సాధారణంగా పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వధూవరులు ఎన్నో కలలు కంటారు. కానీ, ఇరాన్‌లో జరుగుతున్న ఈ పెళ్లిళ్లు చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. పెళ్లి పీటలపై కూర్చున్న వందలాది జంటలు.. "మేము దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధం" అంటూ బాండ్ పేపర్లపై సంతకాలు చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో ఇరాన్ ప్రభుత్వం ఒక వింతైన వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. అసలు ఏంటో ఈ సామూహిక వివాహాల కథ? పెళ్లి చేసుకున్న జంటలు యుద్ధంలో ఏం చేయబోతున్నారు? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ హుస్సేన్ స్క్వేర్‌లో 110 కి పైగా జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. అయితే ఇది కేవలం సాధారణ పెళ్లి వేడుక కాదు. ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టిన 'జాన్‌ఫదా' అనే పథకంలో భాగంగా ఈ వివాహాలు జరిగాయి. పర్షియన్ భాషలో 'జాన్‌ఫదా' అంటే 'సొంత ప్రాణాలను త్యాగం చేయడం' అని అర్థం. ఈ స్కీమ్ కింద పెళ్లి చేసుకున్న జంటలు దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేయాలి.
ఒకవేళ అమెరికా గనుక ఇరాన్‌పై దాడులు ప్రారంభిస్తే.. దేశంలోని కీలకమైన పవర్ స్టేషన్లు, అణు కర్మాగారాలను రక్షించడానికి ఈ జంటలన్నీ అక్కడ 'మానవ హారాలుగా' ఏర్పడి శత్రువుల మిస్సైళ్లకు ఎదురు నిలబడాల్సి ఉంటుంది. ఈ వింతైన స్కీమ్‌లో కేవలం సామాన్యులే కాదు.. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్‌లతో పాటు మిలియన్ల కొద్దీ ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం.ఈ పెళ్లిళ్లు జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. సాధారణంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అలంకరించిన కార్లలో వివాహ వేదిక వద్దకు వస్తారు. కానీ ఇక్కడ వధూవరులు.. పెద్ద పెద్ద మెషిన్ గన్లు అమర్చిన మిలిటరీ జీపుల్లో రౌడీల్లా ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి కూతుళ్లు తెల్లటి హిజాబ్ ధరిస్తే.. పెళ్లి కొడుకులు మిలిటరీ డ్రెస్సులను పోలిన దుస్తులు ధరించారు. వేదిక అంతా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ 'అయాతొల్లా మోజ్తబా ఖమేనీ' భారీ చిత్రపటాలను ఏర్పాటు చేశారు.
ఈ పెళ్లి వేడుకలన్నింటినీ ఇరాన్ స్టేట్ టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ట్రంప్ హెచ్చరికల వల్ల భయపడుతున్న దేశ ప్రజల్లో, సైన్యంలో యుద్ధ మనోధైర్యాన్ని మరియు దేశభక్తిని నూరిపోయడానికే ప్రభుత్వం ఈ లైవ్ టెలికాస్ట్ వ్యూహాన్ని రచించింది. అసలు ఇరాన్ ఎందుకు ఇలా చేస్తోంది? అంతర్జాతీయ రక్షణ నిపుణుల ప్రకారం.. ఇరాన్ ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని పంపాలనుకుంటోంది. అమెరికా తమపై దాడులు చేస్తే, సైన్యమే కాదు.. దేశంలోని యువత, కొత్తగా పెళ్లయిన జంటలు కూడా ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడబోరని ట్రంప్‌కు ఒక మైండ్ గేమ్ ద్వారా చూపిస్తోంది. తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూనే, మరోవైపు ప్రజలను యుద్ధానికి మానసికంగా సిద్ధం చేస్తోంది. పెళ్లి పీటల నుండే శత్రువులపైకి సమరశంఖం పూరిస్తున్న ఇరాన్ యువత నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.