Top story: బుద్ధుడు పాకిస్తానీ అంట… అసలైన భారత్ తమదే అంటున్న పాకిస్తాన్… నీళ్ల కోసం ఇంతకు దిగజారిపోయారు కదరా…!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పాకిస్తాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది

Post Published By: dialnews
Updated : 25 June 2026, 2:30 PM IST

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పాకిస్తాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ నీటి సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడటానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో ఒక సరికొత్త వాదనను ముందుకు తెచ్చారు. భారత్ ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన నేరుగా సింధు నాగరికతకు ముడిపెట్టారు. పాకిస్తాన్ విద్యార్థులకు తమ దేశ చరిత్ర క్రీస్తు శకం 712లో ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్‌ను ఆక్రమించడంతోనే ప్రారంభమైందని దశాబ్దాలుగా బోధిస్తున్నారు. కానీ నీటి వివాదం ముదరడంతో పాక్ పాలకులకు అకస్మాత్తుగా 5000 ఏళ్ల నాటి ప్రాచీన నాగరికత గుర్తుకొచ్చింది. 1965లో అమెరికన్ పురావస్తు శాస్త్రవేత్త జార్జ్ డేల్స్ తర్వాత ఎవరూ టచ్ చేయని మోహెంజొదారో సైట్‌లో పాక్ గతేడాది జూన్‌లో తిరిగి తవ్వకాలు ప్రారంభించింది. 'మోహెంజొదారో, హరప్పా మా భూభాగంలోనే ఉన్నాయి, కాబట్టి సింధు నదికి అసలైన, ఏకైక వారసులం మేమే' అని బిలావల్ భుట్టో, ప్రెసిడెంట్ జర్దారీ అంతర్జాతీయ వేదికలపై వాదిస్తున్నాడు. భారత్ చర్యను నేరుగా 'సింధు నాగరికతపైనే జరిగిన దాడిగా' అభివర్ణిస్తున్నాడు.

నిజానికి ఇస్లామిక్ చరిత్రను మాత్రమే నెత్తిన పెట్టుకున్న పాకిస్తాన్, ఇప్పుడు తన ఉనికి కోసం ఇస్లాం-పూర్వ కాలానికి చెందిన తక్షశిల, గాంధార, బలూచిస్తాన్‌లోని మెహర్‌గఢ్ వంటి పురాతన బౌద్ధ, వైదిక, గ్రీకో-బౌద్ధ సంస్కృతులను ప్రమోట్ చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతో డాక్యుమెంటరీలు, సెమినార్లు, తక్షశిల అంతర్జాతీయ టూరిజం క్యాంపెయిన్ల ద్వారా 'తమదే అసలైన ప్రాచీన భారత దేశం' అని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ తిమోతీ కేన్ తక్షశిలను సందర్శించి ప్రశంసించగా, దానికి పాక్ విశ్లేషకులు స్పందిస్తూ.. 'ఈ నది, దీని చరిత్ర పాకిస్తాన్‌దే. ఈ నది లేని వారు దీనిపై హక్కులు కోరలేరు' అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఈ నది పాకిస్తాన్‌ను ఏకం చేసే శక్తని, ఈజిప్టుకు నైలు నది ఎలాంటిదో పాక్‌కు సింధు నది అలాంటిదని వారు పోల్చుతున్నారు. ఇక్కడే పాకిస్తానీలు తప్పులో కాలేస్తున్నారు. ఎందుకంటే, చరిత్రపరంగా చూస్తే పాకిస్తాన్ వ్యూహాల్లోనే చాలా లోపాలున్నాయి. సింధు నాగరికతకు చెందిన కొన్ని ప్రధాన సైట్లు పాకిస్తాన్‌లో ఉన్నప్పటికీ, హరప్పా సంస్కృతికి చెందిన అత్యధిక శాతం ప్రాంతాలు ప్రస్తుతం మన దేశంలోనే ఉన్నాయి.

