Top story: భారత్‌కు గిఫ్ట్‌గా మాన్‌స్టర్‌ను తెస్తున్న పుతిన్.. చైనా మిస్సైళ్ల పాలిట యముడిగా బ్రహ్మాస్త్రం..!

ప్రపంచమంతా ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకోసం ఆసక్తిగా చూస్తున్న వేళ.. ఆ కీలక సమ్మిట్ కంటే ముందే ఢిల్లీకి వస్తున్నారు రష్యన్ ప్రెసిడెంట్. ఈ పర్యటన ఇరు దేశాల బాండింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు చేర్చబోతోంది. ముఖ్యంగా భారత రక్షణ భాగస్వామ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న పుతిన్..

Post Published By: dialnews
Updated : 10 September 2026, 1:30 PM IST

ప్రపంచమంతా ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకోసం ఆసక్తిగా చూస్తున్న వేళ.. ఆ కీలక సమ్మిట్ కంటే ముందే ఢిల్లీకి వస్తున్నారు రష్యన్ ప్రెసిడెంట్. ఈ పర్యటన ఇరు దేశాల బాండింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు చేర్చబోతోంది. ముఖ్యంగా భారత రక్షణ భాగస్వామ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న పుతిన్.. ఢిల్లీకి వస్తూ వస్తూనే మాన్‌స్టర్ ప్రపోజల్‌తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా అడిగిన మాన్‌స్టర్ మిస్సైల్ డీల్‌ను ఈ పర్యటనలో ఫైనల్ చేయబోతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. ఆ మిస్సైల్ మరేదో కాదు.. R-37M భారత వైమానిక దళాన్ని ఆధునీకరించే క్రమంలో న్యూఢిల్లీ గతంలోనే రష్యా నుంచి దాదాపు 300 R-37M క్షిపణులు కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఐతే ఈ డీల్ కేవలం క్షిపణుల కొనుగోలుతోనే ముగిసిపోదు. ఈ భారీ క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా దాదాపు 100 సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్లను అప్‌గ్రేడ్ చేయబోతున్నారు. 'సూపర్ సుఖోయ్' ప్రోగ్రామ్‌లో భాగంగా కొత్త రాడార్లు, దేశీయ ఉత్తమ్ ఏసా రాడార్ లేదా అధునాతన రష్యన్ రాడార్లు, సరికొత్త మిషన్ కంప్యూటర్లతో ఈ ఫైటర్ జెట్లను అత్యాధునిక లాంగ్-రేంజ్ ఇంటర్‌సెప్టర్లుగా మార్చనున్నారు.

మిలిటరీ కోడ్‌నేమ్ RVV-BD అని పిలిచే ఈ R-37M క్షిపణి సామర్థ్యం వింటే శత్రువుల వెన్నులో వణుకుపుట్టడం ఖాయం. గగనతలంలో ఇది దాదాపు 300 నుంచి 400 కిలోమీటర్ల సుదూర పరిధిలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది. దీని అత్యంత భయంకరమైన అంశం దీని వేగం. ఇది హైపర్‌సోనిక్ వేగంతో, అంటే ధ్వని వేగానికి ఐదు నుంచి ఆరు రెట్లు.. మాక్ 6 వేగంతో దూసుకెళ్తుంది. అంటే గంటకు సుమారు 7వేల 300 కిలోమీటర్ల వేగం. ప్రత్యర్థి ఫైటర్ జెట్ లేదా నిఘా విమానం తమ రాడార్‌లో ఈ క్షిపణిని గుర్తించే సమయానికే అది లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఆధునిక వైమానిక యుద్ధంలో 'నో-ఎస్కేప్ జోన్' అని పిలిచే తప్పించుకునే వ్యవధిని శత్రువుకు ఏమాత్రం ఇవ్వకుండా గాల్లోనే నామరూపాలు లేకుండా చేయడం దీని ప్రత్యేకత. ఈ క్షిపణిని సైనిక పరిభాషలో "అవాక్స్ కిల్లర్" లేదా "ఫోర్స్ మల్టిప్లైయర్ కిల్లర్" అని పిలుస్తారు. సాధారణ గగనతల పోరాటాల్లో చిన్న ఫైటర్ జెట్లను లక్ష్యంగా చేసుకునే డాగ్‌ఫైట్ క్షిపణి కాదిది. ఏ యుద్ధంలోనైనా వందల కిలోమీటర్ల వెనుక ఉంటూ, యుద్ధ విమానాలకు సమాచారాన్ని అందిస్తూ, రాడార్లతో మొత్తం గగనతలాన్ని తమ గుప్పిట్లో ఉంచుకునే అవాక్స్‌గా పిలిచే 'ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్' విమానాలే గేమ్ ఛేంజర్లు. శత్రువు సైన్యానికి కళ్లు, చెవులు, మెదడు లాంటి ఈ అతిపెద్ద నిఘా విమానాలను అత్యంత సురక్షితమైన దూరం నుంచే వేటాడి కూల్చడానికి రష్యా ఈ ఆయుధాన్ని రూపొందించింది.

