అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా ఇరాన్ మరో సంచలనం సృష్టించింది. "మేము దయతలిచి వాళ్లకు ఒక వారం రోజుల పాటు వీక్ ఆఫ్ ఇచ్చాం" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను యుద్ధం వైపు నెట్టేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ అలా నోరు పారేసుకున్నాడో లేదో.. ఇరాన్ ఏకంగా అమెరికాకు ఒక గట్టి 'స్లిప్పర్ షాట్' ఇచ్చింది. ఎంతో వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ క్షిపణుల వర్షం కురిపించారు. ఒక చమురు ట్యాంకర్ మంటల్లో తగలబడిపోతోంది. అసలు ట్రంప్ ఏమన్నాడు? ఇరాన్ ఎందుకు ఇంతలా రెచ్చిపోయింది? ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది?
అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. గత మూడు వారాలుగా అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ఆపడానికి ఒక కీలక ఒప్పందం నడుస్తోంది. ఖతార్ దేశం మధ్యవర్తిత్వం వహించి, కనీసం ఒక వారం రోజుల పాటు ఎలాంటి దాడులు చేసుకోవద్దని ఇరు దేశాలను ఒప్పించింది. ఈ వారం రోజుల ఒప్పందం ఎందుకు పెట్టారంటే.. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఆయనకు ప్రభుత్వ అధికారిక అంత్యక్రియలు నిర్వహించడానికి, ఇరాన్ దేశం సంతాపాన్ని ప్రకటించుకోవడానికి ఈ గడువును ఉపయోగించుకున్నారు.
అంతవరకు అంతా బానే ఉంది. కానీ, ఈ ఒప్పంద గడువు ముగియగానే డొనాల్డ్ ట్రంప్ తన పాత శైలిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. "మేము చాలా మంచోళ్లం కాబట్టి, పాపం వాళ్ల నాయకుడి అంత్యక్రియల కోసం ఇరాన్‌కు ఒక వారం రోజులు వీక్ ఆఫ్ ఇచ్చాం" అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. ఒక దేశ అత్యున్నత నాయకుడు చనిపోతే.. ఆ సంతాపాన్ని హేళన చేస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌కు నరనరాన కోపాన్ని తెప్పించాయి. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ఒక్క కామెంట్‌కు ఇరాన్ మాటలతో సమాధానం చెప్పలేదు.. నేరుగా క్షిపణులతో సమాధానం ఇచ్చింది.
అమెరికా అగ్రరాజ్యం అయితే మాకేంటి అన్నట్టుగా.. హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారీ వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కనీసం రెండు శక్తివంతమైన మిస్సైళ్లను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఆ రెండు నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా రక్షణ వర్గాలే స్వయంగా అంగీకరించాయి. ఇది ఖచ్చితంగా అమెరికా అహంకారానికి ఇరాన్ కొట్టిన పవర్ ఫుల్ స్లిప్పర్ షాట్ అని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.
కథ ఇక్కడితో అయిపోలేదు.. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఒమన్ తీరానికి సమీపంలో హార్ముజ్ జలసంధి నుంచి బయటకు వస్తున్న మరో భారీ చమురు ట్యాంకర్‌పై కూడా ఒక గుర్తుతెలియని ప్రొజెక్టైల్ లేదా క్షిపణి దాడి జరిగింది. బ్రిటన్ సైన్యానికి చెందిన 'యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్' అందించిన సమాచారం ప్రకారం.. ఆ చమురు ట్యాంకర్ ఎడమ వైపు భాగానికి ఈ క్షిపణి బలంగా తాకడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సముద్ర కాలుష్యం ఏమీ జరగలేదని, కానీ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బ్రిటన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ట్యాంకర్ దాడికి తామే బాధ్యులమని ఎవరూ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇదంతా ఇరాన్ మరియు దాని మద్దతుదారుల పనేనని అందరూ గట్టిగా అనుమానిస్తున్నారు. తన వ్యాఖ్యల తర్వాత ఇరాన్ ఇంతలా రెచ్చిపోవడంతో డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ఇరాన్‌కు ఊహించని రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. "ఈ యుద్ధంలో ఎలాగైనా సరే మేమే గెలవబోతున్నాం" అంటూ ట్రంప్ ఘీంకరించారు. అంతేకాదు.. "మాకు శాంతియుత ఒప్పందాలు చేసుకోవాలనే ఉంది, కానీ ఇరాన్ ఇలాగే తోక జాడిస్తే మాత్రం.. కేవలం ఒకే ఒక్క గంటలో ఇరాన్ దేశంలో ఉన్న వంతెనలన్నింటినీ మేము బాంబులతో కూల్చివేయగలం" అంటూ అత్యంత భయంకరమైన హెచ్చరికను జారీ చేశారు.
ట్రంప్ చేసిన ఈ 'వన్ అవర్' వార్నింగ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రీజియన్ లో అగ్గి రాజేసింది. ప్రస్తుతానికి రెండు దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నామని చెబుతూనే.. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి క్షిపణులను సిద్ధం చేసుకుంటున్నారు. హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అయ్యే అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ కనుక పూర్తిస్థాయి యుద్ధం వస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మరి ట్రంప్ అన్నట్టుగా అమెరికా ప్రతీకార దాడులు చేస్తుందా? లేక ఇరాన్ దెబ్బకు వెనక్కి తగ్గుతుందా? అనేది చూడాలి.