Top story: భారత్-బంగ్లాదేశ్‌ మధ్య పీక్స్‌కు దౌత్య యుద్ధం.. రంగంలో RAW చీఫ్.. శత్రువుకు దబిడి దిబిడే..!

త్రివేది ఢిల్లీకి వచ్చినప్పుడే.. రా చీఫ్ ఎందుకెళ్లారు? హసీనా సర్కార్ పతనం, ఢాకాలో రాజకీయ మార్పుల తర్వాత ఏర్పడిన కొత్త సర్కార్‌తో భారత్ అధికారికంగా జరిపిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశమిది.

Post Published By: dialnews
Updated : 13 August 2026, 12:16 PM IST

త్రివేది ఢిల్లీకి వచ్చినప్పుడే.. రా చీఫ్ ఎందుకెళ్లారు? హసీనా సర్కార్ పతనం, ఢాకాలో రాజకీయ మార్పుల తర్వాత ఏర్పడిన కొత్త సర్కార్‌తో భారత్ అధికారికంగా జరిపిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశమిది. కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వ్యత్యాసాలను, అపనమ్మకాలను తొలగించి.. నూతన అధ్యాయానికి పునాది వేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్, ప్రధాని విదేశాంగ సలహాదారు హుమయూన్ కబీర్ సమక్షంలో సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ఈ సమావేశంలోనే బంగ్లాదేశ్ యంత్రాంగం అత్యంత సున్నితమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాను వీలైనంత త్వరగా తమకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారికంగా విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన భారత దౌత్య వర్గాలకు సవాలుగా మారింది. ఇండియాకు నమ్మకమైన భాగస్వామిగా ఉన్న నాయకురాలికి ఇచ్చిన ఆశ్రయాన్ని నిలబెట్టుకోవాలా, లేక సరిహద్దులో కొత్త ప్రభుత్వంతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలా అనే ధర్మసంకటంలో పడిపోయింది ఢిల్లీ.

బంగ్లాదేశ్ మరో కఠిన షరతును కూడా భారత్ ముందుంచింది. గతేడాది డిసెంబర్ 12న హత్యకు గురైన విద్యార్థి నాయకుడు షాహిద్ ఉస్మాన్ హాదీ హత్య కేసును ఢాకా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ హత్యతో ప్రమేయం ఉన్న ముఖ్య నిందితులు సరిహద్దు దాటి భారత్‌లో తలదాచుకున్నారని ఆరోపిస్తూ.. వారిని వెంటనే అరెస్టు చేసి తమకు అప్పగించాలని ఫారిన్ మినిస్టర్ ఖలీలుర్ రెహమాన్ సమక్షంలో దినేష్ త్రివేదికి స్పష్టం చేసింది ఢాకా యంత్రాంగం. ద్వైపాక్షిక సంబంధాలు కేవలం సరిహద్దు నిర్వహణ, వాణిజ్యానికే పరిమితం కాకుండా నేరస్థుల అప్పగింత అంశం చుట్టూ తిరగడం ఈ భేటీలోని అసలు తీవ్రతను తెలియజేస్తోంది. ఈ దౌత్య ఉద్రిక్తతలకు కారణం ఆగస్టు 5న న్యూఢిల్లీ వేదికగా జరిగిన సంఘటనే. 'ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా ఏర్పాటు చేసిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హసీనా మాట్లాడారు. "ఎన్ని కేసులు పెట్టినా, మరణశిక్ష విధించినా భయపడేది లేదు.. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను" అని హసీనా సవాల్ విసరడం బంగ్లాదేశ్ పాలకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

