"యుద్ధం మీరు మొదలుపెట్టారు.. ముగించేది మాత్రం మేమే". ఇరాన్ చెప్పిన ఈ మాటను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అమెరికాను ఓడించే సీన్ ఆ దేశానికి లేదనీ, చాలా త్వరగానే ఇరాన్ ఓటమి పాలవుతుందనీ లెక్కలు కట్టారు. కానీ, మొండివాడు రాజుకంటే బలవంతుడు అన్న నానుడిని గుర్తు చేస్తూ అమెరికాకే చుక్కలు చూపిస్తోంది ఆ దేశం. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఓ రేంజ్లో విరుచుకుపడుతోంది. అమెరికాకు వీలైనంత డ్యామేజ్ చేసే దిశగా చీప్ సూసైడ్ డ్రోన్లతో అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు అవే డ్రోన్లను అమెరికా వరకూ పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేల డ్రోన్లతో అమెరికాపై ప్రత్యక్ష దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాము డిసైడ్ అయితే ఏం చేయగలమో అమెరికా చూపించడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా ఈ నిజాలను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయటపెట్టింది.
మిడిల్ ఈస్ట్ యుద్ధం తీవ్ర రూపు దాల్చుతున్న వేళ FBI సంచలన నివేదిక విడుదల చేసింది. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో అమెరికాపై దాడికి ప్రయత్నిస్తోందన్నదే ఆ నివేదిక సారాంశం.ఆ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఇరాన్ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావించింది. గుర్తుతెలియని నౌకల ద్వారా అమెరికా ప్రాదేశిక జలాల సమీపానికి చేరుకుని, అక్కడి నుంచి మానవ రహిత విమానాల ద్వారా కాలిఫోర్నియాలోని కీలక ప్రాంతాలపై ఆకస్మిక దాడులు చేయడమే ఇరాన్ లక్ష్యమని నిర్ధారించింది. ఒకవేళ ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు చేస్తే, దానికి ప్రతిగా ఈ డ్రోన్ వార్‌ను మొదలుపెట్టాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయి? ఖచ్చితమైన లక్ష్యాలు ఏవి? అనేదానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీఐ సూచించింది. ఈ క్రమంలోనే అమెరికా పశ్చిమ తీరంలో ఎల్.ఏ. షెరీఫ్ విభాగం అలర్ట్ అయింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది.
ఎఫ్‌బీఐ రిపోర్టులపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ రియాక్షన్ ఇది. ఈ ముప్పుపై నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా.. భద్రతా బలగాలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఇదే అంశంపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించాడు. తానేమీ భయపడటం లేదని, అమెరికా భద్రతా వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. కానీ, ఇరాన్ నిజంగానే అమెరికాపై డ్రోన్ దాడులు నిర్వహించగలదా? అంటే, టెక్నికల్‌గా సాధ్యమే, కానీ ఆచరణలో మాత్రం చాలా కష్టం. ఎందుకంటే, ఇరాన్ దగ్గర ఉన్న షాహెద్- 136 వంటి సూసైడ్ డ్రోన్లు సుమారు 2వేల నుండి 2వేల 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు.
ఇరాన్ నుండి నేరుగా అమెరికాకు ఉన్న దూరం 10వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ. కాబట్టి ఇరాన్ తన భూభాగం నుండి అమెరికాపై డ్రోన్లను ప్రయోగించలేదు. ఎఫ్‌బీఐ హెచ్చరించినట్టు, అమెరికా తీరానికి సమీపంలో ఉండే నౌకల నుండి లేదా మెక్సికో వంటి పొరుగు దేశాల నుండి డ్రోన్లను ప్రయోగించే అవకాశం ఉంది.
అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే సాధారణ నౌకల నుండి సూసైడ్ డ్రోన్లు ప్రయోగించి, అమెరికాలోని కాలిఫోర్నియా వంటి పశ్చిమతీర నగరాలను లక్ష్యం చేసుకోవడానికి అవకాశాలున్నాయి. అలాగే మెక్సికోలో కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్‌తో లేదంటే అక్కడ ఉన్న తమ ఏజెంట్లతో కలిసి చిన్నపాటి డ్రోన్లను సరిహద్దులు దాటించి దాడులు చేసే ప్రమాదం ఉందని అగ్రరాజ్యం ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, అమెరికా లోపలే ఉంటూ స్థానికంగా దొరికే డ్రోన్లు ఉపయోగించి దాడులు చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అయితే, అమెరికా రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనది.పేట్రియాట్, థాడ్ వంటి వ్యవస్థలతో ఇరాన్ ప్రయోగించే డ్రోన్లను గాలిలోనే కూల్చివేసే అవకాశాలున్నాయి.
కానీ, ఇక్కడ ఇరాన్ వ్యూహం అమెరికాను ఓడించడం కాదు.. ఆ దేశాన్ని ఆర్థికంగా, మిలిటరీ పరంగా దెబ్బకొట్టడం. ఇందులో భాగంగానే కేవలం 20వేల విలువైన డ్రోన్లతో అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాటిని కూల్చడానికి అమెరికా లక్షల డాలర్ల విలువైన మిస్సైళ్లను వాడాల్సి వస్తుంది. ఫలితంగా ఈ యుద్ధం సుదీర్ఘంగా జరిగితే అమెరికా చేతులెత్తేయాల్సి రావచ్చు.
మొత్తంగా అమెరికాను మిలిటరీ, ఆర్థికంగా దెబబ్కొట్టడమే లక్ష్యంగా ఇరాన్ వ్యూహాలు చేస్తోంది. సింపుల్‌గా సూసైడ్ డ్రోన్లతోనే అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది. ఈ యుద్ధం ఎంత సుదీర్ఘ కాలం సాగితే అమెరికా అంతగా నష్టపోడానికి అవకాశాలున్నాయి. ఎఫ్‌బీఐ హెచ్చరించినట్టు ఒకవేళ అమెరికాలో ఇరాన్ డ్రోన్ దాడులకు దిగితే మాత్రం ఈ యుద్ధం విధ్వంసక మలుపు తిరగడం ఖాయం.