Top Story: ఇండోనేషియాకు బ్రహ్మోస్, అస్త్ర క్షిపణులు చైనాను రౌండప్ చేసిన భారత భ్రహ్మాస్త్రాలు.!

ఇండోనేషియా.. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కుట్రలకు నలిగిపోతున్న చిన్న దేశం. చైనా నుంచి ఎప్పటికైనా ఆ దేశానికి ముప్పు తప్పదు. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌తోపాటు ఈ దేశంపైనా చైనా నౌకాదళం దాడులు చేస్తోంది.

Post Published By: dialnews
Updated : 8 July 2026, 9:27 AM IST

ఇండోనేషియా.. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కుట్రలకు నలిగిపోతున్న చిన్న దేశం. చైనా నుంచి ఎప్పటికైనా ఆ దేశానికి ముప్పు తప్పదు. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌తోపాటు ఈ దేశంపైనా చైనా నౌకాదళం దాడులు చేస్తోంది. కానీ, చైనాను ఎదుర్కొనేంత రక్షణ వ్యవస్థ ఆ దేశానికి లేదు. అందుకే ఇండియాను ఆశ్రయిస్తోంది. భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ కోసం చాన్నాళ్లుగా చర్చిస్తోంది. తాజాగా ఆ ఒప్పందం ఫైనల్ అయింది. బ్రహ్మోస్ ఒక్కటే కాదు.. భారత మరో అస్త్రం అస్త్ర కూడా ఇండోనేషియాను రక్షించబోతోంది. మోదీ పర్యటనలో ఈ మేరకు ఆ రెండు క్షిపణుల ఒప్పందాలు ఫైనల్ అయ్యాయి. ఇంతకూ, ఇండోనేషియాకు బ్రహ్మోస్ మిస్సైళ్లు ఇవ్వడం వెనుక మోడీ సర్కార్ వ్యూహం ఏంటి? భారత బ్రహ్మాస్త్రాలపై ఇండోనేషియా ఎందుకు ఫోకస్ చేసింది?

దక్షిణ చైనా సముద్రంపై ఏకపక్షంగా హక్కులు క్లెయిమ్ చేసుకుంటూ.. 'నైన్-డాష్ లైన్' పేరుతో పొరుగు దేశాల సముద్ర సరిహద్దులను చైనా ఆక్రమిస్తోంది. ఇండోనేషియాకు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి వచ్చే నతునా దీవుల పరిసరాల్లోకి చైనా కోస్ట్ గార్డ్, చొరబాటు నౌకలు తరచూ వస్తుండటం జకార్తాకు పెద్ద తలనొప్పిగా మారింది. చైనా నౌకాదళం, మిలిషియాను ఎదుర్కోవడానికి సాంప్రదాయ రక్షణ వ్యవస్థలు సరిపోవని ఇండోనేషియా గుర్తించింది. ఇక్కడే ఆ దేశం మన బ్రహ్మాస్త్రాలైన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల వైపు చూసింది. ఎందుకంటే గంటకు దాదాపు 3,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అడ్డుకోవడం చైనా వద్ద ఉన్న ఏ ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కైనా అసాధ్యం. ఇండోనేషియా తీరప్రాంత రక్షణ కోసం తీరం నుండి ప్రయోగించే యాంటీ-షిప్ బ్రహ్మోస్ సిస్టమ్‌ను, అలాగే యుద్ధనౌకలపై మోహరించడానికి నేవల్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే, నతునా దీవుల వైపు కన్నెత్తి చూసే చైనా యుద్ధనౌకలను క్షణాల్లో బూడిద చేసే సామర్థ్యం ఇండోనేషియాకు వస్తుంది.

