హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల ఆక్రమణలను కఠినంగా అడ్డుకోవాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 'హైడ్రా' వ్యవస్థను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి కోట్లాది రూపాయల బడ్జెట్‌తో ఈ విభాగాన్ని తీసుకొచ్చారు. అయితే, గ్రౌండ్ లెవల్‌లో హైడ్రా పనితీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైడ్రా కేవలం ‘హైడ్రామాలు’ చేస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో తీవ్ర పక్షపాతం కనిపిస్తోందని విమర్శకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వాసవి, శ్రీ ఆదిత్య, ప్రెస్టీజ్, ఎస్ఆర్ఆర్, మైహోమ్, ఫీనిక్స్, వంశీరామ్ వంటి బడా రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఉదాహరణకు, ప్రెస్టీజ్ సంస్థకు చెందిన 8 ఎకరాల వ్యవహారం, బాచుపల్లిలోని వాసవి టవర్స్, అలాగే ఎస్ఆర్ఆర్ సంస్థ వేలాది గజాల పార్కు మరియు రోడ్డు స్థలాలను కబ్జా చేసినా వారిపై ఎలాంటి చర్యా తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. అలాగే గురుకుల్ ట్రస్ట్ భూముల్లో జీరో పర్మిషన్‌తో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవడంలోనూ హైడ్రా విఫలమైందనే విమర్శలున్నాయి.
ఒకవైపు వందల కోట్లు ఆక్రమించే బడా బాబులను వదిలేస్తున్న హైడ్రా, మరోవైపు పేదల ఇళ్లపై మాత్రం తన ప్రతాపాన్ని చూపుతోంది. గాజులరామారంలో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వందలాది పేదల ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేశారు. కానీ, అదే సమయంలో కూన వెంకటేష్ కుటుంబం దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫంక్షన్ హాల్, ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించి ఏటా కోట్లు సంపాదిస్తున్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు.మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌కు చెందిన ఓ 6 అంతస్తుల భవనాన్ని హడావుడిగా కూల్చివేసిన హైడ్రా.. అది ఓ కాంగ్రెస్ నేతకు చెందినదని తెలియగానే వెనక్కి తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కింది స్థాయి అధికారులు కమిషనర్‌కు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టిస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులకు అప్‌డేట్ లేదని తెలుస్తోంది. తీరు మార్చుకోని సంధ్య శ్రీధర్ రావు లాంటి వారిపై ఎలాంటి కేసులు పెట్టారో చెప్పకపోవడం దీనికి అద్దం పడుతోంది.ఇటీవల 6 గుంటల పోలీస్ స్టేషన్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడటం వంటి మంచి పనులు చేసినప్పటికీ.. బడా కబ్జాదారుల ముందు హైడ్రా మోకరిల్లుతోందనే విమర్శలు మాత్రం ఆగడం లేదు. చెరువులు, కుంటలను కాపాడాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే, హైడ్రా ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, కింది స్థాయి సిబ్బంది అవినీతికి చెక్ పెట్టి.. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇది కేవలం పేదలను భయపెట్టే మరో వ్యవస్థగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.