Top story: లక్షల్లో జీతాలు.. కోట్లలో లంచాలు తెలంగాణను ముంచెత్తిన అవినీతి అనకొండల కథ..!

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత సామాన్యుల బతుకులు మారాయో లేదో తెలియదుగానీ.. కొందరు ప్రభుత్వ అధికారుల తలరాతలు మాత్రం మారిపోయాయి. చాలా మంది అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తారు.

Post Published By: dialnews
Updated : 25 August 2026, 11:11 AM IST

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత సామాన్యుల బతుకులు మారాయో లేదో తెలియదుగానీ.. కొందరు ప్రభుత్వ అధికారుల తలరాతలు మాత్రం మారిపోయాయి. చాలా మంది అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తారు. నెలకు లక్షల్లో జీతాలు పొందుతున్నప్పటికీ, కన్నుమిన్ను కానకుండా దొరికినకాడికి దోచుకుంటూ వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారు. రీసెంట్‌గా అవినీతి నిరోధక శాఖ.. ACB జరిపిన సోదాల్లో ఒక్కొక్కరి దగ్గర కనీసం 100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ముఖ్యంగా 25 మంది దగ్గర ఏకంగా 4 వేల 320 కోట్ల అక్రమాస్తులు బయటపడటం.. ఏసీబీ అధికారులను కూడా షాక్‌కు గురి చేసింది. ఏసీబీ దర్యాప్తు వివరాల ప్రకారం.. రాబడికి మించి ఆస్తులు సంపాదించిన కేసుల్లో ఇప్పటివరకు మొత్తం 56 మంది అధికారులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యంత భారీగా ఆర్జించిన అగ్రశ్రేణి 25 మంది అధికారుల అక్రమాస్తుల విలువే అక్షరాలా 4,320 కోట్లు దాటింది.

ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్ట్, పోలీస్, మున్సిపల్, తెలంగాణ రెడ్కో, హెచ్‌ఎమ్‌డీఏ, వాణిజ్య పన్నులు, టౌన్ ప్లానింగ్, వాటర్ బోర్డ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి కీలక శాఖల అధికారులే ఈ అవినీతి చక్రంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపించింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నాటి ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన ఇంజనీర్లు టెండర్లు, ప్రతి పనిలోనూ భారీగా పర్సంటేజీలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన నలుగురు కీలక ఇంజనీర్ల ఆస్తులే దాదాపు 1,000 కోట్లకు చేరుకున్నాయి.

ఇందులో ముఖ్యుడు మాజీ ENC మురళీధర్ రావు. 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించడమే కాకుండా, తన కుమారుడు అభిషేక్ రావు కంపెనీల ద్వారా భారీగా నిధులు మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. మరో అధికారి కాళేశ్వరం, SRSP-EE నూనె శ్రీధర్. 150 కోట్ల అక్రమాస్తులు గడించాడు. ఈయన తన కుమారుడి వివాహాన్ని థాయ్‌లాండ్‌లో అత్యంత వైభవంగా జరిపాడు. ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్‌ టిక్కెట్లు బుక్ చేయడం విస్తుగొలుపుతోంది. మరో అధికారి ENC భూక్యా హరిరామ్ 200 కోట్ల అక్రమాస్తులు సమకూర్చుకున్నాడు. ఈయన ఇంట్లో సోదాలు జరిపినప్పుడు అత్యంత ఖరీదైన విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, విలువైన బంగారు ఆభరణాలు లభించాయి. కాళేశ్వరం పవర్‌ ఈఎన్సీగా ఉన్న ఆనంద్ కుమార్ ఏకంగా 320 కోట్ల ఆస్తులు కూడబెట్టాడు.

ఇలా దాదాపు 25 మంది అధికారులు టాప్‌ లిస్ట్‌లోఉన్నారు. వీళ్లు అక్రమంగా సంపాధించిన మొత్తం ఆస్తుల విలువ 4 వేల 320 కోట్లు. ఏసీబీ సోదాల్లో చిక్కిన అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వింత వాదనలను తెరపైకి తెస్తున్నారు. తాము ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు, స్థిరాస్తుల 'మార్కెట్ విలువ' విపరీతంగా పెరగడం వల్లే తమ ఆస్తుల విలువ వందల కోట్లలో కనిపిస్తోందని, అదంతా చట్టబద్ధమైన ఆదాయమేనని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, 2014 తర్వాతే వీరి ఆస్తులు అనకొండలా పెరగడం, బంధువులు, స్నేహితులు, బినామీల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేసిన ఆధారాలు లభించడంతో ఏసీబీ వీరి బినామీల జాబితాను తవ్వుతోంది. మరోవైపు ఈ భారీ అవినీతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలతో పాటు గొర్రెల పంపిణీ స్కామ్, భూదాన్ భూముల అక్రమ బదలాయింపులు, ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వంటి కీలక కేసుల్లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తును తీవ్రతరం చేసింది.

Published : 
  • 25 August 2026, 11:11 AM IST