Top story: తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలనం.. మీనాక్షి నటరాజన్ ఔట్, టీ-కాంగ్రెస్‌కు కొత్త బాస్ ఎవరు..? కొత్త ఇన్‌ఛార్జ్ రేసులో నిలిచిన టాప్ సీనియర్లు వీరే..!

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అధిష్టానం త్వరలోనే ఒక కొత్త నేతను పంపబోతోంది.

Post Published By: dialnews
Updated : 16 September 2026, 2:30 PM IST

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అధిష్టానం త్వరలోనే ఒక కొత్త నేతను పంపబోతోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ హఠాత్తుగా ఈ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. అయితే దీని వెనుక ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు, ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తుండటమే దీనికి అసలు కారణం. రానున్న పది నెలల పాటు ఆమె పార్టీ వ్యవహారాలకు దూరం కానున్నారు. మరి మీనాక్షి స్థానంలో రాబోయే ఆ కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరు..? కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్న ఆ నలుగురు సీనియర్ నేతలు ఎవరు..?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా గతంలో ఉన్న దీపా దాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఆమె ఈ బాధ్యతలు తీసుకున్నారు. మొదట్లో ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నో మెరుపులు మెరిపిస్తుందని పార్టీ శ్రేణులు ఆశించినా, తనదైన ముద్ర వేయడంలో ఆమె కొంతవరకు విఫలమయ్యారనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఆమె ప్లస్ పాయింట్ ఏంటంటే... గత ఇన్‌ఛార్జ్‌లతో పోలిస్తే ఆమె పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అవసరానికి మించి జోక్యం చేసుకోలేదు. దీనివల్ల ఆమె హయాంలో పార్టీకి ఎలాంటి కొత్త వివాదాలు రాకపోవడమే తెలంగాణ కాంగ్రెస్‌కు జరిగిన పెద్ద మేలు అని చెప్పవచ్చు.

ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్తుండటంతో కొత్త ఇన్‌ఛార్జ్ ఎంపిక అనివార్యమైంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దానికి తోడు రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగే ఒక సీనియర్ నేతకు ఈ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... నలుగురు ప్రముఖ సీనియర్ నేతల పేర్లు ఈ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. వారిలో ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హా గోహిల్, దిగ్విజయ్ సింగ్ మరియు అశోక్ గెహ్లాట్ ఉన్నారు.

ఈ నలుగురిలో ముకుల్ వాస్నిక్ పేరు అందరికంటే ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన గతంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన గొప్ప అనుభవం ఆయనకుంది. ఎక్కడా ఎలాంటి వివాదాలు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో ఉండటం, దక్షిణాది రాజకీయాలపై అవగాహన ఉండటం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం పెంచడానికి ఆయనే సరైన వ్యక్తని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హా గోహిల్ పేరు కూడా పరిశీలనలో ఉంది. గుజరాత్ మాజీ మంత్రిగా, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆయనకు, ఎన్నికల వ్యూహాలు రచించడంలో మరియు క్యాడర్‌ను నడిపించడంలో ప్రత్యేక అనుభవం ఉంది.

అయితే రేసులో ఉన్న మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వస్తే మాత్రం పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, ఆ తర్వాత తెలంగాణకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు ఇక్కడి నేతలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్, వైఎస్ కాంగ్రెస్ అంటూ మూడు వర్గాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో దిగ్విజయ్ సింగ్ గనుక ఎంట్రీ ఇస్తే, సీనియర్ నేతల మధ్య ఉన్న గ్యాప్స్ మరింత పెరిగి, కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త బాస్ ఎవరు రాబోతున్నారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. వివాదరహితుడైన ముకుల్ వాస్నిక్‌కు పట్టం కడతారా లేక మరెవరినైనా ఎంపిక చేస్తారా అనేది చూడాలి.

Published : 
  • 16 September 2026, 2:30 PM IST