దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బంగారం కొనొద్దన్నారు .విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ పొదుపు చేయాలని సూచించారు. తన కాన్వాయ్ కూడా రెండు వాహనాలకు పరిమితం చేసేసారు. ప్రధానమంత్రి స్టేట్మెంట్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? పైగా ప్రచారం వచ్చే ఏ అంశాన్ని ఆయన వదులుకోరు. చంద్రబాబు నాయుడు కూడా తన కాన్వాయని నాలుగు వాహనాల కు కుదించేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో పాటు మంత్రులు కూడా తమ కాన్వాయులను కుదించుకున్నారు. ఆ విషయం తెలియడానికి విజువల్స్ తీసి ప్రజల్లోకి వదిలారు. ఇలాంటి సమయంలోనే తమ నటన కౌసల్యాన్ని చూపించాలి కనుక ఇంకొందరు ఏకంగా సైకిల్ తొక్కుకుంటూ పార్టీ కార్యాలయానికి, సెక్రటేరియట్ కు వస్తున్నారు. ఇదంతా చూస్తే పెద్ద డ్రామాలా కనిపించడం లేదా.....?
భారతదేశంలో సామాన్యులు ఎవరికి పొదుపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనమంతా పొదుపులో పుట్టి... పొదుపులోనే బతుకుతుంటాం. బాగున్న రోజుల్లోనూ.... రూపాయి చేతిలో లేని రోజుల్లోనూ మనమంతా పొదుపు చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళం పొదుపు మాస్టర్లం. అసలు మనకు తెలిసిన అన్ని పొదుపు టెక్నికులు, మన అమ్మలు.... అమ్మమ్మలు పాటించిన పొదుపు చిట్కాలు ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. ఈరోజుకి వెయ్యి రూపాయలు ఆదాయంతో బతికే వాళ్ళు మన మధ్య ఉన్నారు. ఐదు లక్షల రూపాయల ఆదాయం వచ్చిన పొదుపుగా చేసుకుని బతికేవాళ్ళు ఉన్నారు. పొదుపు లేనిది.... పొదుపు చేయనిది ఈ దేశంలో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే. ముఖ్యంగా అధికారంలో ఉండే లీడర్లు మాత్రమే. అధికారం అనేది అనుభవించడానికి... జనం సొమ్ముతో ఎంజాయ్ చేయడానికి అనే స్థిరమైన అభిప్రాయం లీడర్ల అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ వీళ్ళందరి హంగామా చూస్తుంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు చేస్తున్న పొదుపు, పెద్ద డ్రామాలా కనిపిస్తుంది. వీళ్లే కాదు ప్రధాని కార్యాలయం , అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి చేసే హడావుడి, పొదుపుకి దేశభక్తికి లింకు పెట్టి చేస్తున్న డ్రామా చూస్తే కూడు లేని వాడిని ఉపవాసం చేయమన్నట్లు ఉంది.
ప్రధాని మోడీ రెండు వాహనాల్లో తిరుగుతుంటే... చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఏకంగా ప్రైవేట్ ఫ్లైట్లో పుట్టపర్తి వెళ్లి వచ్చారు. సీఎం చంద్రబాబు అనంతపురం సభకి వందల బస్సుల్లో జనాన్ని తరలించారు. దీనిపై విమర్శలు వచ్చేసరికి మహానాడు ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కొంతలో కొంత బెటర్. నిజంగా లీడర్లకు చిత్తశుద్ధి ఉంటే ఈ క్షణం నుంచే అన్ని స్థాయిల్లో ఖర్చులు తగ్గించుకోవాలి. నిన్నటి వరకు పదుల సంఖ్యలో వాహనాలతో కాన్వాయిలు నడిపిన ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు నాలుగు వాహనాల్లోనే తిరుగుతున్నారు కదా. కంఫర్ట్ గానే ఉన్నారు కదా. ఇకనుంచి భవిష్యత్తులో కూడా రెండు వాహనాల్లోనే సీఎం డిప్యూటీ సీఎం తిరగాలి. మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్క వాహనంలో తిరిగితే సరిపోతుంది. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు నక్సల్స్ ముప్పు కూడా లేదు. అందువలన నేతలకు అదనపు భద్రత కూడా అవసరం లేదు. జనం సొమ్ముతో... వాళ్ల జల చెమటతో, కష్టంతో సంపాదించిన డబ్బు తో ఎంజాయ్ చేయడానికి లీడర్లు సిగ్గుపడాలి.
ప్రధానంగా ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు ప్రైవేట్ ఫ్లైట్ కల్చర్ ని వదిలిపెట్టాలి. గడచిన రెండేళ్లలో ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హైదరాబాద్ కి రికార్డు స్థాయిలో తిరిగిన ప్రైవేట్ ఫ్లైట్ సర్వీసుల వివరాలు తీస్తే, దానికి ఎంత ఖర్చు అయిందో బయట పెడితే దూబరా ఎక్కడుందో తెలుస్తుంది. ఇక ఏపీ సీఎం, ఆయన కుమారుడు లోకేష్ విజయవాడ టు ఢిల్లీ, విజయవాడ టు హైదరాబాద్ ప్రైవేట్ ఫ్లైట్లో చక్కర్లు కొడుతున్న వివరాలు మొత్తం తీస్తే పొదుపు లీడర్లు చేయాలా? ప్రజలు చేయాలో తెలుస్తుంది. ఇదే నాయకులు రేపు అధికారం కోల్పోతే... మళ్లీ సామాన్య జనం లాగే డొమెస్టిక్ ఫ్లైట్స్ లో తిరుగుతారు. ఎందుకంటే అప్పుడు సొంత జోబు నుంచి డబ్బు తీసి పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం స్పెషల్ ఫ్లైట్ లోనే తిరిగేవాడు. లక్షల కోట్లు సంపాదించిన జగన్ అధికారం పోగానే జనంతో కలిసి పబ్లిక్ ఫ్లైట్ లో తిరగడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ము ఎంజాయ్ చేస్తారు. అధికారం పోయాక సొంత డబ్బు కదా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రైవేట్ ఫ్లైట్ లోనే తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ,కేటీఆర్, కవిత ప్రైవేట్ ఫ్లైట్ లోనే తిరిగేవారు. ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్ కొచ్చారు.
లీడర్లు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతుంటే, ఈనెల తర్వాత కూడా ఏజెన్సీ ఏరియాలో గర్భిణీ స్త్రీలను డోలీలో మోసుకెళ్తున్నారు. అది మన దుస్థితి.
అందువల్ల పొదుపు చేయాల్సింది ప్రజలు కాదు. నాయకులు ప్రజలకు పొదుపు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జనం సొమ్ము ఎంజాయ్ చేస్తున్న అధికారంలో ఉన్న నేతలు పొదుపు చేయాలి. ముఖ్యమంత్రులు మంత్రులు తక్షణం విదేశీ పర్యటనని రద్దు చేసుకోవాలి. సీఎంలు, డిప్యూటీ సీఎంలు ప్రైవేట్ ఫ్లైట్స్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలి. ఇప్పుడు సైకిల్ తొక్కుతున్న మంత్రులు... జీవితాంతం సైకిల్ తొక్కుతూనే ఉంటే వాళ్లని ఆదర్శంగా తీసుకుని ప్రజలంతా పొదుపు చేస్తారు. అంతేగాని ఈ నాలుగు రోజులు కెమెరా కోసం సైకిల్ డ్రామా చేసినంత మాత్రాన వీళ్ళ దొంగ పొదుపుని ఎవరు నమ్మరు.అలాగే స్టేట్ పోలీస్ ఫోర్స్ లో సగం మంది పోలీసులు ప్రజా ప్రతినిధుల , బ్యూరోక్రాట్స్ భద్రతకు వెళ్ళిపోతున్నారు. అసలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం కోసం ఇన్ని వందల వేల మంది పోలీసులు అవసరమా? వాళ్లు జనం కోసం కదా ఉన్నది. గన్ మాన్ కల్చర్ ని కచ్చితంగా తీసేయాలి. అవసరమైతే వాళ్ల సొంత డబ్బుతో గన్ మెన్షన్ పెట్టుకోమని చెప్పాలి. పోలీస్ ఫోర్స్ ని కేవలం ప్రజల కోసం మాత్రమే వినియోగించాలి.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ల వేతనాల్ని తక్షణం వదిలేయాలి. అలాగే మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పెన్షన్లు నిలిపివేయాలి. అసలు ప్రజాప్రతినిధులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చేస్తున్నది ఉద్యోగం కాదు. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ చేయడానికి. వాళ్లకి ఎందుకు పెన్షన్ ఇవ్వాలి. గన్ మాన్లు ఎందుకు ఇవ్వాలి.? పదేశి వాహనాలతో పెద్ద పెద్ద కాన్వాయిల్ ఎందుకు ఇవ్వాలి? ఎక్కడికెళ్లినా స్పెషల్ ఫ్లైట్ లు ఎందుకు ఇవ్వాలి? ప్రతి నెల వృద్ధాప్య పింఛన్ ఇవ్వడానికి ఒకటో తేదీన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతానికి భారీగా తరలి వెళ్తారు. ప్రతి నెల ఈ తంతు అవసరమా? 4 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఆ ఒక్క రోజు అయ్యే ఖర్చు కోటి రూపాయలు. ఎవడి అమ్మ మొగుడు సొమ్మది? ప్రజల సొమ్మే కదా. ముఖ్యమంత్రి మాత్రమే కాదు మంత్రులు ,ఎమ్మెల్యేలు నెలనెలా ఒకటో తేదీన వృద్ధాప్యపు పెన్షన్లను ఒక పెద్ద పండగల చేస్తున్నారు.
ఆ ఒక్క రోజు ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది అవసరమా? ఆ ప్రచార తంతు నిలిపిస్తే ఎంత డబ్బు ఆదా చేయొచ్చు. దావోస్ పర్యటనలు... అమెరికా పర్యటనలు... సింగపూర్ పర్యటనలు ఇవన్నీ అవసరమా? అసలు ఏపీ హోం మంత్రి అనిత సింగపూర్ వెళ్లి ఏం చేసిందో ఒక ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. ముఖ్యమంత్రి సెక్యూరిటీ కి వందల మంది పోలీసులు పనిచేస్తున్నారు. అంతమంది అవసరమా? చంద్రబాబు వారంలో కనీసం ఆయన మూడు పబ్లిక్ మీటింగ్ లు పెడతారు. ఇది అవసరమా? ముఖ్యమంత్రి మీటింగ్ అంటే ఎక్కడ పెట్టినా కనీసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో ఎన్ని ఆస్పత్రులు కట్టొచ్చు,? ఎన్ని స్కూల్స్ పెట్టొచ్చు? ఈ దేశంలో సామాన్య పౌరులంతా ఒక్క వాహనమే వాడుతారు. కానీ లీడర్లు మాత్రమే వందల వాహనాల్లో ప్రయాణం చేస్తారు. అందుకే పొదుపు చేయాల్సింది సామాన్య ప్రజలు కాదు. వాళ్లు ఇప్పటికే పొదుపు జీవితమే గడుపుతున్నారు. పొదుపు చేయాల్సింది అధికారంలో ఉన్నవాళ్లు. జనం సొమ్ముతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.ప్రధానమంత్రి చెప్పారు కదా అని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ సహా మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు పొదుపు డ్రామాలు బాగా చేస్తున్నారు. ఈ పొదుపు చర్యలు ఒక వారం ఒక నెలో కాదు. జీవితాంతం ఇదే పొదుపు చేస్తే అప్పుడు లీడర్ల దేశభక్తి, బాధ్యత జనానికి అర్థమవుతుంది. ఇదేదో నాలుగు రోజులు డ్రామాలాగా నడిపిస్తే పొదుపు ఎప్పటికీ సాధ్యం కాదు.