ఎండాకాలంలో సామాన్యులు ఆకాశంలో ఉండే సన్ స్ట్రోక్‌కు భయపడితే, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు మాత్రం కాలంతో సంబంధం లేకుండా తమ కడుపున పుట్టిన ‘సన్స్’ వల్ల వచ్చే ‘సన్ స్ట్రోక్’కు వణికిపోతున్నారు. క్షేత్రస్థాయి నుంచి శ్రమించి నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యాలు, దశాబ్దాల క్రెడిట్.. కొడుకులు చేసే పనుల వల్ల ఒక్క రాత్రిలోనే గంగలో కలిసిపోతున్నాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.ఏళ్లు కష్టపడి ఎన్నో సమస్యలు ఎదుర్కుని నిర్మించుకున్న జీవితాలు కొడుకులు చేసే తప్పుల వల్ల మంటల్లో కలిసిపోతున్నాయి. గతాన్ని పరిశీలిస్తే.. కొడుకుల దెబ్బకు విలవిలలాడిన ప్రముఖ నేతలెందరో ఉన్నారు.
ఇందులో ప్రముఖ వ్యక్తి కె. కేశవరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ఈ సీనియర్ నేతకు చాలా కాలం క్రితమే సన్‌స్ట్రోక్ రుచి తెలిసింది. ఆయన కుమారుడు వెంకట్ నివాసంలో వ్యాపార భాగస్వామి ప్రశాంత్ బుల్లెట్ గాయాలతో మృతిచెందడం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. అది హత్య అనే ఆరోపణలు రావడంతో, కేకే నైతిక బాధ్యత వహిస్తూ తన పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ లిస్ట్‌లో ఉండే మరో పొలిటీషియన్ ధర్మపురి శ్రీనివాస్. రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా చేసి, సీఎం రేసులో నిలిచిన డీఎస్ రాజకీయ జీవితానికి ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ లీగల్ ఇష్యూస్ స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. 2018లో ఓ ఆశ్రమ విద్యార్థినుల ఫిర్యాదుతో సంజయ్‌పై లైంగిక వేధింపుల కేసులు నమోదై, అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయింది.
కొడుకు చేసిన తప్పుతో రాజకీయంగా చాలా ఎఫెక్ట్ అయిన మరో నేత.. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య. 2015 వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. కానీ అప్పుడే సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు ఇంట్లో అనుమానస్పద స్థితిలో చనిపోయారు. కొడుకు అనిల్ కుమార్ వేధింపుల కారణంగా కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు చనిపోయారు అనేది ప్రధాన ఆరోపణ. ఈ ఘోర దురంతంతో కాంగ్రెస్ అధిష్టానం రాజయ్య టికెట్ రద్దు చేసి వేరొకరికి ఇచ్చింది. కొడుకు తెచ్చిన సెగతో ఆయన కెరీర్ బూడిదైంది. ఇలానే సన్‌స్ట్రోక్‌కు గురైన మరో నేత వనమా వెంకటేశ్వరరావు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత కొడుకు వనమా రాఘవ వేధింపుల తట్టుకోలేక, 2022లో పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో రాఘవ అరెస్ట్, పార్టీ సస్పెన్షన్‌కు గురవగా, తండ్రిగా వనమా తీవ్ర విమర్శలు ఎదుర్కొని పరువు పోగొట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కూడా సన్‌స్ట్రోక్ బాధితుడే. అతని కొడుకు రహీల్ ఆమీర్ వరుస వివాదాలతో తండ్రిని ఇరకాటంలో పెట్టాడు. 2022లో జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో ఒక పాప మరణానికి కారణమవ్వడం, ఆపై ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టడం వంటి కేసులు నమోదయ్యాయి. కొడుకును రాత్రికి రాత్రే దుబాయ్ పంపడం వంటి నాటకీయ పరిణామాలు షకీల్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశాయి.
అందరికీ సన్‌స్ట్రోక్స్ తగిలితే.. మాజీ హోం మంత్రి మహమూద్ అలీకి మాత్రం గ్రాండ్సన్ స్ట్రోక్ తగిలింది. జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ మనవడి పేరు, అలాగే మరికొందరు ప్రముఖ ప్రజాప్రతినిధుల పిల్లల పేర్లు రావడం సంచలనం సృష్టించింది. ఇది ఆయా నాయకుల ఇమేజ్ను శాశ్వతంగా డ్యామేజ్ చేసింది. రాజకీయ వ్యూహాలు, సంక్షోభాలను చిటికెలో మేనేజ్ చేసే లీడర్లకు, సొంత ఇంట్లో పుట్టే ఈ ‘సన్ స్ట్రోక్’కు మాత్రం ఎలాంటి వ్యాక్సిన్ దొరకడం లేదు. వేలమంది యువతకు దిశానిర్దేశం చేసే ఈ నాయకులు, తమ సొంత కొడుకులను లైన్లో పెట్టలేకపోతున్నారు. కాబట్టి, పొలిటికల్ కెరీర్ భద్రంగా ఉండాలంటే నాయకులు తమ కొడుకుల ప్రవర్తనపై నిఘా పెట్టడం అవసరం. లేదంటే ఏ అర్ధరాత్రో కొడుకులు చేసే తప్పుల వల్ల దశాబ్దాల రాజకీయ జీవితం ఎండలో పెట్టిన ఐస్‌క్రీమ్‌లా కరిగిపోవడం ఖాయం.