Top story: పట్టా భూములను మింగేస్తున్న సెక్షన్‌-22A.. మీ భూమి సేఫేనా చెక్‌ చేసుకోండి.!

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్ ఏ తరహా వివాదాలు, ఆందోళనలకు కారణమైందో.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 'భూ భారతి' విధానంలోనూ అదే తరహా ఇబ్బందులు పునరావృతమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 14 August 2026, 2:53 PM IST

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్ ఏ తరహా వివాదాలు, ఆందోళనలకు కారణమైందో.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 'భూ భారతి' విధానంలోనూ అదే తరహా ఇబ్బందులు పునరావృతమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా.. 'ప్రోహిబిటెడ్ ఆర్డర్ బుక్' వ్యవహారం ఇప్పుడు భూయజమానులకు, రియల్ ఎస్టేట్ రంగానికి గొడ్డలిపెట్టుగా మారింది. దశాబ్దాలుగా హక్కులు కలిగి ఉన్న పట్టా భూములు, అన్ని ప్రభుత్వ అనుమతులతో నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు కూడా ఉన్నపళంగా ఈ నిషేధిత జాబితాలో ప్రత్యక్షమవుతుండటంతో బాధితులు తీవ్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ భారతి గురించి మంత్రులు చెప్తున్న మాటలకు గ్రౌండ్‌లో రియాలిటీకి అసలు సంబంధం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

"రాష్ట్రంలో ఒక్క సెంటు భూమిని కూడా కొత్తగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదు" అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలోని యదార్థ పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా సజావుగా రిజిస్ట్రేషన్లు జరిగిన పట్టా భూములను, పదేళ్ల క్రితం నిబంధనల ప్రకారం నిర్మించిన అపార్ట్‌మెంట్లను కూడా ఇటీవల అధికారులు నిషేధిత ఆస్తుల పీవోబీ జాబితాలోకి ఎక్కించారు. కొత్తగా నిషేధిత జాబితాలోకి చేరుస్తున్న ఆస్తుల వివరాలను రెవెన్యూ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా తొక్కిపెడుతున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనివల్ల నిన్నమొన్నటి వరకు క్రయవిక్రయాలు జరిపి, భారీ మొత్తంలో నిధులు వెచ్చించి స్థలాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు ఇప్పుడు వాటిని అమ్ముకోలేక చిక్కుల్లో పడ్డారు. తాము కొనుగోలు చేసిన పదేళ్ల తర్వాత కూడా సదరు ఆస్తిని ‘ప్రభుత్వ భూమి’ అని మార్చే ప్రమాదం ఉంటే, ఇక ఆస్తులపై పెట్టుబడులు పెట్టడం ఎలా అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మణికొండ, కొండాపూర్, మియాపూర్, నార్సింగి, గండిపేట, దిల్‌సుఖ్‌నగర్ వంటి నగర కీలక ప్రాంతాల్లో రీసేల్ ప్రాపర్టీల వ్యాపారం పూర్తిగా మందగించింది. రీసేల్ అపార్ట్‌మెంట్ లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం బ్యాంకులు ప్రాసెస్ పూర్తి చేసి, రుణాలు మంజూరు చేసినప్పటికీ.. చివరి దశలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అది ‘22ఏ’ నిషేధిత జాబితాలో ఉందంటూ నిలిచిపోతోంది. ఇలాంటి చేదు అనుభవాలు చూశాక కొనుగోలుదారులు ఎలాంటి అడ్వాన్స్ చెల్లింపులు చేయడానికి సాహసించడం లేదు. రీసేల్ మార్కెట్ స్తంభించిపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న కొత్త ప్రాజెక్టుల అమ్మకాలపై కూడా పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడుతోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ తాజా డేటా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షలకు పైగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఏ నిషేధిత జాబితాలో చేర్చబడ్డాయి. అంటే లక్షలాది కుటుంబాల ఆస్తి హక్కులు అనిశ్చితిలో పడ్డాయి.