వాస్తవాలను పరిశీలిస్తే పాకిస్తాన్ వాదనల్లోని డొల్లతనం సులువుగానే బయటపడుతుంది. విభజన సమయంలో హరప్పా, మోహెంజొదారో వంటి కొన్ని ప్రధాన నగరాలు పాక్ భూభాగంలోకి వెళ్లిన మాట నిజమే కావచ్చు.. కానీ సింధూ నాగరికత విస్తృతి కేవలం ఆ రెండు నగరాలకే పరిమితం కాలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో జరిగిన విస్తృత పరిశోధనలు పాక్ మైండ్ గేమ్‌కు గట్టి జవాబునిస్తాయి. గుజరాత్‌లోని లోథాల్, ధోలవీరా, హర్యానాలోని రాఖీగఢ్, రాజస్థాన్‌లోని కాళీబంగన్ వంటి వందలాది అత్యంత కీలకమైన సింధూ సైట్లు మన దేశంలోనే వెలుగుచూశాయి. చరిత్రకారుల లెక్కల ప్రకారం.. సింధూ నాగరికతకు చెందిన దాదాపు 80 శాతం కంటే ఎక్కువ గ్రామాలు, నగరాలు నేటి భారతదేశ సరిహద్దుల్లోనే విస్తరించి ఉన్నాయి. కేవలం మ్యాప్‌లో కొన్ని ప్రాంతాలు తమ వైపు ఉన్నంత మాత్రాన, ఐదు వేల ఏళ్ల నాటి అఖండ భారతీయ సంస్కృతికి తామే వారసులమంటూ పాకిస్తాన్ ప్రకటించుకోవడం హాస్యాస్పదం.

అసలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న ఈ సాంస్కృతిక వాదనలకు.. ఆధునిక చట్టాలకు అసలు పొంతనే లేదు. ఆధునిక ప్రపంచంలో జల హక్కులను 5 వేల ఏళ్ల నాటి చరిత్ర నిర్ణయించదు. ప్రస్తుత కాలంలో నదీ జలాల పంపిణీ అనేది అంతర్జాతీయ చట్టాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం జరుగుతుంది. 1960 నాటి సింధూ జలాల ఒప్పందం ప్రకారం భారత్ చాలా ఉదారతతో పాకిస్తాన్‌కు నీటిని కేటాయించింది. కానీ, అదే ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని భారత్‌పై ఉగ్రవాద ప్రాక్సీ యుద్ధాన్ని నడుపుతోంది పాకిస్తాన్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని మార్చుకుంది. "రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవన్న నినాదంతో ఒప్పంద పునఃసమీక్షకు డిమాండ్ చేస్తూ గట్టి బదులిచ్చింది. చట్టబద్ధమైన నిబంధనలను పాటించకుండా, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. ఇప్పుడు 'సింధూ నాగరికత మాదే' అంటూ సెంటిమెంట్ డ్రామాలు ఆడితే భారత్ లొంగే ప్రసక్తే లేదు.

పాకిస్తాన్ ఎన్ని రకాల పిల్లిమొగ్గలు వేసినా, ఇస్లామిక్ ఐడెంటిటీ నుంచి అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుని ప్రాచీన భారతీయ సంస్కృతి జపం చేసినా వారి కుట్రలు వర్కౌట్ కావు. సింధూ నది పుట్టింది భారత భూభాగంలోనే.. దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల ప్రవాహం కూడా భారత్ మీదుగానే సాగుతుంది. ఎగువ దేశంగా నదులపై ఇండియాకు ఉన్న సహజసిద్ధమైన, వ్యూహాత్మకమైన హక్కులను ఏ శక్తీ మార్చలేదు. చరిత్రను వక్రీకరించి నీటిని సాధించాలనుకోవడం పాకిస్తాన్ పాలకుల అత్యాశే అవుతుంది. ఉగ్రవాదాన్ని ఆపనంతకాలం, పొరుగు దేశంతో సత్సంబంధాలు కోరుకోనంత కాలం.. పాకిస్తాన్‌కు ఒక్క చుక్క నీరు కూడా దక్కదు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

 

Published : 
  • 25 June 2026, 2:30 PM IST