పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో పుతిన్ ప్రైవేట్ ఆర్మీ ఎంటర్ కాబోతోందా? ఇరాన్‌కు మద్దతుగా అమెరికా సైనికుల అంతుచూడటమే లక్ష్యంగా మాన్స్టర్లను రంగంలోకి దించబోతున్నారా? ఉక్రెయిన్ సైనికులను ఊచకోత కోసిన మోస్ట్ వయొలెంట్ యూనిట్ ఎనీటైం యాక్షన్‌లోకి దిగడం ఖాయమేనా? ఇరాన్ మీడియా ఔననే చెబుతోంది. పుతిన్ కనుసైగతో నడిచే మృత్యు సైన్యం తమకు మద్దతుగా రంగంలోకి దిగబోతోందన్న ఇరాన్ ప్రకటన వాషింగ్టన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ, ఇరాన్‌కు మద్దతుగా రంగంలోకి దిగుతున్న రష్యన్ మాన్‌స్టర్‌లు ఎవరు? ఈ నయా కాలకేయుల ఎంట్రీ యుద్ధ భూమిలో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతోంది?
చెచెన్ ఆర్మీ.. రష్యన్ ప్రైవేట్ ఆర్మీ. పుతిన్ కనుసైగతో నడిచే మోస్ట్ వయొలెంట్ యూనిట్.రష్యా గడ్డపై పుట్టి, వెయ్యేళ్ల నాటి యుద్ధ తంత్రాలను పుణికిపుచ్చుకున్న సైనికులు ఈ యూనిట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్లే అమెరికా గ్రౌండ్ ఆపరేషన్‌లో ఇరాన్‌కు కవచంలా మారబోతున్నారు. తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ.. చెచెన్ ఆర్మీ ఎంట్రీని కన్ఫమ్ చేసింది. అమెరికా గనుక ఇరాన్‌పై భూతల దాడికి దిగితే, ఇరాన్ దళాలతో కలిసి పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యన్ చెచెన్ పోరాట విభాగాలు అధికారికంగా ప్రకటించినట్లు ప్రెస్ టీవీ నివేదించింది. అమెరికా గనుక ఇరాన్‌పై భూతల దాడికి దిగితే, దీనిని జిహాద్‌గా పరిగణించి ఇరాన్ తరఫున పోరాడతామని ఈ దళాలు ప్రకటించినట్లు ప్రెస్ టీవీ కథనాలు చెప్పాయి. ప్రెస్ టీవీ అనేది ఇరాన్ అధికారిక మీడియా.. ఇందులో చెచెన్ దళాల హామీ ఇచ్చాయని చెప్పారంటే అది నిజం అన్నమాటే. అందుకే, ఈ వార్త ఇంత చర్చకు తావిస్తోంది. అయితే, ఇది అధికారికంగా రష్యా ప్రభుత్వం చేసిన ప్రకటన మాత్రం కాదు, కానీ రష్యాకు అత్యంత సన్నిహితుడైన కదీరోవ్ వర్గం నుండి వచ్చిన సంకేతంగా దీనిని చూడవచ్చు.
చెచెన్ దళాల గురించి ఇన్డెప్తుకు వెళితే.. రష్యాలోని చెచ్న్యా అనే స్వయంప్రతిపత్తి గల రిపబ్లిక్కు చెందిన సైనిక దళాలను చెచెన్ దళాలు అంటారు. ఈ దళాలనే 'కదిరోవైట్స్గా పిలుస్తారు. వీరు అధికారికంగా రష్యా నేషనల్ గార్డ్‌లో భాగమైనప్పటికీ, నేరుగా చెచెన్ అధ్యక్షుడు రంజాన్ కదీరోవ్కు, తద్వారా వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత విధేయులుగా ఉంటారు. వీరు క్రూరమైన పోరాట పటిమకు, గెరిల్లా యుద్ధ తంత్రాలకు పేరుగాంచారు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా తరఫున వీరు కీలక పాత్ర పోషించారు. మరియూపోల్ లాంటి నగరాలను ఎలా హస్తగతం చేసుకున్నారో ప్రపంచం చూసింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని, అదే క్రూరత్వాన్ని ఇరాన్ ఎడారుల్లో, పర్వతాల్లో చూపించడానికి వీరు తహతహలాడుతున్నారు. చెచెన్లు ప్రధానంగా ముస్లింలు. అందుకే అమెరికాను సామ్రాజ్యవాద శక్తిగా చూస్తూ, ఇరాన్‌కు మద్దతు ఇవ్వడాన్ని జిహాద్‌గా కదీరోవ్ పేర్కొంటున్నారు. అందుకే, ఇరాన్ మీడియా కథనాలు వాషింగ్టన్లోనూ వణుకుపుట్టిస్తున్నాయి.
2025 జనవరిలో రష్యా-ఇరాన్ మధ్య "సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం" కుదిరింది. దీని ప్రకారం ఒకరిపై దాడి జరిగితే మరొకరు మద్దతు ఇవ్వాలి. పుతిన్ తన అధికారిక రష్యా సైన్యాన్ని నేరుగా పంపడానికి బదులు, ఈ చెచెన్ దళాలను వాలంటీర్లుగా లేదా ప్రత్యేక విభాగంగా పంపే అవకాశం ఉంది. దీనివల్ల రష్యా నేరుగా యుద్ధంలో లేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.2000వ దశకంలో చెచెన్యాలో వేర్పాటువాదాన్ని అణచివేసి, అక్కడ శాంతిని నెలకొల్పడానికి పుతిన్ కదిరోవ్ కుటుంబానికి పూర్తి అధికారాన్ని, నిధులను ఇచ్చారు. దీనికి ప్రతిగా, పుతిన్ ఎక్కడ యుద్ధం చేయమంటే అక్కడకు వెళ్లడానికి ఈ దళాలు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఇరాన్‌కు మద్దతుగా యుద్ధం చేయడానికి ఈ దళాలు ఎట్టిపరిస్థితుల్లో ఆలోచించవు. పుతిన్ ఒక్క సిగ్నల్ ఇస్తే వార్‌జోన్‌లో అమెరికా సేనలను దారుణంగా వేటాడతాయి. అందుకే, ఇరాన్ మీడియా నివేదికలు పశ్చిమాసియాను నిలువునా వణికిస్తున్నాయి.