వైసీపీ ఎంత ఘోరమైన స్థితిలో ఉందో..... ఆ పార్టీలో నాయకత్వం ఎలా ఏడ్చిందో మరోసారి రుజువైంది. ఏపీలో కూటమి సర్కార్ కి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు రెండేళ్లని వైసిపి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి దిగింది. పార్టీలో అన్ని జిల్లాల్లో నాయకులు అంతా ఈరోజు కచ్చితంగా రోడ్డెక్కాలని, ప్రతి నియోజకవర్గం నుంచి క్యాడర్ బయటకు వచ్చి చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని వైసిపి హై కమాండ్ పిలుపునిచ్చింది. ఆ పిలుపు ఆషామాషీ పిలుపు కాదు. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనలో ఏ నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొనకపోయినా సీరియస్ చర్యలు ఉంటాయని కూడా మెసేజ్ పంపించారు. ఇదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో కూటమి సభ ఉంటుంది గనక ఉదయాన్నే వైసీపీ కార్యకర్తలంతా రోడ్డెక్కి ఆందోళన, అలజడి చేయాలని.... అటెన్షన్ మొత్తం తన వైపు డైవర్ట్ చేసుకోవాలని సమాచారం ఇచ్చారు. అందుకు తగినట్లుగానే ఏపీలో ప్రతి జిల్లాలోనూ వైసిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా క్యాడర్ ని వెంటబెట్టుకుని రోడ్డెక్కారు. ముఖ్యంగా ఉన్నప్పటికీ బొత్స సత్యనారాయణ సైతం ధర్నా చేసి రెండేళ్ల చంద్రబాబు సర్కార్ని ఎండగట్టారు. అలాగే మిగిలిన నాయకులు అంతా ఎక్కడ రాజీ పడకుండా లక్షలు ఖర్చుపెట్టి క్యాడర్ ని తోలుకొచ్చి మరీ వెన్నుపోటుకు రెండేళ్ల అంటూ నినాదాలతో హోరెత్తించారు.
రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ మొత్తం రోడ్డెక్కి వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ, నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తుంటే బెంగళూరులోని తన ప్యాలెస్ లో జగన్ రిలాక్స్ అయ్యారు.నిరసనలకు ఆందోళనలకు ఒక రోజు ముందే ఉండవల్లిలో.... రెండు గంటల పాటు ప్రెస్ మీట్ నిర్వహించి... వెంటనే బెంగళూరు చెక్కేశారు జగన్. రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని.... లక్షల మంది క్యాడర్ రోడ్లమీదకు వస్తే అధినేత జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని టీవీ చూడడం ఎంతవరకు సబబు అని వైసీపీలో నాయకులు ,క్యాడర్ చెవులు కొరుక్కు కుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన కూటమి సహచరులను వెంటబెట్టుకుని తిరుపతిలో భారీగా సభ పెట్టి జగన్ అండ్ కో నీ చెడుగుడు ఆడుకున్నారు. రెండేళ్లలో కూటమి ఏం చేసిందో స్వయంగా జనానికి చెప్పుకున్నారు. ఇదంతా చూసిన వైసీపీ క్యాడర్ నెత్తి నోరు కొట్టుకున్నారంట. అధికార పార్టీ అధినేత 76 ఏళ్ల వయసులో అంత శ్రద్ధగా నాయకులని క్యాడర్ ని వెంటబెట్టుకుని స్వయంగా తానే సభ నిర్వహించి తన నాయకత్వ లక్షణాలను స్వయంగా నిరూపించుకున్నారని, మన పార్టీ అధినేతకు ఇదేం గతి పట్టిందని వైసిపి నాయకులు ఫోన్లు చేసి ఒకరికొకరు చెప్పుకున్నారట.
రాష్ట్రం వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునివ్వడం.... లీడర్లను క్యాడర్ను రోడ్డెక్కించడం, తను మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో రిలాక్స్ అవ్వడం జగన్కు కొత్త ఏం కాదు. ఇప్పటికీ ఈ రెండేళ్లలో కనీసం అలా ఒక ఏడు ఎనిమిది సార్లు చేసి ఉంటాడు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసన అంటూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలను రోడ్డు ఎక్కితే ఇదే రకంగా జగన్ బెంగళూరు వెళ్ళిపోయాడు. అలాగే వివిధ సమస్యలపై వైసీపీ నేతలు చేసిన ఏ ఆందోళనకు జగన్ ఈ రెండేళ్లలో ఒక్కసారి కూడా హాజరు కాలేదు. అంతవరకు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి డీఎస్సీ పై ఆందోళన చేస్తుంటే ఎక్కడ జగన్ పాల్గొనలేదు. యుద్ధంలో నాయకుడు స్వయంగా ముందుండి నడిపితే ఆ యుద్ధం జరిగే తీరు వేరుగా ఉంటది. సైన్యాన్ని యుద్ధరంగానికి తోలి నాయకుడు అంతఃపురంలో నిద్రపోతే దాని ఫలితం మరోలా ఉంటుంది.
ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నది అదే. మమ్మల్ని అందరినీ రోడ్లపైకి తోలి జగన్ ప్యాలెస్ లో పడుకుంటే.... పార్టీ ఎలా లేస్తుంది అని కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీలో సీనియర్ ఒకరు జగన్ దగ్గర ప్రస్తావించారంట. తాను ధర్నాకి వస్తే.... రోడ్డెక్కి ఆందోళన చేస్తే మీడియా అటెన్షన్ మొత్తం తనపైనే ఉంటుందని... మిగిలిన పార్టీ నేతలను ఎవరిని పట్టించుకోరని.... అందుకే తాను రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేయనని జగన్ వివరణ ఇచ్చారట. అంతేకాదు ఇప్పుడు ఏం చేసినా చేయకపోయినా తన పాదయాత్ర మొదలైన తర్వాత జనం అటెన్షన్ మొత్తం తనపైనే ఉంటుందని, అసలు పొలిటికల్ సినే మారిపోతుందని జగన్ ధీమాగా ఉన్నారట. జగన్ సమాధానం చూసి ఆ సీనియర్ నేత షాక్ అయిపోయారట.
అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పడిన కష్టం ఇప్పటికీ చాలామంది గుర్తుతెచ్చుకుంటారు.2004 నుంచి 14 వరకు ఏ చిన్న కార్యక్రమం అయినా చంద్రబాబు సామాన్య కార్యకర్తల.... రోడ్డు ఎక్కేవారు. ఒకానొక సమయంలో బాబ్లీ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి , ఆందోళన చేసి అరెస్టు అయ్యారు. ఓబులాపురం మైన్స్ దగ్గరికి కూడా వెళ్లి రచ్చ చేసి వచ్చారు. ప్రాజెక్టుల దగ్గర కు వెళ్లి స్వయంగా ఆందోళన చేసేవారు. ప్రతిపక్ష నేతగా ఒక్కరోజు విశ్రమించినది లేదు. అంతవరకు ఎందుకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైయస్ కూడా ఎన్నోసార్లు రోడ్లెక్కి ఆందోళన చేసిన సందర్భాలు మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని వైసిపి లో కొందరు సీనియర్ నేతలు చర్చించుకుంటూ మనం రోడ్లెక్కి యుద్ధాలు చేస్తే మన నాయకుడు ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నాడని , పార్టీ లేవమంటే ఎక్కడ లేస్తుందని నిట్టూర్పులు విడుస్తున్నారట.