నిజానికి.. ఈ పరిణామాలు సంక్లిష్టంగా మారకముందే భారత్ స్పందించింది. ఆగస్టు 5 నాటి వర్చువల్ ఈవెంట్ ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని, భారత ప్రభుత్వానికి దాంతో ఎలాంటి సంబంధం లేదని, అక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలను భారత్ సమర్థించదని స్పష్టం చేసింది. ఒకవైపు ఆశ్రయం పొందుతున్న హసీనాకు భద్రత కల్పిస్తూనే.. మరోవైపు ఢాకాలో నూతన ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు భారత్ అనుసరించిన 'స్ట్రాటజిక్ డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ ఇది. అయితే ఇది కేవలం దౌత్య క్లారిటీ మాత్రమేనని, అసలు చర్చలు తెరవెనుక సాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఢాకాలో ప్రధాని తారీఖ్ రెహమాన్‌తో సుదీర్ఘ సంప్రదింపులు పూర్తయిన మర్నాడే.. దినేష్ త్రివేది అత్యవసరంగా న్యూఢిల్లీకి విమానమెక్కారు. మంగళవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఒక భారత రాయబారి కేవలం 24 గంటల వ్యవధిలో రెండు దేశాల ప్రధానులతో వన్ టు వన్ మాట్లాడటం దక్షిణాసియా దౌత్య చరిత్రలోనే ఇదే తొలిసారి.

ప్రధానితో జరిగిన భేటీలో హైకమిషనర్ దినేష్ త్రివేది సమగ్రమైన నివేదికను సమర్పించారు. తారీఖ్ సర్కార్ ఆశిస్తున్న సహకారం ఏంటి? షేక్ హసీనా అప్పగింతపై వారు ఎంత కఠినంగా ఉన్నారు? సరిహద్దుల్లో ఉగ్రవాద మూకాలు మళ్లీ తలనెత్తకుండా తీసుకుంటున్న చర్యలేంటి? బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణ, భారతీయ ప్రాజెక్టుల భద్రత ఎలా ఉంది? అనే అంశాలపై ప్రధానికి పూర్తి వివరాలు అందించారు. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత్ ఒక వ్యూహాత్మక మార్గాన్ని ప్రకటించింది. అదే ప్రజల ఆధారిత విధానం. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు.. కానీ రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య అనుబంధం శాశ్వతమైనది. కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీకో లేదా నాయకుడికో పరిమితం కాకుండా.. బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం, ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సరఫరా, కనెక్టివిటీ ప్రాజెక్టులు నిరంతరాయంగా సాగడమే భారత ప్రాథమిక లక్ష్యమని ప్రధాని మోదీ మార్గదర్శకత్వం ద్వారా సౌత్ బ్లాక్ స్పష్టం చేసింది. కానీ, దినేష్ త్రివేది ఢిల్లీకి వచ్చిన సమయంలో raw చీఫ్ ఢాకాకు ఎందుకెళ్లారు?

బంగ్లాదేశ్‌లో ఏర్పడిన ఈ రాజకీయ గ్యాప్‌ను, ఇండియా పట్ల అక్కడ వ్యాపిస్తున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చైనా, పాక్ ISI తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకే raw చీఫ్ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. పైగా బంగ్లాదేశ్‌తో సంబంధాలు దెబ్బతింటే.. భారత్ ఈశాన్య రాష్ట్రాలను కలిపే 'చికెన్స్ నెక్ ప్రాంతానికి భద్రతా ముప్పు ఏర్పడుతుంది. అందుకే ఢాకాతో ఎంతటి విభేదాలున్నా.. దౌత్య మార్గాలను మూసేయకుండా, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. ప్రధాని మోదీతో దినేష్ త్రివేది జరిపిన ఈ అత్యవసర భేటీ.. రాబోయే రోజుల్లో ఇండియా-బంగ్లాదేశ్ సంబంధాలను సరికొత్త దిశగా నడిపించబోతోంది. ఒకవైపు మిత్రధర్మం, మరొకవైపు సరిహద్దు భద్రత, ప్రాంతీయ స్థిరత్వం.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ భారత్ తన దౌత్య చతురతను ప్రదర్శించాల్సి ఉంది. ప్రస్తుతం మోదీ సర్కార్ అదే చేస్తోంది.

 

Published : 
  • 13 August 2026, 12:16 PM IST