అగ్ని-4.. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఉగ్రదేవం వెన్నులో వణుకుపుట్టిస్తున్నది ఇదే. ఎందుకంటే, ఈ మిస్సైల్ రేంజ్ లోకి ఎంటైర్ పాకిస్తాన్ వస్తుంది. ఒడిశాలోని ఛాందీపూర్ ఐటీఆర్ కాంప్లెక్స్ నుంచి అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ప్రయోగించిన మరుక్షణమే తన నిర్దేశిత మార్గాన్ని ఎంచుకున్న ఈ క్షిపణి, అడ్వాన్స్డ్ నావిగేషన్ వ్యవస్థల సహాయంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామిటర్లను అగ్ని-4 నూటికి నూరు శాతం సాధించిందని రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. భారత ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక ప్రయోగం.. కేవలం సాంకేతిక ఆధిపత్యాన్ని మాత్రమేకాదు, అత్యవసర సమయాల్లో ప్రయోగానికి క్షేత్రస్థాయిలో మనదళాలు ఎంత సిద్ధంగా ఉన్నాయో ప్రపంచానికి చాటిచెప్పింది. పాకిస్తాన్ ఉగ్ర వ్యవస్థకు.. అగ్ని-4 మిస్సైల్‌ను సింహస్వప్నంగా రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అగ్ని-4 సాధారణ క్షిపణి కాదు. ఇది సుమారు 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న అడ్వాన్స్డ్ మిడ్-రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. ఈ 4వేల కిలోమీటర్ల పరిధి అర్థం ఏంటో తెలుసా? ఉగ్రవాదానికి కేంద్ర బిందువైన పాకిస్తాన్ భూభాగం మొత్తం... ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్ నుండి రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం వరకు ప్రతీ అంగుళం ఇప్పుడు నేరుగా భారత అగ్ని-4 పరిధిలోకి వచ్చేసింది. పాకిస్తాన్‌లో ఏ మూలన ఉగ్రవాద శిక్షణ శిబిరాలు వెజిల్స్ వేసినా, ఏ సరిహద్దు స్థావరం నుంచి కుట్ర పన్నినా... భారత్ నుంచి ఒకే ఒక్క బటన్ నొక్కితే చాలు, క్షణాల్లో ఆ స్థావరాలు బూడిద కుప్పగా మారడం ఖాయం. చైనా, టర్కీ, లేదా అమెరికా వంటి శత్రు దేశాలు పాకిస్తాన్‌కు ఎంతగా కొమ్ముకాచినా, ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు నిలబడి పాక్‌కు మద్దతు ఇచ్చినా సరే... భారత్‌ను భయపెట్టడం సాధ్యం కాదని అగ్ని-4 స్పష్టం చేస్తోంది.
సాంకేతిక కోణంలో చూస్తే అగ్ని-4లో ఉపయోగించిన సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పు. పాత తరం ద్రవ ఇంధన క్షిపణులను ప్రయోగించాలంటే గంటల తరబడి ఇంధనం నింపాల్సి ఉండేది. ఆ సమయంలో శత్రు ఉపగ్రహాలు క్షిపణిని గుర్తించి దాడి చేసే ప్రమాదం ఉండేది. కానీ ఘన ఇంధనంతో పనిచేసే అగ్ని-4ను ఎల్లప్పుడూ ప్రయోగానికి సిద్ధంగా ఉంచవచ్చు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే, శత్రువు ఊహించని వేగంతో, కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ క్షిపణిని శత్రు స్థావరాలపైకి వదలంగాలం. శత్రుదేశాల ముప్పును తిప్పికొట్టడంలో అగ్ని-4కున్న మరో అతిపెద్ద ప్లస్ పాయింట్... రోడ్-మొబైల్ లాంచర్ సదుపాయం. అంటే, ఈ క్షిపణిని ప్రయోగించడానికి నిర్దిష్టమైన, స్థిరమైన సైనిక స్థావరం అవసరం లేదు. భారీ ట్రక్కులు, రైలు మార్గాలు లేదా రోడ్డు మార్గాల ద్వారా దేశంలో ఏ మూలకైనా, దట్టమైన అడవుల్లోకి లేదా ఎత్తైన పర్వత ప్రాంతాలకు కూడా దీనిని సులభంగా తరలించవచ్చు. రోడ్డు నుంచే నేరుగా ప్రయోగించవచ్చు. దీనివల్ల చైనా లేదా అమెరికాకు చెందిన అధునాతన నిఘా ఉపగ్రహాలు కూడా ఈ క్షిపణి ఎక్కడ ఉందో ముందే పసిగట్టడం దాదాపు అసాధ్యం.
