Top story:తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా.. ఎలక్షన్ సరే.. వీటి సంగతేంటి ?
ఎప్పుడొప్పుడా అని ఎదురుచూస్తున్న పురపాలికల ఎన్నిలకు నగారా మోగింది. ఆశ్చర్యపోయి.. అవాక్కయ్యే రేంజ్‌లో కనిపిస్తున్నాయ్ డేట్లు.
ఎప్పుడొప్పుడా అని ఎదురుచూస్తున్న పురపాలికల ఎన్నిలకు నగారా మోగింది. ఆశ్చర్యపోయి.. అవాక్కయ్యే రేంజ్‌లో కనిపిస్తున్నాయ్ డేట్లు. సమయం లేదు మిత్రమా.. ఇక రణమే అని అభ్యర్థులు పరుగులు పెట్టే రేంజ్‌లో షెడ్యూల్ బయటకు వచ్చింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత షెడ్యూల్ విడుదల చేశారు. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. జనవరి 30తో ముగుస్తుది. 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలిస్తారు.
ఫిబ్రవరి 3 వరకు నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది. ఎక్కడైనా రీపోలింగ్‌కు అవకాశం ఉంటే.. ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు.. 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 53లక్షల మందికి పైగా ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ మధ్యే పంచాయితీ ఎన్నికలు జరగగా.. ఫలితాలతో హస్తం పార్టీ మంచి జోష్‌లో కనిపిస్తోంది. ఐతే తామేం తక్కువ కాదని కారుపార్టీ కూడా సవాల్ విసురుతోంది. ఇజ్జత్ కా సవాల్ అనే రేంజ్‌లో ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు తీసుకోవడంతో.. అసెంబ్లీ ఎలక్షన్ రేంజ్ ఫైటింగ్ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటనతో.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. రంజాన్, శివరాత్రి పండుగలను దృష్టిలో ఉంచుకుని.. ఈలోపే ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావించింది.
జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన చోట్ల ఈ ఎన్నికలు జరుగుతాయ్. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయానికి ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం కాగా.. అధికారులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. సర్పంచ్ ఫలితాలు.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయ్. గ్రామాల్లో వచ్చిన ఫలితాలు.. పార్టీల బలాబలాలేంటో చూపించాయ్. అదే ఊపు పట్టణాల్లోనూ కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక అటు పురపోరులో అధికార పార్టీకి ఝలక్ ఇవ్వాలని.. విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయ్. అభ్యర్థుల ఎంపిక, కూటములు, స్థానిక సమీకరణలపై పార్టీల్లో.. లోపల్లోపల చర్చలు ఊపందుకున్నాయ్. ఓవరాల్‌గా ఫిబ్రవరి అంతా.. తెలంగాణ అంతా ఎన్నికల సందడి కనిపించడం ఖాయం…











