ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ విచారణలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పీఏగా పనిచేసిన కె. నాగేశ్వరరెడ్డి ఆస్తుల చిట్టా విప్పారు సిట్ అధికారులు. నాగేశ్వర్ రెడ్డి కూడబెట్టిన ఆస్తులు చూసి అధికారులు విస్మయం చెందారు. 10 వేల జీతానికి ఉద్యోగం చేసిన వ్యక్తి కేవలం ఐదేళ్ల వ్యవధిలో వందల కోట్లు ఎలా కూడబెట్టారనే దానిపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.2019లో జగన్ ముఖ్యమంత్రి కాకముందు కేఎన్ఆర్ జీవితం చాలా సాదాసీదాగా గడిచింది. కడప జిల్లా కమలాపురంలో ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. తొలుత నెలకు కేవలం 10 వేల రూపాయల జీతానికి ఓ పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత సాక్షిలో చేరి, క్రమంగా జగన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా మారారు. 2019 వరకు సాధారణంగా అద్దె ఇంట్లోనే నివాసం ఉన్న ఆయన.. 2019-2024 మధ్య కాలంలో అకస్మాత్తుగా వందల కోట్లకు పడగలెత్తడం సిట్ అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.
కేఎన్‌ఆర్‌కు భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు సిట్ అధికారులు. బెంగళూరు, తిరుపతిలలో రెండేసి ఫ్లాట్లు, హైదరాబాద్, కడప, విజయవాడలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. జగ్గయ్యపేటలో 40 ఎకరాలు, ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాలు, భోగాపురం విమానాశ్రయం సమీపంలో కూడా భారీగా భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. విజయవాడలో ఒక ప్రముఖ కార్ల షోరూమ్‌లో, హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా కేఎన్ఆర్ భారీగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక 2019-24 మధ్య కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంకు ఖాతాలో ఏకంగా 20 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్టు సిట్ గుర్తించింది. అలాగే ఇంట్లో 2 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు సమాచారం.గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో కేఎన్ఆర్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ అనుమానిస్తోంది.
లిక్కర్ సిండికేట్‌కు, అప్పటి ప్రభుత్వ పెద్దలకు మధ్య ఆయన ఒక వారధిగా వ్యవహరించారని కాల్ డేటా ఆధారంగా సిట్ గుర్తించింది. లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ నుంచి 2021లో కేఎన్ఆర్ తన భార్య పేరిట తిరుపతి సమీపంలో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. రికార్డుల్లో దీని విలువ 81 లక్షలుగా చూపించినా, వాస్తవానికి ఇది కోట్ల రూపాయల విలువైనదని తెలుస్తోంది. మద్యం లంచాల రూపంలోనే ఇది దక్కిందని అధికారులు భావిస్తున్నారు.ఈ ఆస్తుల చిట్టా, మద్యం కుంభకోణంలో ప్రమేయంపై సిట్ అధికారులు విజయవాడలో కేఎన్ఆర్ను దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అయితే, ఏ ప్రశ్న అడిగినా తనకు గుర్తులేదని, వ్యాపారాలు, పెట్టుబడులన్నీ తన ఆడిటర్ చూసుకుంటారని ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. ఎలాంటి అధికారిక వేతనం తీసుకోని ఒక పీఏ.. ఇంత తక్కువ కాలంలో కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టారు అనే దానిపై నిజాలు రాబట్టేందుకు సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.