అబ్దుల్ కలాం నేతృత్వంలో ప్రారంభమైన అగ్ని సిరీస్ క్షిపణులు భారత రక్షణ రంగానికి వెన్నుముకగా నిలిచాయి. ఈ సిరీస్‌లో అగ్ని-5 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, దీని పరిధిలోకి చైనా మొత్తం వస్తుంది. అగ్ని-5 అధికారిక పరిధి 5వేల నుండి 5, 500కిలోమీటర్లు. అయితే, దీని అసలు పరిధి 7వేల నుండి 8వేల కిలోమీటర్ల వరకు ఉండవచ్చని చైనా రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తర చైనాలోని బీజింగ్, హార్బిన్, షాంఘై, గ్వాంగ్‌జౌ వంటి అత్యంత సుదూర ప్రాంతాలతో సహా చైనాలోని ప్రతీ సైనిక స్థావరం, పారిశ్రామిక నగరం అగ్ని-5 పరిధిలోకి వస్తాయి. అందుకే, ఈ క్షిపణి పేరు వింటే డ్రాగన్ కంట్రీ వణుకుతుంది. ఇక అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రీ-ఎంట్రీ టెక్నాలజీ అగ్ని-4 సొంతం. సాధారణంగా క్షిపణులను ప్రయోగించేటప్పుడు అభివృద్ధి దశ, వినియోగ దశ అని రెండు ఉంటాయి. అగ్ని-4 ఇప్పటికే అభివృద్ధి దశను పూర్తి చేసుకుని, రక్షణ బలగాల పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఈ పరీక్ష స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ద్వారా నిర్వహించిన యూజర్ ట్రయల్. దీనర్థం.. అగ్ని-4 కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాలేదు, భారత సరిహద్దుల్లో క్రియాశీల సైనిక వినియోగానికి నూటికి నూరు శాతం సిద్ధంగా ఉంది.
భారత్ నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అమలు చేస్తుంది. అంటే ఏ దేశంపైనా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించదు. కానీ, మన సార్వభౌమాధికారానికి, భద్రతకు ఏ శత్రుదేశమైనా ముప్పు కలిగిస్తే మాత్రం.. శత్రువు ఉనికి లేకుండా చేసేంతటి సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం భారత్‌కు ఉంది. అగ్ని-4 వంటి అణు వార్‌హెడ్లు మనకు శాంతిని ప్రసాదించే రక్షణ కవచాలు అనడంలో ఎలాంతి అతిశయోక్తీ లేదు. మన జోలికి వస్తే శత్రువుకు మిగిలేది వినాశనమేనని స్పష్టం చేసే వ్యూహాత్మక హెచ్చరికలే ఇవి. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న చైనా, సహాయం చేస్తున్న ఇతర దేశాలు ఎంతగా కుట్రలు పన్నినా... భారత్ తన రక్షణ శక్తిని నిరూపించుకుంటూనే ఉంటుంది. అందుకే, అగ్ని-4 ప్రయోగ విజయం కేవలం ఒక క్షిపణి ప్రయోగం కాదు.. అది 140 కోట్ల మంది భారతీయుల భద్రతకు దొరికిన అభయ హస్తం.