Top story:అప్పుడు ఆ ఇద్దరు… ఇప్పుడు ఈ ఇద్దరు,తమిళ రాజకీయాల్లో కొత్తతరం…. ఆ ఇద్దరు…!

అప్పుడు ఎంజీఆర్- కరుణానిధి! ఇప్పుడు విజయ్ వర్సెస్ ఉదయనిధి! తమిళ రాజకీయాల్లో గతకాలపు ఈక్వేషన్లతో కొత్తశకం మొదలైంది! ఇద్దరిలో చాలా పోలికలు. సినిమా బ్యాక్‌గ్రౌండ్. ఒకటే కాలేజ్. ఇద్దరూ యువతరానికి ప్రతినిధులు

Post Published By: dialnews
Updated : 15 May 2026, 12:28 PM IST

అప్పుడు ఎంజీఆర్- కరుణానిధి! ఇప్పుడు విజయ్ వర్సెస్ ఉదయనిధి! తమిళ రాజకీయాల్లో గతకాలపు ఈక్వేషన్లతో కొత్తశకం మొదలైంది! ఇద్దరిలో చాలా పోలికలు. సినిమా బ్యాక్‌గ్రౌండ్. ఒకటే కాలేజ్. ఇద్దరూ యువతరానికి ప్రతినిధులు. అసెంబ్లీలో ఎదురెదురు సీట్లు! ప్రజల గుండెల్లో నుంచి ఒకరు.. కుటుంబ వారసత్వం నుంచి మరొకరు. కరుణానిధి, ఎంజీ రామచంద్రన్. తమిళనాడు రాజకీయ చరిత్ర లో ఈ రెండు పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. కరుణానిధి పదునైన రాజకీయ వ్యూహకర్త, మాటల మాంత్రికుడైతే.. ఎంజీఆర్- వెండితెరవేల్పు. తమిళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మరోసారి అలాంటి ఈక్వేషనే కనిపిస్తోంది. వారే.. విజయ్‌- ఉదయనిధి స్టాలిన్. విజయ్‌- సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్.

ఈ జననాయగన్- జెన్‌జీ నాయకుడిగా మారి, పార్టీ పెట్టి, రెండేళ్లలో సీఎం కుర్చీ లో కూర్చున్నాడు. ఇక ఉదయనిధి స్టాలిన్. తాత కరుణానిధి.. తండ్రి స్టాలిన్.. మొన్నటివరకు డిప్యూటీ సీఎం. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు సినీ నేపథ్యం కూడా ఉంది. ఈ సమీకరణాన్ని తమిళనాడులో నయా కరుణానిధి- ఎంజీఆర్‌ యుగంగా చెప్పుకోవచ్చుతమిళనాడు రాజకీయాల్లో నాయకులు కేవలం సభల ద్వారా కాదు.. తెరపై పాత్రల ద్వారానే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిస్తారు. కరుణానిధి తన సంభాషణల ద్వారా రాజకీయ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడు. ఎంజీ రామచంద్రన్ మాస్‌ హీరో. పేదల రక్షకుడిగా తెరమీద కనిపించి, అదే ఇమేజ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అదే ఫార్ములా ఈ ఇద్దరి రూపంలో కనిపిస్తోంది. విజయ్‌ తన సినిమాల్లో సామాజిక సందేశాలు, యాంటీ కరప్షన్ డైలాగ్స్, యువతను ఆకట్టుకునే ఇమేజ్‌.. ఇలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయ కుటుంబంలో పెరిగినా, సినిమా నిర్మాణం-నటన ద్వారా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. లయోలా కాలేజీ కనెక్షన్ కూడా ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర కోణం. విజయ్ సీనియర్‌- ఉయదనిధి జూనియర్‌. అదే విషయాన్ని ఉదయనిధి సభలో ప్రస్తావించారు.

