Top story: బీఆర్ఎస్ ఆత్మపరిశీలనలో పడిందా…? మళ్లీ టీఆర్ఎస్‌గా మారబోతోందా…?

బీఆర్ఎస్‌లో ఆత్మపరిశీలనలో పడిందా ? మళ్లీ టీఆర్ఎస్‌గా మారడం గ్యారెంటీనా ? నిజంగానే బీఆర్ఎస్‌...టీఆర్ఎస్‌గా పునర్జీవం పోసుకుంటుందా ? బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు దేనికి సంకేతం ? అదే పేరుతో మరొకరు పార్టీ పెడతారన్న భయమా ?

Post Published By: dialnews
Updated : 15 April 2026, 11:50 AM IST

బీఆర్ఎస్‌లో ఆత్మపరిశీలనలో పడిందా ? మళ్లీ టీఆర్ఎస్‌గా మారడం గ్యారెంటీనా ? నిజంగానే బీఆర్ఎస్‌...టీఆర్ఎస్‌గా పునర్జీవం పోసుకుంటుందా ? బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు దేనికి సంకేతం ? అదే పేరుతో మరొకరు పార్టీ పెడతారన్న భయమా ? తెలంగాణలో మనుగడ సాధించాలంటే...టీఆర్ఎస్‌ పేరు ఉంటే మంచిదన్న నిర్ణయానికి బీఆర్ఎస్‌ శ్రేణులు వచ్చాయా ? ఇప్పుడిదే హాట్‌టాపిక్‌ మారింది.బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు మళ్లీ తెరమీదకు వస్తోంది. కేడర్, నేతల నుంచి టీఆర్ఎస్‌గా మార్చాలని ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ నినాదంతో పురుడు పోసుకున్న టీఆర్‌ఎస్‌...జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్‌ మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి...పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితాలో విమర్శల పాలయింది. తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్‌...కాలక్రమంలో భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా కేసీఆర్‌...టీఆర్ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చేశారు.

కర్ణాటక, పంజాబ్‌, ఢిల్లీ, మహారాష్ట్రల్లో తిరిగారు. మహారాష్ట్రలో అయితే భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. స్థానిక ఎన్నికల్లో దారుణ ఫలితాలను చవిచూసింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చడాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో బీఆర్ఎస్‌ హైకమాండ్‌ ఆత్మపరిశీలనలో పడింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌...మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు గురించి పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో కొన్ని చిన్నచిన్న తప్పులు చేశామని అంగీకరించారు. అప్పుడు ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగిందని..గతంలో జరిగిన తప్పులపై అధ్యయనం చేశామని కేటీఆర్‌ వెల్లడించడం ఆసక్తికరమైన అంశం. ఆ లోపాలను సరిదిద్దుకుంటూనే...ముందుకు సాగాలని బీఆర్ఎస్‌ డిసైడ్‌ అయింది. ఈ సారి వచ్చేది బీఆర్‌ఎస్సే...కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు గురించి పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు.

కేటీఆరే...పార్టీ పేరు మార్పుపై వ్యాఖ్యలు చేయడంతో...తెలంగాణ రాజకీయాల్లో ఈ హాట్‌ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్‌గా...తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్‌ ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు సత్తా చాటింది. ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం అన్నట్లు వెలుగు వెలిగింది. పదేళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్‌ పార్టీ పేరు మార్చేశారు. అక్కడి నుంచి బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు తగలడం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవడం అటుంచితే...పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం పార్టీ శ్రేణులు అవమానంగా భావించారు.

కొందరు నేతలు కాంగ్రెస్‌, బీజేపీల్లోకి వెళ్లిపోవడంతో...బీఆర్ఎస్‌ పునరాలోచనలో పడింది. పార్టీ పేరును బీఆర్ఎస్‌ నుంచి టీఆర్ఎస్‌గా మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై కొందరు నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్‌ కంటే టీఆర్ఎస్‌ అనే పేరు కలిసి వస్తుందని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్‌ నుంచి బహిష్కరణకు గురయిన కల్వకుంట్ల కవిత కొత్తగా పార్టీ పెడుతున్నారు. పార్టీకి...తెలంగాణ రాష్ట్ర సమితిగా పెట్టాలని ఫిక్స్‌ అయ్యారట. అందుకే టీఆర్ఎస్‌ అనే బ్రాండ్‌ కవితకు వెళ్లకుండా...తమకు సొంతమని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్‌ పేరు టీఆర్‌ఎస్‌ మారుతుందని ముందే సంకేతాలు ఇచ్చేశారు.బీఆర్ఎస్‌ పేరును టీఆర్ఎస్‌గా మార్చే అంశాన్ని పలువులు నేతలు అనేక సందర్బాల్లో ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువాను మెడలో వేసుకోవడం హాట్ టాపిక్‌ అయింది. అది యాదృశ్చికమా ? లేకుంటే ఉద్దేశపూర్వకంగానే వేసుకున్నారా ? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

పార్టీ పేరు మార్పుపై కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నామని వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. పార్టీ పేరు మార్పులో తాను కూడా పాత్రధారినని అంగీకరించారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణ అంశంతో బీఆర్ఎస్‌కు ముడివిడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామని వెల్లడించారు. మరోవైపు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం...తాము ఇక నుంచి పార్టీ పేరును బీఆర్ఎస్ పేరుతో పిలవమని టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పేరును పిలుస్తామని అన్నారు. దీంతో త్వరలోనే పార్టీ పేరు మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా? అనే చర్చ గులాబీ శ్రేణుల్లో మొదలైంది. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్‌ నేతలు భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Published : 
  • 15 April 2026, 11:50 AM IST