ఈ క్షిపణి రాక పాకిస్తాన్ వైమానిక వ్యూహాలకు గొడ్డలిపెట్టు లాంటిది. 2019 బాలాకోట్ అనంతర పరిణామాలను పరిశీలిస్తే.. పాకిస్తాన్ తన సాబ్ ఎరియే అవాక్స్ విమానాలను సరిహద్దుకు చాలా దూరంలో, తమ సురక్షిత గగనతలంలో ఉంచి భారత ఫైటర్ల కదలికలను పర్యవేక్షించే ప్రయత్నం చేసింది. కానీ R-37M ప్రవేశంతో ఆ వ్యూహం ఇక పనిచేయదు. భారత పైలట్లు సరిహద్దు దాటాల్సిన అవసరం లేకుండానే.. భారత గగనతలం నుంచే పాక్ భూభాగంలో 300 కిలోమీటర్ల లోపల ఎగురుతున్న నిఘా విమానాలను లాక్ చేసి కూల్చివేయగలరు. తమ నిఘా నేత్రాలు కూలిపోతే, ఆధునిక యుద్ధంలో పాక్ ఫైటర్ జెట్లు గాల్లో గుడ్డివారిలా మారిపోవడం ఖాయం. ఇక ఉత్తర సరిహద్దుల్లో నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌కు ఇది నేరుగా ఇచ్చే బలమైన సమాధానం. చైనా ఇప్పటికే తమ J-20, J-16 యుద్ధ విమానాలలో దాదాపు 200 కిలోమీటర్ల పరిధి గల PL-15, సుదూర లక్ష్యాల కోసం PL-17 క్షిపణులను మోహరిస్తోంది. టిబెట్ గగనతలంలో కేజే-500 అవాక్స్ విమానాల దన్నుతో లడఖ్, అరుణాచల్ సరిహద్దుల్లో ఆధిపత్యం చెలాయించాలనేది చైనా పన్నాగం. అయితే 400 కిలోమీటర్ల పరిధి, మాక్ 6 వేగం కలిగిన R-37M భారత సుఖోయ్‌లకు తోడైతే.. చైనా క్షిపణుల పరిధి కంటే ముందే భారత వాయుసేన స్పందించి దాడి చేయగల 'అవుట్-రేంజ్' అడ్వాంటేజ్‌ను సాధిస్తుంది.

ఈ హైపర్‌సోనిక్ క్షిపణి శత్రువు ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలర్స్ పైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. యుద్ధ విమానాలు గాల్లో ఎక్కువ సేపు ఉండాలన్నా, సుదూర లక్ష్యాలపై దాడి చేయాలన్నా ట్యాంకర్ విమానాల ద్వారా ఇంధనం నింపుకోవడం అత్యంత కీలకం. R-37M భయంతో చైనా, పాక్ తమ ట్యాంకర్ విమానాలను సరిహద్దులకు 400 కిలోమీటర్ల అవతల ఉంచాల్సి వస్తుంది. దీనివల్ల శత్రు యుద్ధ విమానాల పోరాట పరిధి భారీగా తగ్గిపోతుంది. అవి సరిహద్దు వద్ద కొద్ది నిమిషాల కంటే ఎక్కువ సమయం పోరాడలేవు. తద్వారా ఇండియా ఎలాంటి భారీ నష్టం లేకుండానే ప్రత్యర్థి దాడుల తీవ్రతను గాల్లోనే తిప్పికొట్టగలదు. టెక్నికల్‌గా R-37M లోని మార్గదర్శక వ్యవస్థ అత్యంత సంక్లిష్టమైనది, తిరుగులేనిది. ఇది సుఖోయ్ విమానం నుంచి బయల్దేరిన తర్వాత ప్రారంభంలో ఇనర్షియల్ నావిగేషన్, మిడ్-కోర్స్ డేటాలింక్ ద్వారా గమ్యాన్ని వేగంగా చేరుకుంటుంది. లక్ష్యానికి సమీపించిన వెంటనే క్షిపణి ముక్కు భాగంలో ఉండే యాక్టివ్ రాడార్ సీకర్ ఆన్ అవుతుంది. శత్రువు ఎంతటి ఎలక్ట్రానిక్ జామర్లు, కౌంటర్‌మెజర్లను ప్రయోగించినా వాటిని ఛేదించుకుని వెళ్లే సామర్థ్యం దీని స్వంతం. దీనిలో అమర్చిన 60 కిలోల భారీ వార్‌హెడ్ లక్ష్యాన్ని నేరుగా ఢీకొట్టాల్సిన పనిలేదు.. దానికి సమీపంలో పేలినా వెలువడే తీవ్రమైన పేలుడు ధాటికి ఎంతటి భారీ విమానమైనా గాల్లోనే తునాతునకలైపోతుంది. 300 అధునాతన R-37M క్షిపణులు, అప్‌గ్రేడ్ అయిన 100 సుఖోయ్ ఫైటర్లు భారత వాయుసేన చేతికి అందితే.. హిమాలయాల నుంచి అరేబియా సముద్రం వరకు భారత గగనతలం పూర్తిగా దుర్భేద్యమైన కోటగా మారడం ఖాయం.

 

Published : 
  • 10 September 2026, 1:30 PM IST