Top Story: అమెరికా అమ్ములపొదిలో ఆయుధాలేంటి ? ఇరాన్‌ను వణికిస్తున్న అగ్రరాజ్యం…!

ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా..అగ్రరాజ్యంతో పాటు ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నాయి.

Post Published By: dialnews
Updated : 5 March 2026, 7:30 PM IST

ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా..అగ్రరాజ్యంతో పాటు ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా ప్రయోగిస్తున్న ఆయుధాలు ఏంటి ? ఇరాన్‌ వాడుతున్న ఆయుధాల ప్రత్యేకత ఏంటి ? ఎన్ని టార్గెట్లు పూర్తి చేశాయి ?పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సైనిక విభాగం..ఐఆర్జీసీ దాడులను తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై 17వ విడత దాడులను ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4గా ఇరాన్ వెల్లడించింది. పరస్పరం దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. అటు అమెరికా చేపట్టిన ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో...ఇజ్రాయెల్‌తో కలిసి 2వేలకుపైగా టార్గెట్లను ధ్వంసం చేసినట్లు యూఎస్ ఆర్మీ వెల్లడించింది.

ఇరాన్‌పై దాడులకు ఉపయోగించిన ఆయుధాలను అమెరికా వెల్లడించింది. భారీ లక్ష్యాలను ఛేదించే మిస్సైల్స్‌...ఫైటర్ జెట్లు, బాంబర్లు ఎన్నో ఉన్నాయి. బి-2 స్టెల్త్‌ బాంబర్లు, లూకస్‌ డ్రోన్లు, పేట్రియాట్‌ క్షిపణులు, థాడ్‌ యాంటీ బాలిస్టిక్‌ మిసైల్‌ సిస్టమ్‌ను ఉపయోగించింది. అంతేకాకుండా ఎఫ్‌-18, ఎఫ్‌-16, ఎఫ్‌-22 ఫైటర్‌ జెట్లు, ఎ-10 అటాక్‌ జెట్స్‌, ఎఫ్‌-35 స్టెల్త్‌ ఫైటర్స్‌, ఈఏ-18జీ ఎలక్ట్రానిక్‌ అటాక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, అవాక్స్‌ విమానాలు...ఇరాన్‌పై దాడులు చేశారు. ఎయిర్‌బార్న్‌ కమ్యూనికేషన్‌ రిలే, పి-8 మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఆర్సీ-135 నిఘా విమానం, ఎంక్యూ-9 రీపర్స్‌ యుద్ధంలో పాల్గొంటున్నాయి. వీటితో పాటు ఎం-142 హైమొబిలిటీ రాకెట్‌ వ్యవస్థ, అణుశక్తి విమాన వాహక నౌక, గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్లు, కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థలు, రీఫ్యూయలింగ్‌ విమానాలతో అమెరికా దాడులు చేస్తోంది. రీఫ్యూయలింగ్‌ షిప్‌లు, సి-17 గ్లోబ్‌ మాస్టర్‌ కార్గో విమానం, సి-130 కార్గో విమానం వాడింది.

అమెరికా వాయుసేన అమ్ములపొదిలో బాంబర్‌ విమానాల్లో బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ ముఖ్యమైనది. ఒకరకంగా చెప్పాలంటే యుద్ధ విమానాల్లో అనకొండ లాంటిది. బి-52 స్ట్రాటో ఫోర్ట్రెస్‌ బాంబర్‌...అమెరికా వాయుసేనకు వెన్నెముక లాంటిది. 2001లో అఫ్గానిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ ఎండ్యూరింగ్‌ ఫ్రీడమ్‌లో బి-52లు తాలిబన్‌ దళాలను వణికించాయి. ఆ తర్వాత ఆపరేషన్‌ ఇరాకీ ఫ్రీడమ్‌లోను పాల్గొన్నాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులను అణచివేయడంలో వీటి పాత్ర చాలా కీలకం. 2016లో ఈ బాంబర్లు 1800 సార్లు దాడుల్లో పాల్గొని ఐసిస్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. మొత్తం 744 విమానాలను తయారుచేయగా.. చివరి బి-52హెచ్‌ వేరియంట్‌ను 1962లో తయారుచేశారంటే అవెంత పాతవో అర్థం చేసుకోవచ్చు.

ఇది ఒక్కటే 20 క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించగలదు. దీనిని అవసరాలకు అనుగుణంగా అమెరికా యుద్ధాల్లో వాడుకొంటోంది. కోల్డ్‌వార్‌ వేళ అణ్వాయుధాలను ప్రయోగించగల బాంబర్‌గా ఇది భయపెట్టగా.. వియత్నాం యుద్ధంలో చిన్నస్థాయి బాంబర్‌లాగా సేవలు అందించింది. తాజాగా ఇరాన్‌ పై దాడులకు వీటిని రంగంలోకి దించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. రెండు బి-52లు గాల్లో ఉంటే 3,64,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏం జరుగుతోందో పసిగట్టగలవు. వీటిపై రెండు ఎలక్ట్రో ఆప్టికల్‌ వ్యూయింగ్‌ సెన్సర్లు, ఫార్వర్డ్‌ లుకింగ్‌ ఇన్ఫ్రారెడ్‌, అడ్వాన్స్‌డ్‌ టార్గెటింగ్‌, బ్యాటిల్‌ అసెస్‌మెంట్‌ వంటి వ్యవస్థలు ఉన్నాయి.

మరోవైపు ఇరాన్‌కు భారీ ఆయుధాలు ఉన్నాయి. 2వేల 500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ శ్రేణి క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్‌ను, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తున్నాయి. అలాగే 150-800 కి.మీ పరిధిలోని షార్ట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు సమీపంలోని సైనిక లక్ష్యాలు ఛేదించగలవు. జుల్ఫఘర్, ఖియామ్-1, షాహబ్-1/2 వంటి ఫతే వేరియంట్లు వీటి ప్రధాన వ్యవస్థలు. వీటి పరిధి తక్కువైనా...ఎక్కువ లక్ష్యాలను ఛేదిస్తాయి. 2వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే మీడియం-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్‌ వద్ద ఉన్నాయి.

షాహబ్-3, ఎమాద్, ఖాద్ర్-1, ఖొర్రాంశహర్ వేరియంట్లు, సెజ్జిల్‌తో పాటు, ఖైబర్ షెకన్, హాజ్ ఖాసీమ్ వంటి కొత్త డిజైన్‌లు ఇరాన్‌కు సుదూర ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యాన్ని ఇస్తాయి. సెజ్జిల్...సాలిడ్-ఫ్యూయల్ వ్యవస్థ, ఇది లిక్విడ్-ఫ్యూయల్ క్షిపణుల కంటే వేగంగా ప్రయోగించవచ్చు. క్రూయిజ్ క్షిపణులు కూడా ఇరాన్‌ తయారు చేసుకుంది. భూమికి దగ్గరగా, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. వీటిని గుర్తించడం, ట్రాక్ చేయడం కష్టం. ముఖ్యంగా డ్రోన్‌లు, బాలిస్టిక్ దాడులతో కలిపి ప్రయోగించినప్పుడు వైమానిక రక్షణ వ్యవస్థలను తప్పించుకుంటాయి. సౌమర్, యా-అలీ, ఖుద్స్ వేరియంట్లు, హోవైజే, పావె, యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి.

Published : 
  • 5 March 2026, 7:30 PM IST