టాలీవుడ్లో కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. థియేటర్లలో కంటే ముందే మొబైల్స్‌లోకి తెచ్చేసిన అత్యంత వివాదాస్పద పైరసీ సైట్ ‘ఐబొమ్మ’. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారి, విదేశాల నుండి ఆపరేట్ చేస్తూ పోలీసులకే సవాల్ విసిరిన ఇమ్మడి రవిని గతంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఐబొమ్మ ద్వారా వందల కోట్లు ఆర్జించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే ఐబొమ్మ రవి..ఇప్పుడు కనీసం తన కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నా అంటూ నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు కోట్ల సామ్రాజ్యాన్ని ఏలిన ఐబొమ్మ రవికి అంతటి ఆర్థిక కష్టాలు ఎందుకు వచ్చాయి?
అసలు రవికి ఈ పరిస్థితి రావడానికి కారణం తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు వేసిన పక్కా వ్యూహం. ఐబొమ్మ ద్వారా అక్రమంగా సంపాదించిన నిధులపై నిఘా పెట్టిన పోలీసులు, కేసు దర్యాప్తులో భాగంగా ఇమ్మడి రవికి సంబంధించిన అన్ని రకాల బ్యాంక్ ఖాతాలను, ప్రాపర్టీ డిపాజిట్లను పూర్తిగా ఫ్రీజ్ చేసేశారు. రవికి చెందిన వివిధ దేశీయ, అంతర్జాతీయ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సుమారు రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు లీగల్ గా హోల్డ్‌లో పెట్టారు. దీనితో పాటు ఆయన ఇంట్లో దొరికిన నగదును కూడా సీజ్ చేశారు.
అంటే రవికి సంబంధించిన అకౌంట్లలో కోట్లాది రూపాయల బ్యాలెన్స్ ఉన్నప్పటికీ.. అందులో నుండి రూపాయి కూడా విత్‌డ్రా చేసుకునే లేదా వాడుకునే అవకాశం లేకుండా చట్టపరంగా లాక్ అయిపోయింది. ఒక్కసారిగా బ్యాంక్ అకౌంట్లన్నీ స్తంభించిపోవడంతో రవి కుటుంబం తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోయింది. ఇక్కడ మనం ఐబొమ్మ రవి చేసిన నెట్వర్క్ స్కామ్ తీవ్రతను కూడా గమనించాలి. కేవలం ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన రవి, 2019 లాక్డౌన్ సమయంలో ఐబొమ్మ సైట్‌ను ప్రారంభించాడు.
కొత్త సినిమాలను హ్యాక్ చేసి, కొన్ని గంటల్లోనే హెచ్డీ క్వాలిటీలో అప్లోడ్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టాన్ని మిగిల్చాడు. పోలీసులు దర్యాప్తులో రవి వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌ల నుండి దాదాపు 21,000 పైరసీ సినిమాలు, 50 లక్షల మంది యూజర్ల డేటాను స్వాధీనం చేసుకున్నారు. కేవలం సినిమాలే కాకుండా, తన సైట్ లో ‘1win’, ‘1xbet’ వంటి అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా రవి దాదాపు 20 కోట్ల రూపాయల వరకు సంపాదించి ఫ్లాట్లు, ప్లాట్లు కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపిన వ్యక్తి, ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ రాగానే దొరికిపోయాడు.
అరెస్ట్ అయి చంచల్‌గూడ జైల్లో కొన్ని రోజులు గడిపి, ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చిన రవికి.. అసలు కష్టాలు ఇప్పుడు మొదలయ్యాయి. చేతిలో రూపాయి లేకపోవడంతో తాజాగా ఆయన హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్లో రవి తన దీన స్థితిని వివరిస్తూ.. బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ అయిపోవడం వల్ల దైనందిన జీవితం గడవడం అత్యంత నరకంగా మారిందని పేర్కొన్నాడు. తన భార్యాపిల్లల పోషణ, ఇల్లు గడవడానికి అవసరమైన నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు.
కుటుంబ సభ్యుల అత్యవసర వైద్య ఖర్చులకు కూడా చేతిలో పైసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మానవతా దృక్పథంతో కనీసం ఇల్లు గడవడానికి వీలుగా తన ఫ్రీజ్ అయిన బ్యాంక్ ఖాతాలలో కొన్నింటినైనా అన్‌ఫ్రీజ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును వేడుకున్నాడు. ఇమ్మడి రవి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరుపుతోంది. రవి చేసిన నేరాల తీవ్రత దృష్ట్యా, అక్రమ సంపాదనతో కూడిన ఈ అకౌంట్లను ఓపెన్ చేయడానికి పోలీసులు ఖచ్చితంగా నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు సినీ రంగాన్ని వణికించిన ఐబొమ్మ రవికి కోర్టు కనీస అవసరాల కోసం అకౌంట్లు ఓపెన్ చేసే ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.