Top story: దెబ్బ అదుర్స్.. యూరోపియన్ దేశాల రక్షకుడిగా భారత్.. ట్రంప్‌ను చావుదెబ్బకొట్టిన మోడీ సర్కార్…!

బహుశా ఈ దృశ్యాలు ట్రంప్‌ను అతడి టీమ్‌నూ చాలా కాలం వెంటాడతాయి. ఎందుకంటే, ఇక్కడ జరిగింది జస్ట్ ఒక ఫ్రీ ట్రేడ్ డీల్ కాదు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2026 | 12:55 PMLast Updated on: Jan 29, 2026 | 12:55 PM

India As The Protector Of European Countries The Modi Government Dealt A Crushing Blow To Trump

బహుశా ఈ దృశ్యాలు ట్రంప్‌ను అతడి టీమ్‌నూ చాలా కాలం వెంటాడతాయి. ఎందుకంటే, ఇక్కడ జరిగింది జస్ట్ ఒక ఫ్రీ ట్రేడ్ డీల్ కాదు.. అంతకుమించి. తన మిత్రులు తనకు వ్యతిరేకంగా తన ప్రత్యర్ధితో చేతులు కలిపారు. అమెరికా ఏదేశంపై అయితే భారీగా సుంకాలు విధించమని కోరిందో వాళ్లే ఇప్పుడు సుంకాలను జీరోకు తెచ్చారు. తద్వారా మాకు అమెరికా కంటే భారత్‌తో స్నేహమే బెస్ట్ ఆప్షన్ అని ట్రంప్ ముఖంమీదే చెప్పేశారు. ఇంకేముంది, అమెరికా కడుపుమంట బయటపెట్టుకోవడం షురూ చేసింది. బెదిరించిన నోటితోనే అన్యాయం, అక్రమం అంటూ గగ్గోలు పెడుతోంది.

భారత్-ఈయూ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేతులు మారుతున్న సమయంలోనే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలివి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు యూరోప్ కంటే అమెరికానే ఎక్కువ త్యాగం చేసిందని, అలాంటిది భారత్‌‌కు ఈయూ సహకరించడం సరికాదని విమర్శించాడు. ఈ ఒప్పందం పరోక్షంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడమేనని ఆరోపించాడు. అమెరికా ఆంక్షలను లెక్కచేయకుండా యూరోపియన్ దేశాలు భారత్‌‌తో భారీ ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వాషింగ్టన్‌‌కు మింగుడుపడటం లేదు. ఈ క్రమంలోనే ట్రంప్ టీమ్ హిస్టారికల్ డీల్‌పై నోటికొచ్చింది పేలుతోంది. ఒక్క స్కాట్ బెస్సెంటే కాదు.. నాటో చీఫ్ మార్క్ రుట్టె కూడా అదే చేశాడు. కానీ, భారత్-ఈయూ డీల్‌పై అగ్రరాజ్యం ఎందుకిలా కడుపుమంట బయటపెట్టుకుటోంది?

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా వర్ణించగా, ప్రధాని మోడీ దీనిని భారత్‌ను మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారేందుకు కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ రెండూ నిజాలే. అందుకే, ట్రంప్ టీమ్ ఇంతలా కంగారు పడుతోంది. భారత ఎగుమతులను దెబ్బతీయాలని ట్రంప్ ప్రయత్నించినప్పటికీ.. మోడీ సర్కార్ ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవడంలో సక్సెస్ అయింది. గతేడాది ఆగస్టు నాటికి మన దేశ ఎగుమతులు రికార్డు స్థాయిలో 69.16 బిలియన్ డాలర్లకు చేరాయి. యూఏఈ, నెదర్లాండ్స్, చైనా వంటి దేశాలతో వాణిజ్యం పెంచుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడిని ఇండియా తట్టుకోగలిగింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌తో భారీ ఒప్పందం ద్వారా ఎవరూ టచ్ చేయలేనిస్థాయికి భారత్ చేరుకోబోతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్నపరిణామాలూ భారత్‌కు అనుకూలంగా మారుతున్నాయి.

అమెరికాకు కేవలం భారత్‌‌తోనే కాదు, తన మిత్రదేశాలైన నాటో సభ్యులతో కూడా విభేదాలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌‌కు సైనిక సాయం నిలిపివేస్తానని ట్రంప్ ప్రకటించడం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు నచ్చలేదు. దీనికితోడు డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటా అన్న ట్రంప్ ప్రతిపాదన, కెనడాపై 100శాతం పన్నుల వార్నింగ్ నాటో దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ గ్యాప్‌‌లో భారత్-ఈయూ దగ్గరవ్వడం అమెరికా ఆధిపత్యానికి గట్టి దెబ్బగా మారింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు.. తాము లేకపోతే యూరోపియన్ దేశాలకు భద్రత ఉండదు అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్న అమెరికాను ఈ విషయంలో కూడా భారత్ గట్టి దెబ్బ కొట్టింది. ఎందుకంటే, ఈ ఒప్పందం కేవలం వస్తువులకే పరిమితం కాలేదు. యూరోపియన్ యూనియన్ దేశాలకు రక్షకుడిగా భారత్ అవతరించబోతోంది. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్టనర్‌షిప్ అందులో భాగమే. ఈ డీల్ ద్వారా సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద వ్యతిరేక చర్యల విషయంలో భారత్, ఈయూ దేశాలు నేరుగా సహకరించుకుంటాయి. భారత రక్షణ రంగ సంస్థలు, యూరోపియన్ రక్షణ పరిశ్రమలు కలిసి పని చేసేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.

అమెరికా తన రక్షణ బంధాలను వ్యాపార కోణంలో చూస్తుండటంతో, యూరోపియన్ దేశాలు భారత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా చూశాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ తన రక్షణ, ఆర్థిక అవసరాల కోసం అమెరికాపైనే కాకుండా, ఇండియాతో బంధాన్ని పెంచుకోవడం ద్వారా స్వయం ప్రతిపత్తిని చాటుకోవాలనుకుంది. రక్షణ పరికరాలు, సాంకేతికత కోసం అగ్రరాజ్యంపై ఆధారపడటాన్ని తగ్గించి, భారత్‌తో ఉమ్మడి ఉత్పత్తి ద్వారా తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని భావించింది. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్టనర్‌షిప్ వెనుక అసలు లక్ష్యం ఇదే. ఇలా చెప్పుకుంటూపోతే భారత్-ఈయూ మధ్య జరిగింది కేవలం ఒక సాధారణ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాదు.. అమెరికా అహం దించి భారత్‌ను అందలం ఎక్కించే హిస్టారికల్ అగ్రిమెంట్. ఇది తెలుసు కాబట్టే ట్రంప్ టీమ్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతోంది. కానీ, ఎంత రెచ్చిపోయినా ఒరిగేదేమీ లేదు. అమెరికాకు జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది.