ఇరాన్ గడ్డ మీద ఇప్పుడు ఏం జరుగుతోంది..? తండ్రి మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ అసలు ఎక్కడ ఉన్నాడు..? ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ప్రపంచం ముందు ఒక్కసారి కూడా ఎందుకు కనిపించలేదు..? తాజాగా మంగళవారం బయటకు వచ్చిన ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ మెమో ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొజ్తాబాను ఇరాన్ ప్రభుత్వం కావాలనే దాస్తోందా..? లేక అతను ఇక లేడా..? అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు చెబుతున్న ఆ పచ్చి నిజాలు ఏంటి..? గత మంగళవారం బ్రిటన్‌కు చెందిన ది టైమ్స్ పత్రిక ఒక బాంబు లాంటి వార్తను పేల్చింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం 'అపస్మారక స్థితి' లో ఉన్నారని, అతను దేశాన్ని పరిపాలించే స్థితిలో లేరని ఆ రిపోర్ట్ తేల్చి చెప్పింది. అంటే ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఒక 'లివింగ్ డెడ్' స్థితిలో ఉన్నాడనేది ఈ వార్తల సారాంశం. ఇప్పటి వరకు టెహ్రాన్‌లో ఉన్నాడని అందరూ భావిస్తే.. తాజాగా అతను కోమ్ అనే పవిత్ర నగరంలోని ఒక రహస్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తొలిసారిగా బయటపడింది.
విశేషమేంటంటే.. అతని తండ్రి అలీ ఖమేనీని కూడా అక్కడే ఖననం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, బహుశా మొజ్తాబా కోసం కూడా అక్కడే సమాధి సిద్ధం చేస్తున్నారా? అనే అనుమానాలు నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ నివాసంపై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అదే దాడిలో మొజ్తాబా ఖమేనీకి కూడా తీవ్ర గాయాలయ్యాయని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అతని ఎడమ కాలు విరిగిందని, భుజం, నడుము భాగాల్లో లోతైన గాయాలయ్యాయని సమాచారం.అతని భార్య జహ్రా, ఒక కుమారుడు కూడా ఆ దాడిలో మరణించారని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఏ ఒక్క బహిరంగ సభలోనూ కనిపించలేదు, కేవలం రాతపూర్వక సందేశాలు మాత్రమే విడుదల చేస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని లేదా శత్రు దేశాలకు అవకాశం ఇవ్వకూడదని ఇరాన్ ప్రభుత్వం మొజ్తాబా పరిస్థితిని దాస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మొజ్తాబా యుద్ధ గదిలో ఉన్నట్లు విడుదలైన ఒక వీడియో కూడా 'AI జనరేటెడ్' అని నిపుణులు అనుమానిస్తున్నారు.
అసలు మొజ్తాబా స్పృహలో లేకపోతే ఇరాన్‌ను ఎవరు నడిపిస్తున్నారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం ఇరాన్ ఆర్మీ తెర వెనుక నుంచి దేశాన్ని నడిపిస్తోందని సమాచారం. మొజ్తాబా హెల్త్ గురించి ఇలాంటి వార్తలు వస్తుండగానే, బుధవారం ఒక కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "మొత్తం నాగరికతే అంతమైపోతుంది" అని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే.. ఇరాన్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించింది. మొజ్తాబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ఆ ప్రకటన సారాంశం.అయితే, 'ఇది యుద్ధం ముగింపు కాదు.. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి' అంటూ అతను హెచ్చరించడం విశేషం.
ఒక పక్క 'అపస్మారక స్థితిలో ఉన్నాడు' అనే వార్తలు, మరోపక్క 'హెచ్చరికలు జారీ చేస్తున్నాడు' అనే ప్రకటనలు.. ఇరాన్లో ఏదో భారీ డ్రామా నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇది మొజ్తాబా తీసుకున్న నిర్ణయమా..? లేక అతను స్పృహలో లేకపోవడంతో ఆర్మీ తీసుకున్న నిర్ణయమా..? అనేది పెద్ద మిస్టరీ. సుప్రీం లీడర్ స్పృహలో లేకపోవడంతో, ఇరాన్ అధ్యక్షుడిని కూడా అతన్ని కలవనివ్వడం లేదు. అయితే అతనిపై ఇజ్రాయిల్ నిఘా విభాగం ఫోకస్ చేయడంతో.. ఆయనను ప్రపంచానికి ఇరాన్ ఆర్మీ కనపడనివ్వడం లేదని టాక్.ప్రస్తుతం ఇరాన్ విప్లవ సైన్యం మొత్తం అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. మొజ్తాబా పేరుతో స్టేట్మెంట్లను యాంకర్లు చదువుతున్నారు తప్ప, అతను నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇది ఇరాన్లో అంతర్గతంగా 'అధికార యుద్ధం' నడుస్తోందని సూచిస్తోందనే మాట కూడా వినపడుతోంది. మొజ్తాబా ఖమేనీ చుట్టూ ఇప్పుడు అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. అతను కోలుకుని మళ్ళీ బయటకు వస్తాడా..? లేక ఇరాన్ ఒక కొత్త నాయకత్వం కోసం చూస్తోందా..? అనేది కాలమే సమాధానం చెప్పాలి.