అమెరికా-ఇరాన్ యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుందా..? అంటే అవుననే సిగ్నల్స్ వస్తున్నాయి. తాజా పరిణామాల ప్రకారం, యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ప్రయత్నాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు.. వాషింగ్టన్ ఒక భారీ 15 సూత్రాల శాంతి ప్రణాళికను టెహ్రాన్‌కు అందించింది. ఎట్టకేలకు గడచిన నాలుగు వారాలుగా మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మార్చిన యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ఒక డేరింగ్ స్టెప్ వేసింది.
తాజా సమాచారం ప్రకారం, వాషింగ్టన్ నెల రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించడమే కాకుండా, యుద్ధాన్ని శాశ్వతంగా ఆపివేసేందుకు 15 సూత్రాల ప్రణాళికను టెహ్రాన్‌కు పంపింది. ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇరాన్ దీనికి అంగీకరిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ 15 సూత్రాల ప్రతిపాదనను పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు అందజేసింది. ఇందులో ఉన్న కొన్ని ప్రధాన అంశాలు ఇవే.
అణు కార్యక్రమ నియంత్రణ: ఇరాన్ తన అణు కేంద్రాలను పూర్తిగా మూసివేయాలి, యురేనియం శుద్ధిని ఆపివేయాలి. భూగర్భ అణు కేంద్రాలను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో పూర్తిగా సీల్ చేయాలి.
హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని నిరంతరాయంగా తెరిచి ఉంచాలి.
క్షిపణి పరిమితులు: ఇరాన్ గర్వంగా చెప్పుకునే 'ఖైబార్ షేకన్' వంటి బాలిస్టిక్ మిసైళ్ల పరిధిని 1,000 కిలోమీటర్ల లోపుకు తగ్గించాలి. అంటే అవి ఇజ్రాయెల్‌ను తాకలేవు.
ప్రాక్సీ గ్రూపులకు స్వస్తి: హెజ్బుల్లా, హౌతీలు మరియు హమాస్ గ్రూపులకు ఇచ్చే ఒక్క రూపాయి కూడా నిలిపివేయాలి. అంటే మధ్యప్రాచ్యంలో ఇరాన్ తన పట్టును పూర్తిగా కోల్పోవాలి.
ప్రతిగా అమెరికా ఆఫర్: వీటికి ఇరాన్ అంగీకరిస్తే, అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను తొలగించి, సివిల్ అణు కార్యక్రమాలకు సహకారం అందిస్తుంది.
అయితే ఇరాన్ అంగీకారం తెలిపితే మాత్రం.. ఆర్థిక ఆంక్షలు తొలగిపోతాయి, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటుంది. కానీ, దేశ రక్షణ కవచం పోతుంది. ఒకవేళ కాదు కూడదు అంటే.. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై నేరుగా బాంబుల వర్షం కురిపిస్తాయి. ఇది దేశాన్నే నాశనం చేసే యుద్దానికి దారితీస్తుంది. ఈ 15 సూత్రాల లేఖను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ద్వారా అమెరికా పంపింది. ట్రంప్ స్వయంగా షరీఫ్ పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా.. "నేను యుద్ధం ఆపడానికి ట్రై చేస్తున్నాను, ఇరాన్ లొంగకపోతే దానికి వారే బాధ్యులు" అనే సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చినట్లు అయింది.
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, 'చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోంది, ఇరాన్ కూడా యుద్ధం ముగియాలని బలంగా కోరుకుంటోంది' అని పేర్కొన్నారు. అయితే, ఇరాన్ సైనిక ప్రతినిధి ఎబ్రహీం జోల్ఫాకరీ దీనిని తిప్పికొట్టారు. 'అమెరికా తనలో తాను చర్చలు జరుపుకుంటోంది' అని ఎద్దేవా చేశారు. యుద్ధం వల్ల కలిగిన నష్టానికి పరిహారం కావాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు, ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణ వార్తలపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా పంపిన ప్లాన్ గురించి తమకు ముందే సమాచారం లేదని, చర్చల పేరుతో ఇరాన్ మళ్ళీ బలం పుంజుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. దాడులు మాత్రం ఆపేది లేదని స్పష్టం చేస్తోంది.
చర్చల వార్తలు వస్తున్నప్పటికీ, నేడు కూడా టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు భీకర దాడులు.. మధ్యప్రాచ్యం ఇప్పుడు ఒక సందిగ్ధ అవస్థలో ఉంది. ఈ 15 సూత్రాల ప్రణాళిక యుద్ధానికి ముగింపు పలుకుతుందా? లేదా ఇది కేవలం కాలయాపనకేనా? ఈ 15 సూత్రాల ప్రణాళిక ఇరాన్‌కు ఒక 'లైఫ్ లైన్' అవుతుందా? లేక ఆ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే 'డెడ్లీ ట్రాప్' అవుతుందా? ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం.. రాబోయే దశాబ్దం పాటు ప్రపంచ గమనాన్ని మార్చబోతోందనడంలో సందేహం లేదు.