తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినపడుతోన్న ఒకటే సౌండ్.. బీఆర్ఎస్ కారు 'రివర్స్ గేర్'. గ్లోబల్ సిటీ, రేసింగ్ అంటూ ఇంటర్నేషనల్ లెవల్లో తెలంగాణా ఇమేజ్ కోసం ట్రై చేసిన మాజీ మంత్రి కేటీఆర్, ఇప్పుడు అదే 'ఫార్ములా-ఈ' స్కామ్‌లో ఏసీబీ వేస్తున్న ఉచ్చులో చిక్కుకోవడం క్యాడర్ కు మింగుడు పడటం లేదు. అప్పట్లో అధికారం అండతో తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు ఊహించని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో పైసల్లేవు అని చెబుతూనే, ఏకంగా 54.88 కోట్ల రూపాయలను ఎవరికీ చెప్పకుండా, ఏ కేబినెట్ ఆమోదం లేకుండా లండన్ కేంద్రంగా పనిచేసే 'ఫార్ములా ఈ ఆపరేషన్స్' సంస్థకు కట్టబెట్టారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ.
అది కూడా.. ఎన్నికల కోడ్ సమయంలో, అసలు ఆ డబ్బు ఎందుకు పంపారు? ఎవరి కోసం పంపారు? అంటే సమాధానం లేదనేది దర్యాప్తు వర్గాల్లో వినపడుతోన్న మాట. 2023 అక్టోబర్ - నవంబర్ సమయంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ఏవైనా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. కానీ, ఆ అనుమతి లేకుండానే నిధులు పంపడం పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు. నిధుల విడుదలపై పూర్తి వివరాలతో ఛార్జ్ షీట్ ను ఏసీబీ అధికారులు సిద్దం చేసారు.కేవలం కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఈ తతంగం నడిచిందని ఐఏఎస్ అరవింద్ కుమార్ అంగీకరించడం, ఈ స్కామ్‌లో కేటీఆర్ పాత్రను ఏ-1 స్థాయికి తీసుకెళ్లింది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి, నిబంధనలను తుంగలో తొక్కి కేటీఆర్ అడుగులకు మడుగులొత్తిన అరవింద్ కుమార్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆయనకు అరెస్ట్ గండం పొంచి ఉంది. ఒక అధికారి, రాజకీయ నాయకుడి కోసం ఇంతటి రిస్క్ తీసుకున్నారంటే, దాని వెనుక ఉన్న ఉన్న కారణాలు ఏంటీ అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ఇదే ఈ కేసులో అత్యంత ఘాటు అంశం.. ప్రభుత్వం నుంచి రూ.55 కోట్లు అటు వెళ్లాయి.. మరుసటి క్షణమే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.45 కోట్లు వచ్చి పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది యాదృచ్ఛికమా? లేక పక్కా స్కెచ్‌తో జరిగిన మనీ లాండరింగా? ప్రజల సొమ్మును విదేశీ సంస్థకు పంపి, దాన్ని తిరిగి పార్టీ ఫండ్ గా మార్చుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు గులాబీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ పరిస్థితి దారుణంగా ఉందనే మాట కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతోంది.ఒకవైపు ఫార్ములా-ఈ ఉచ్చు. మోయిన్‌బాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ మరకలు, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ భూతం ఇవన్నీ కాబోయే గులాబీ బాస్ కు చుక్కలు చూపిస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన ఈ కేసులో శిక్ష పడితే అది కనీసం 10 ఏళ్ల జైలు శిక్షకు దారితీస్తుంది. కేటీఆర్, అరవింద్ కుమార్‌ల జంట ఇప్పుడు ఏసీబీ కోర్టు మెట్లు ఎక్కడం ఖాయంగా కనపడుతోంది. ఒకప్పుడు రేసింగ్ కార్ల శబ్దం వినిపించిన హైదరాబాద్ రోడ్లపై, ఇప్పుడు 'సైరన్' మోత మోగే సమయం ఆసన్నమైంది. కేటీఆర్ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.
"హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచడానికే రేస్ నిర్వహించాం, ఇందులో అవినీతి లేదు" అని ఆయన వాదిస్తున్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పటికీ, అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుందని భావిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయగానే ఈడీ తన కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చు. విదేశీ కరెన్సీ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను కూడా ఖాతరు చేయలేదని ఛార్జ్ షీట్‌లో ఏసీబీ అధికారులు పేర్కొనడం గమనార్హం.రేసు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ నుండి బిఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సుమారు రూ.40-45 కోట్లు అందాయని, ఇది క్విడ్ ప్రో కో అని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారమే చార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించే అవకాశం ఉంది.