కేవలం సముద్ర రక్షణే కాదు.. గగనతలంలోనూ చైనా ఫైటర్ జెట్స్‌కు చెక్ పెట్టేందుకు భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన 'అస్త్ర' బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిపై ఇండోనేషియా కన్నేసింది. ఇండోనేషియా వాయుసేనలో రష్యా తయారీ సుఖోయ్-30 ఫైటర్ జెట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటికే తన సుఖోయ్-30 MKI యుద్ధ విమానాల్లో 'అస్త్ర' క్షిపణులను విజయవంతంగా ఇంటిగ్రేట్ చేసి వాడుతోంది. ఇదే టెక్నాలజీని తమ సుఖోయ్ విమానాలకు కూడా వర్తింపజేసి, చైనా సుఖోయ్, జె-20 విమానాలను గగనతలంలోనే కూల్చేందుకు 'అస్త్ర' సరైన ఆయుధమని జకార్తా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలోనే ఫిలిప్పీన్స్ దేశం 375 మిలియన్ డాలర్లతో భారత్ నుండి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసి చైనాకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇండోనేషియాతో జరగబోయే బ్రహ్మోస్ ఒప్పందం అంతకంటే పెద్దదని రక్షణ వర్గాల సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఇండోనేషియాతో బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల డీల్స్ విలువ 250 మిలియన్ డాలర్ల నుండి 400 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 2 వేల కోట్ల నుండి 3వేల 300 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండోనేషియా యుద్ధనౌకలపై బ్రహ్మోస్ అమరికకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. కానీ, ఇండోనేషియాకు బ్రహ్మోస్ విక్రయాల వెనుక భారత్ వ్యూహమేంటి?

చైనా 'స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్' వ్యూహంతో శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో పోర్టులను దక్కించుకుంటూ భారత్‌ను చుట్టుముట్టాలని చూస్తోంది. దీనికి గట్టి కౌంటర్ ఇవ్వడమే భారత్ వ్యూహం. చైనాకు లైఫ్ లైన్ లాంటి 'మలక్కా జలసంధి'కి ఇండోనేషియా ప్రవేశ ద్వారం లాంటిది. ఇండోనేషియాకు క్షిపణులను సరఫరా చేయడం ద్వారా చైనా ఎనర్జీ సప్లై రూట్‌పై భారత్ పరోక్ష పట్టు సాధిస్తుంది. చైనా మన సరిహద్దుల్లోకి వస్తే, భారత్ నేరుగా చైనా పెరట్లోకి వెళ్లి మిత్రదేశాలకు ఆయుధాలు అందించి డ్రాగన్‌కు ముకుతాడు వేస్తోంది. ఇండోనేషియాకు ఆయుధాలు కొనడానికి ప్రపంచంలో చాలా ఆప్షన్లు ఉన్నా భారత్‌ను ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, పైగా అవి అనేక మానవ హక్కుల ఆంక్షలతో ముడిపడి ఉంటాయి. అటు రష్యా ఆయుధాలపై ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆంక్షల భయం ఉంది. ఈ తరుణంలో భారత్ నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిఫెన్స్ పార్ట్నర్‌గా నిలిచింది.

భారత ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యాక్ట్ ఈస్ట్ విధానానికి ఈ రక్షణ ఒప్పందాలు కీలకంగా నిలుస్తున్నాయి. ఆగ్నేయాసియా దేశాలతో కేవలం సాంస్కృతిక, వ్యాపార సంబంధాలే కాకుండా.. 'భద్రతా పరమైన భాగస్వామ్యం ఎంత ముఖ్యం అనేదానికి ఈ డీల్స్ ఒక నిదర్శనం. ఆసియాన్ రీజియన్‌లో చైనా పెత్తనాన్ని అంగీకరించని దేశాలన్నింటికీ ఇండియా ఒక బలమైన రక్షణ ఛత్రంగా మారుతోంది. భారత్-ఇండోనేషియా మధ్య కుదురుతున్న అస్త్ర, బ్రహ్మోస్ డీల్స్ కేవలం వ్యాపార ఒప్పందాలు కావు.. ఇవి ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడుకు బ్రేకులు వేసే వ్యూహాత్మక గేమ్ ఛేంజర్స్. ఒకప్పుడు ఆయుధాల దిగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు డ్రాగన్ గుమ్మంలో ఉన్న దేశాలకు ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి ఎదగడం భౌగోళిక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయంగా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా మన పొరుగు దేశాలతో కలిసి కుట్రలు చేస్తున్న డ్రాగన్‌ను.. మన బ్రహ్మాస్త్రాలు ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయం.

 

Published : 
  • 8 July 2026, 9:27 AM IST