Top story: పేపర్‌ లీక్‌ విషయంలో అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో 30 ఏళ్ల సీన్‌ రిపీట్‌.!

రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. నాడు ఏ సమస్యపై పోరాడి ఒక వ్యక్తి జాతీయ నాయకుడిగా ఎదిగారో.. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే సమస్య ఆయన మంత్రి పదవి పోవడానికి కారణమైంది.

Post Published By: dialnews
Updated : 27 July 2026, 12:40 PM IST

రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. నాడు ఏ సమస్యపై పోరాడి ఒక వ్యక్తి జాతీయ నాయకుడిగా ఎదిగారో.. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే సమస్య ఆయన మంత్రి పదవి పోవడానికి కారణమైంది. ఆయనే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒక 'పేపర్ లీక్' వ్యవహారం ఆయన రాజకీయ జీవితంలో ఎంతటి నాటకీయ పరిణామాలకు దారితీసిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'నీట్' పేపర్ లీక్ వ్యవహారం ఎంత పెద్ద దుమారం రేపిందో దేశం మొత్తం చూసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. నేటి Gen జ్ విద్యార్థులు ఏకంగా నెల రోజుల పాటు రోడ్లెక్కి ఆందోళనలు చేశారు.

ప్రభుత్వం రీ-నీట్ నిర్వహించినా, ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా విద్యార్థులు శాంతించలేదు. ఈ ఆందోళనల సెగ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా తగలడంతో, చివరికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక సరిగ్గా 30 ఏళ్ల నాటి ఒక చరిత్ర దాగి ఉంది. 1997 వ సంవత్సరంలో ఒడిశా రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షల పేపర్ లీక్ అయ్యింది. అప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ సెక్రటేరియట్ ముందు 1500 మంది విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేసినా, ఒంటిపై దెబ్బలు తగిలి ఫ్రాక్చర్లు అయినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అప్పటి ఒడిశా ప్రభుత్వం దిగివచ్చి బోర్డు నాయకత్వాన్ని మొత్తం తొలగించింది.

ఆ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్‌కు రాజకీయంగా మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా, కేంద్ర మంత్రిగా మారారు. నాడు పేపర్ లీక్ కు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిని పోరాడిన అదే నాయకుడు.. నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మళ్లీ ప్లస్ 2 విద్యార్థులకు సంబంధించిన 'నీట్' పేపర్ లీక్ కావడం విచిత్రం. నాడు స్టూడెంట్ లీడర్ గా ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన, నేడు ప్రభుత్వంలో ఉండి విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి విద్యార్థుల ఆందోళనల ముందు తలవంచి ఆయన రాజీనామా చేయడంతో, విద్యార్థి సంఘాలు..తమ నిరసనలను విరమించాయి. కాలం ఎంత విచిత్రమైంది.. నాడు ఏ సమస్య అయితే ఆయనను అందలానికి ఎక్కించిందో, నేడు అదే సమస్య ఆయన్ని పదవి నుంచి కిందికి దిగేలా చేసింది. రాజకీయాల్లో చరిత్ర ఎలా పునరావృతం అవుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్.

Published : 
  • 27 July 2026, 12:40 PM IST