ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలైన హైడ్రామా ఇప్పుడు ఢిల్లీ వేదికగా మారబోతోంది. ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలు, చట్టాల ప్రయోగాలు చూస్తుంటే.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక భారీ పొలిటికల్ స్కెచ్ వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇక్కడ అరాచక పాలన సాగుతోందని ఏకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అలాగే భారత రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకున్నారనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. అసలు జగన్ చేతికి చిక్కిన ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఏంటి? అమిత్ షా దగ్గర జగన్ ఏం ప్రస్తావించబోతున్నారు? కూటమి ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కోబోతోంది? ఈ వీడియోలో చూద్దాం.
అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఎంచుకున్న మొదటి అస్త్రం.. విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ను ఎంతలా కుదిపేసిందో మనందరికీ తెలుసు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణను విచక్షణారహితంగా కొట్టి చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు దొరక్కుండా శవాన్ని కూడా మాయం చేశారనేది ప్రధాన ఆరోపణ. తాజాగా ఈ కేసులో సీఐ నాగరాజుతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు లొంగిపోవడం, పోలీస్ స్టేషన్ మేడపై మానవ అస్థికలు, కాలిపోయిన బూడిదను సిట్ స్వాధీనం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
ఈ కేసును అడ్డం పెట్టుకుని, ఏపీలో పోలీసుల రక్షణలోనే హత్యలు జరుగుతున్నాయని, ప్రజలకు రక్షణ కరువైందనే పాయింట్‌ను జగన్ గట్టిగా హైలైట్ చేస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే నేరస్థులుగా మారిన ఈ ఉదంతాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి, ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని జగన్ భావిస్తున్నారు. ఇక జగన్ వేస్తున్న ప్లాన్స్ లో రెండో కీలకమైన అంశం.. యూట్యూబర్ 'ప్రశ్న' రావణ్ అరెస్ట్. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే నెపంతో ఒక వ్యక్తిని వరుసగా 5 సార్లు అరెస్ట్ చేయడం, ఆఖరికి ఉగ్రవాదులు, దేశద్రోహులపై పెట్టే అత్యంత కఠినమైన 'ఉపా' చట్టాన్ని ప్రయోగించడంపై జాతీయ స్థాయిలో కూడా చర్చ మొదలైంది.
రాజకీయ విమర్శలు చేసినందుకు ఇంత కఠినమైన చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారంటూ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఈ 'ఉపా' కేసును ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించి.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరిస్తోందని ఫిర్యాదు చేయనున్నారు. ఒక సాధారణ సోషల్ మీడియా విమర్శకుడిపై కేంద్ర చట్టాలను ఇలా దుర్వినియోగం చేస్తున్న తీరును అమిత్ షాకు వివరించి, కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇప్పించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ రెండు బలమైన అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు ఉంచేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీలో ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టారు. అమిత్ షా అపాయింట్మెంట్ దొరికితే.. జగన్ స్వయంగా ఒక పెద్ద నివేదికతో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నివేదికలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, మరియు తాజా లాకప్ డెత్ వివరాలన్నింటినీ పొందుపరిచినట్లు భోగట్టా. కేంద్రంలో బీజేపీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిగా ఉన్నప్పటికీ.. శాంతిభద్రతల విషయంలో హోంశాఖ చాలా సీరియస్‌గా ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా కేంద్రం స్పందిస్తుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు.
అయితే జగన్ వేస్తున్న ఈ ఢిల్లీ ప్లాన్స్ పై కూటమి ప్రభుత్వం కూడా ముందే అప్రమత్తమైంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, తప్పు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి జైలుకు పంపిందని, తద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని టీడీపీ, జనసేన నేతలు వాదిస్తున్నారు. అటు ప్రశ్న రావణ్ విషయంలో కూడా.. అతను కేవలం రాజకీయ విమర్శలు చేయలేదని, ఏలూరు సభలో నిషేధిత మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు కాబట్టే చట్టప్రకారం 'ఉపా' కేసు పెట్టాల్సి వచ్చిందని పోలీసులు గట్టి ఆధారాలను సిద్ధం చేశారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం చెప్పినా.. కేంద్రం వద్ద అన్ని సాక్ష్యాలు ముందే ఉంటాయి కాబట్టి జగన్ పప్పులు ఉడకవని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, సాయి కృష్ణ లాకప్ డెత్ మరియు ప్రశ్న రావణ్ అరెస్ట్ ఎపిసోడ్లు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. మరి జగన్‌కు అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఈ ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అనేది చూడాలి.