఓటర్ల జాబితాను సవరించడం, ఎన్నికలకు కొన్నిరోజుల ముందు గవర్నర్‌తో రాజీనామా చేయించారు. బీజేపీకి నమ్మినబంటు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని పశ్చిమ బెంగాల్‌కు బదిలీ చేసింది. టీఎంసీని ఎన్ని రకాలుగా ఉచ్చు బిగించాలో...అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. సీఎస్‌, ప్రిన్సిపల్ సెక్రటరీలను బదిలీ చేసింది.ఎన్ని రకాల వ్యూహాలు రచించినా...ఎన్ని ఎత్తులు వేసినా...అధికారులను బదిలీ చేసినా...బీజేపీ గెలుపు మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో 30శాతానికిపైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. హిందువులంతా గంపగుత్తగా బీజేపీకి ఓటేస్తే...టీఎంసీని నిలువరించడం సాధ్యమవుతుంది. అది జరగనంత వరకు వరకూ బీజేపీ విజయం సాధించడం కష్టమే.

కాషాయ పార్టీ భారీగా పుంజుకున్న తృణమూల్‌దే విజయమని సర్వేలు అంచనా వేశాయి. అధికార టీఎంసీకి 155 నుంచి 170 సీట్లు, బీజేపీ 100 నుంచి 115 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని వెల్లడించాయి. మత్స్యకారులను, రైతులను తన వైపునకు తిప్పుకొంటూ తీర ప్రాంతాల్లో ఓటు బ్యాంకును స్థిరపరుచుకుంటోంది. పర్బా మేదినీపూర్‌లో 2021లో 16కి 7 స్థానాలు గెలుచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆధిక్యం సాధించింది. తీర ప్రాంతంలోనే కాదు.. జంగల్‌ మహల్‌ గిరిజన ప్రాంతంలో కూడా బీజేపీ పట్టు సాధించింది. టీఎంసీ 5 శాతం అంతకంటే తక్కువ మార్జిన్‌తో గెలిచిన 46 స్థానాలపె బీజేపీ ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ సారి ఎలాగైనా ఆ స్థానాలను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారు పట్ల ప్రజా వ్యతిరేకత, ముస్లిం బుజ్జగింపు ధోరణులు, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ప్రజలు, హిందూ ఓట్లు సంఘటితం కావడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.

Published : 
  • 19 March 2026, 1:06 PM IST