ఇలా స్నేహం నుంచి సినిమా మీదుగా రాజకీయం వరకు.. పోటీపడి నడిచారు ఇద్దరూ. ఉదయనిధి స్టాలిన్‌ నిర్మాతగా విజయ్‌తో హిట్ సినిమాలు తీశాడు. సినిమా రంగంలో పరస్పర సంబంధాలు ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులుగా నిలబడ్డారు. ఆనాడు ఎంజీఆర్ మొదట ద్రవిడ ఉద్యమంలో కరుణానిధితో కలిసి పనిచేశాడు. కానీ తర్వాత వారిద్దరి మధ్య వచ్చిన విభేదాలు తమిళ రాజకీయాలను శాశ్వతంగా మార్చేశాయి.విజయ్‌ బలం-బలగం అంతా ఆయన అభిమానులే. అందులో సామాన్య, పేద, మధ్యతరగతి నుంచి జెన్‌జీ వర్గం దాకా విజయ్‌ వెన్నంటే ఉన్నారు. అతని రాజకీయ శైలి కూడా సోకాల్డ్ సంప్రదాయ నాయకులకంటే భిన్నంగా కనిపిస్తోంది. అడ్డపంచెలు.. ఖద్దరు చొక్కాలు లేవు. కోటు.. వైట్ షర్టుతో ట్రెండ్‌నే మార్చేశాడు.

ప్రజల్లో అసంతృప్తి, అవినీతి వ్యతిరేక భావజాలం, నిరుద్యోగ సమస్య వంటి అంశాలను టచ్ చేస్తూ ముందుకు వెళ్లి సీఎం కుర్చీదాకా వచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎంజీఆర్ తరహాలో ప్రజల మనిషి అనే ఒక ఇమేజ్‌ను ఉన్నాడు. ఇక ఉదయనిధి విషయానికొస్తే.. తాత ,. తండ్రి వారసత్వం.. అవి కాకుండా పార్టీ కేడర్, అన్నిటికీ మించి భయంకరమైన ఆర్థిక బలం. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం. ఎంకే స్టాలిన్‌ తర్వాత DMKలో సహజ వారసుడిగా ఎదుగుతున్న ఉదయనిధి పరిపాలనా అనుభవం సంపాదించుకుంటున్నాడు. అతని రాజకీయ భాష కూడా క్రమంగా అగ్రెసివ్‌గా మారింది. కరుణానిధి తరహాలో సిద్ధాంత రాజకీయాలను, సంస్థాగత బలాన్ని ఆధారంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, ద్రవిడ సిద్ధాంతాన్ని మరింత బలంగా వినిపిస్తున్నాడు.అయితే పోలికలు ఆసక్తికరంగా ఉన్నా.. నాటి కాలం వేరు.. ఇప్పటి జమానా వేరు. 1960- 70లో తమిళనాడు వేరు. ఇప్పటి అరవ రాజకీయం వేరు. కుల-ప్రాంత సమీకరణాలు, యువత ఆలోచనలు, సోషల్ మీడియా యుగం పూర్తిగా భిన్నం.

ఎంజీఆర్ కాలంలో తెరమీద కనిపించిన హీరోనే ప్రజలు నమ్మేవారు. ఇప్పుడు ప్రజలు నాయకుడి వ్యక్తిగత జీవితం నుంచి పరిపాలనా సామర్థ్యం వరకు అన్నింటినీ లెక్కేస్తున్నారు. అందుకే విజయ్‌కు స్టార్‌డమ్ ఒక్కటే సరిపోదు. ఉదయనిధికి వారసత్వం ఉంటే చాలదు.మొత్తంగా తమిళనాడు రాజకీయాలు మరోసారి సినిమా-రాజకీయాలు కలగలిసిన మిక్చర్ పొట్లంలా మారాయి. ఒకవైపు వ్యవస్థతో కూడిన DMK వారసత్వం. మరోవైపు అభిమాన శక్తిని రాజకీయ శక్తిగా మార్చాలనుకుంటున్న విజయ్. ఈ పోటీ కేవలం ఇద్దరు నాయకుల మధ్య మాత్రమే కాదు. ఇది వారసత్వ రాజకీయాలు వర్సెస్ కొత్తతరం ఆకాంక్షల మధ్య పోటీగా కూడా మారబోతోంది. కరుణానిధి-ఎంజీఆర్ పోరాటం తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసింది. ఇప్పుడు విజయ్-ఉదయనిధి పొలిటికల్ వార్ కూడా తమిళనాడు భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించే దిశగా సాగబోతోంది. అందుకే అప్పుడు ఆ ఇద్దరూ రాజకీయాలను శాసించారు.... ఇప్పుడు ఈ ఇద్దరు భవిష్యత్తు రాజకీయాన్ని నడిపించబోతున్నారు.

Published : 
  • 15 May 2026, 12:28 PM IST