మాజీ సీఎం వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదం ముదురుతోంది. వై.ఎస్.విజయమ్మ రాసిన బహిరంగ లేఖ, షర్మిల ప్రెస్‌మీట్‌తో మరోసారి జగన్ మోసం, స్వార్థం బయటపడ్డాయి. ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చెల్లికి ఆస్తి వాటా ఇవ్వకుండా జగన్ కోర్టు మెట్లు ఎక్కడం, తండ్రి రాసిన వీలునామాను కాదని కేవలం తానే సంపాదించానని చెప్పడంపై తల్లి విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డలిద్దరూ కలిసి ఉండాలని కోరుకున్న విజయమ్మ, ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న తీరుతో కన్నీళ్లు పెట్టుకుంటూ మనోవేదన చెందుతున్నారు.విజయమ్మ తన లేఖలో జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుటుంబ ఆస్తుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు తనను ఎంతో వేదనకు గురిచేశాయన్నారు విజయమ్మ. వైఎస్సార్ బ్రతికున్నప్పుడే ఆస్తుల పంపిణీపై స్పష్టమైన అవగాహన ఉందని, అయితే జగన్ ఇప్పుడు వాటన్నింటినీ కాదని, చెల్లిని కోర్టులకు ఈడ్చడం అన్యాయమన్నారు.
తన కళ్ల ముందే పిల్లలిద్దరూ గొడవపడటం చూడలేకపోయినా, నిజం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె తన లేఖ ద్వారా జగన్‌ను ప్రజల ముందు నిలబెట్టారు.మరోవైపు వైఎస్ షర్మిల సైతం జగన్ వైఖరిని కడిగిపారేశారు. జగన్ తనకు ఇస్తున్నవి ఆస్తులు కాదని, తన తండ్రి వైఎస్సార్ కష్టార్జితంలో తనకున్న చట్టబద్ధమైన వాటా అని ఆమె కుండబద్దలు కొట్టారు. అన్నగా చెల్లికి ఇవ్వాల్సిన గౌరవం పక్కన పెట్టి, ఆస్తుల కోసం కోర్టులకు వెళ్లడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. తండ్రి మరణం తర్వాత కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన వ్యక్తి, ఆస్తుల కోసం సొంత తల్లిని, చెల్లిని వేధించడం చూస్తుంటే జగన్ ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చన్నారు.ఈ వివాదంలో జగన్ తీసుకున్న MOU రద్దు నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. గతంలోనే ఒప్పందం కుదుర్చుకుని, ఇప్పుడు అది చెల్లదని కోర్టుకు వెళ్లడం వెనుక జగన్ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరస్వతీ పవర్ ప్రాజెక్టులో షర్మిలకు ఇచ్చిన షేర్లను తిరిగి లాక్కోవడానికి జగన్ ప్రయత్నించడం, అధికారాన్ని కుటుంబ సభ్యులను అణచివేయడానికి వాడుకోవడం లాంటి అంశాలను షర్మిల సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. ఇది కేవలం ఆస్తి గొడవ మాత్రమే కాదని, జగన్ మనస్తత్వానికి అద్దం పడుతోందని ఆమె విమర్శించారు.మొత్తానికి విజయమ్మ లేఖ, షర్మిల పోరాటం జగన్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీశాయి. సొంత కుటుంబ సభ్యులే ఆయనపై బహిరంగంగా యుద్ధం ప్రకటించడం, ఆయన చేస్తున్న అక్రమాలను సాక్షాత్తూ తల్లి, చెల్లి ప్రపంచానికి వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సొంత తల్లిని, తోడ బుట్టిన చెల్లిన మోసం చేసిన వ్యక్తి రేపు రాష్ట్ర ప్రజలకు ఏ మేరకు న్యాయం చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.