ఈ జాబితాలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్, ఎండోమెంట్స్, సీలింగ్ మరియు వివాదాస్పద భూములు ఉన్నాయి. ఇది ఒకెత్తు అయితే.. చట్టబద్ధమైన పట్టా భూములు, హెచ్‌ఎండీఏ, హుడా, టీజీ-రెరా, జీహెచ్‌ఎమ్‌సీ అనుమతులు పొంది నిర్మించిన వెంచర్లు, అపార్ట్‌మెంట్లను కూడా జాబితాలో చేర్చడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం లోని కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాల వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. కనీసం 50 నుంచి 60 ఏళ్లుగా పట్టా భూములుగా కొనసాగుతూ, పదుల సంఖ్యలో చేతులు మారి క్రయవిక్రయాలు జరిగిన భూములను సైతం.. పాత కాలపు సేత్వార్, ఖాస్రా పహానీల ఆధారంగా మళ్లీ పీవోబీ జాబితాలో చేర్చడం వివాదాస్పదమైంది. గతంలో ధరణి పోర్టల్ అమలు తీరుపై వ్యక్తమైన ప్రజాగ్రహం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు భూ భారతి అమలులోనూ అదే తరహా లోపాలు కొనసాగితే, రానున్న జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా రాజకీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోర్టు కేసుల విషయంలోనూ కొత్త పోర్టల్‌లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. గతంలో ధరణి పోర్టల్‌లో భూమికి సంబంధించిన కోర్టు కేసు సంఖ్య, ఎవరి మధ్య వివాదం ఉందో తెలిపే పీడీఎఫ్ కాపీ అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుత ఆన్‌లైన్ వ్యవస్థలో ఏ కోర్టు కేసు ఆధారంగా సదరు భూమిని పీవోబీలో పెట్టారో వివరణ ఉండటం లేదు. కోర్టులో కేసు వీగిపోయి, భూయజమానికి అనుకూలంగా తీర్పు వచ్చినా.. దాన్ని ఆన్‌లైన్ నుంచి తొలగించడానికి తహసీల్దార్లు భయపడుతున్నారు. ఉన్నతాధికారులు స్వయంగా అఫిడవిట్ ఇవ్వాలని నిబంధనలు పెట్టడంతో, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిషేధాన్ని ఎత్తివేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు ముందుకు రావడం లేదు. ఈ తీవ్రమైన సమస్య నుంచి ప్రజలను, రియల్ ఎస్టేట్ రంగాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నిపుణులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కిందటి సేత్వార్, ఖాస్రా పహానీలను కాకుండా.. ఆర్వోఆర్ ని ప్రామాణికంగా తీసుకొని నిషేధిత జాబితాను పునఃపరిశీలించాలంటున్నారు నిపుణులు.

చెల్లుబాటు అయ్యే సేల్ డీడ్ కలిగి ఉండి, దశాబ్దాలుగా భూమి స్వాధీనంలో ఉన్న హక్కుదారుల ఆస్తులను వెంటనే పీవోబీ నుంచి తొలగించాలంటున్నారు. హెచ్‌ఎండీఏ, హుడా, టీజీ-రెరా, లేఅవుట్ అనుమతులు పొందిన అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లకు సెక్షన్ 22ఏ వర్తించకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు పరిధిలో ప్రభుత్వ భూమి నిజంగా ఉంటే.. నిర్మాణ అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి తప్ప, నమ్మి కొనుగోలు చేసిన సామాన్య కొనుగోలుదారులను, బిల్డర్లను వేధించకూడదని వాపోతున్నారు. ఈ సమస్యను వేగంగా పరిష్కరించకపోతే, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కోలుకోలేని దెబ్బ తినడమే కాకుండా లక్షలాది మంది సామాన్య ప్రజలు తమ సొంత ఆస్తుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వానికి గుదిబండగా మారిన ఈ తప్పులను ఇప్పటి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Published : 
  • 14 August 2026, 2:53 PM IST