Top story:కవిత పయనం..అయోమయం గందరగోళంలో జాగృతి కార్యకర్తలు…!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఏం కావాలి ? ఆమె ఎవరి కోసం పని చేస్తోంది ? కవిత వ్యవహారశైలితో నష్టపోయేది ఎవరు ? లాభపడేది ఏ రాజకీయ పార్టీ ? ఓ వైపు రాజకీయ పార్టీ పెడతానంటూ...మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు ?

Post Published By: dialnews
Updated : 10 February 2026, 9:08 AM IST

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఏం కావాలి ? ఆమె ఎవరి కోసం పని చేస్తోంది ? కవిత వ్యవహారశైలితో నష్టపోయేది ఎవరు ? లాభపడేది ఏ రాజకీయ పార్టీ ? ఓ వైపు రాజకీయ పార్టీ పెడతానంటూ...మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు ? కవిత మాటలకు...చేతలకు పొంతన లేకుండా పోయిందా ? ఎవర్ని టార్గెట్‌ చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ? బీఆర్ఎస్‌ దెబ్బకొట్టడమా ? లేదంటే కాంగ్రెస్‌ పార్టీనా ? అసలు కవిత లక్ష్యమేంటి ?తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వైఖరి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కవితకు ఏం కావాలి ? పార్టీ ఏర్పాటు చేయకముందే ఎన్నికల బరిలోకి ఎందుకు దిగారు ? అది కూడా సింహం గుర్తుపైనే ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

కవిత చెబుతున్న మాటలకు...చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదు. అసలు కవిత రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందా అన్న సందేహలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వైఖరితో నష్టపోయేదెవరు ? లబ్దిపొందెదెవరు ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. కవిత ఎవరికి మేలు చేయాలని ఇలా వ్యవహరిస్తున్నారా ? తెర వెనుక ఏదైనా ఏజెండా ఉందా ? పాత రాజకీయ శక్తులతో కొత్త పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాజకీయాల్లో కవితకు ఎలాంటి క్లారిటీ లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒకసారి కేసీఆర్‌ను విమర్శిస్తారు...మరోసారి ప్రశంసలు కురిపిస్తారు. బీఆర్ఎస్‌ విషయంలోనే ఆమె వైఖరి సరిగా లేదు. కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇస్తే...నిరసన చేపట్టలేదు. ఎవరు చట్టానికి అతీతులు కారంటూ బాంబ్ పేల్చారు.

కొత్త పార్టీ పెడతామన్న కవిత...ఉన్నట్టుండి మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగడంపై అనేక సందేహాలు వస్తున్నాయి. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీతో ఎందుకు చేతులు కలిపారు ? ఆ పార్టీ బీం ఫాంల మీద పోటీ చేయడం ఏంటి ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పుర పోరులో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోత్తుల కోసం కవిత కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సింహం గుర్తుపై పోటీ చేస్తారని కవిత ప్రకటించగానే...ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతలు ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించారు. దీంతో ఆగమేఘాల మీద ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతలతో సమావేశం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. టికెట్ల కేటాయింపుపై కవిత పక్కా ప్లాన్‌తో ఉన్నప్పటికీ...వ్యూహాలు బెడసికొట్టినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో ఓ వీడియో వైరల్ కావడంతో దీనికి మరింత బలం చేకూర్చుతోంది. టికెట్ ఇస్తామంటూ డబ్బు తీసుకొన్నారన్న వీడియోతో రచ్చవుతోంది. పలు చోట్ల జాగృతి కార్యకర్తలు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

సస్పెండ్‌ చేసిన తర్వాత...బీఆర్ఎస్‌ పై విరుచుకుపడుతున్నారు. సందర్బం వచ్చినపుడల్లా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులపై ఆరోపణలు సంధిస్తున్నారు. కారు పార్టీని పూర్తిగా డ్యామేజ్‌ చేయాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కవిత అసలు టార్గెట్‌ ఎవరు ? అంటే గులాబీ పార్టీనే అన్నది ఆమె విమర్శల ద్వారా అర్థమవుతుంది. కాంగ్రెస్‌ పార్టీకి మైలేజ్‌ తీసుకొచ్చేలా...బీఆర్ఎస్‌ను ఇరకాటంలో నెట్టేలా అనేక అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కేసీఆర్‌ హయాంలో జరిగిన అవినీతిపై కవిత ప్రశ్నిస్తున్నారు. కవితనే కాంగ్రెస్‌కు అస్త్రాలు అందిస్తున్నారనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీ అనేక రకాల లీకులు ఇవ్వడంతో...ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారన్న సందేహాలు వస్తున్నాయి. ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నేతలతో జరిగింది ఒకటైతే...కవిత చెప్పింది మరోకటి. ఇక ప్రశాంత్‌ కిశోర్‌ పని చేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ ఏ పార్టీకి పని చేయడం లేదని క్లారిటీ ఇవ్వడంతో కవిత ఇజ్జత్‌ గంగలో కలిసిపోయింది.

Published : 
  • 10 February 2026, 9:08 AM IST