ప్రతీకార దాడులతో, ప్రతీకార రాజకీయాలలో ఏపీ తగలబడుతుందా? పార్టీ, కులం, మతం, వర్గం.... పేరుతో జనం గ్రూపులుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారా? రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, ఆదాయం లేదు, ఊళ్ళల్లో పనులు లేవు, రియల్ ఎస్టేట్ కుదేలు, వైద్యం దొరకదు, సర్కార్ కి అప్పులు పుట్టవు..... అభివృద్ధి కానరాదు. అయినప్పటికీ తెల్లారి లేచిన దగ్గర్నుంచి పార్టీలు, లీడర్లు, కార్యకర్తలు , మీడియా, సామాన్య జనం.... పనికిమాలిన కారణాలతో... కొట్టుకు చస్తున్నారు. బీహార్ లాండ్ రాష్ట్రాలు కూడా ఏపీ కన్నా బెటర్ ఏమో అని అనిపిస్తోంది.
కొన్నేళ్లుగా ఏపీలో కొత్త సంస్కృతి మొదలైంది. రాజకీయ ప్రత్యర్ధుల ఇళ్లపై దాడులు,ఆస్తులు విధ్వంసం చేయడం, భయానక వాతావరణాన్ని సృష్టించడం తరచూ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇందుకు బాధ్యులే. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై వందలమంది మూకుమ్మడిగా దాడి చేయడం, తగలబెట్టడం.... ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్లీ వచ్చి దాడి చేస్తాం అని ఒక మహిళ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా వార్నింగ్ ఇస్తుంటే.... ఈ రాష్ట్రం ఎటు పోతుంది అనుకోవాలి? ఇవన్నీ చూస్తే ఎలాంటి ఆంధ్రప్రదేశ్.. ఎలా మారిపోయింది అనిపిస్తుంది. బీహార్ సంస్కృతి గురించి చెప్పుకోవడం వినడమే తప్ప .... అంతకుమించి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం.
ఈ పరిస్ధితికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కారణమే. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూశాం. టిడిపి కార్యకర్త చంద్రయ్యను నడి బజార్లో కోడి మెడ కోసినట్లుగా కోసి అత్యంత పాశవికంగా చంపేశారు. జగన్ ఐదేళ్ల పాలన కాలంలో ప్రతి ఊరు ప్రతీకార దాడులతో.... అల్లాడిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు హయాంలోనూ అదే ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది. జగన్ సర్కార్ విచ్చలవిడితనం, పొరపాట్లు, అరాచకాల వల్లే జనం వాళ్లని 11 సీట్లకు పరిమితం చేశారు. అందుకే వైసిపి విషయంలో ప్రజలు కోలుకోలేని తీర్పు ఇచ్చారు. తగిన గుణపాఠం నేర్పారు. కూటమి సర్కార్కు అందుకే అధికారం కట్టబెట్టారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని, అరాచకాలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కానీ జగన్ చేసిన తప్పులే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూడా రెట్టింపు చేస్తోంది. అదే అరాచకం సృష్టిస్తోంది. అదే ప్రతీకార రాజకీయాలకు తెగబడుతోంది. ప్రజలు ఏం కోరుకుని కూటమికి అధికారం కట్టబెట్టారో దానికి విరుద్ధంగా ప్రభుత్వం వెళ్తోంది. రాజకీయం చేయడం అంటే ప్రతీకారం తీర్చుకోవడమే.. అనే సిద్ధాంతాన్ని జనంలోకి.... కార్యకర్తల్లోకి....నాయకుల్లోకి ....బలంగా ఎక్కిస్తున్నాయి పార్టీలు. ఏ విషసంస్కృతికి వ్యతిరేకంగా జనం ఓటు వేశారో.. ఏపీలో అదే విషసంస్కృతిని తిరిగి పెంచిపోషిస్తున్నారు టిడిపి నేతలు. అధికారం వస్తే అందరూ ఒకటే ... ఇలాగే ఉంటారు .. అని స్పష్టంగా చెబుతున్నట్టు ఉంది.
వైసీపీకి, టిడిపికి తేడా ఏముంది? వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి టిడిపి కూటమికి 164 సీట్లు జనం ఎందుకిచ్చారు? వైసిపి హయాంలో అరాచకాలు భరించ లేకే. కానీ ఇప్పుడు టిడిపి..... జనసేన పార్టీలు చేస్తున్నదేంటి? అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ చెప్పుకోలేని మాటల్లో తిడితే... ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. చట్టం ఎలా చెప్తే అలా చేయండి. కానీ ఇలా వందల మంది ఒక మాజీ మంత్రి ఇంటిపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేసి, భయానక వాతావరణ సృష్టించి..... ఇంట్లో మహిళలని కూడా హెచ్చరిస్తే... ఏపీ జనం కోరుకున్నది ఇదేనా?
ఈ ఐదేళ్లపాటు కూటమి సర్కార్ ప్రతీకార దాడులు, ప్రతీకార రాజకీయాలు చేస్తూ వాళ్ల కార్యకర్తలను సంతృప్తి పరుచుకుంటే సరిపోతుందా? ప్రతీకార రాజకీయాల కోసమే ప్రజలు టిడిపిని ,జనసేనని, బిజెపిని ఎన్నుకున్నారా? మాఫియా ముఠాలకి ఏపీలో పొలిటికల్ పార్టీలకు తేడా ఏముంది? మూడు కులాలు.... మూడు రాజకీయ పార్టీలు ఇలా తెగబడి రోడ్లెక్కి కొట్టుకుంటూ పాత వాతావరణ సృష్టిస్తుంటే ఇందుకా ఎన్నుకుంటున్నాం అని జనం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.జగన్ సర్కార్ కి చంద్రబాబు సర్కార్ కి తేడా ఏం కనిపించడం లేదు. ఏపీలో రెడ్లు, కమ్మ వైరం తప్ప
ఒక రెండు పొలిటికల్ గ్యాంగుల యుద్ధం తప్ప జనానికి ఇంకేం మార్పు కనిపించడం లేదు. అప్పుడు వైసిపి వాళ్లు టిడిపి వాళ్ళు ఎలా పై దాడులు చేశారు. ఇప్పుడు టిడిపి వాళ్లు వైసిపి వాళ్ళు ఇళ్ల పై దాడులు చేస్తున్నారు. ఇదొక్కటే ఏపీలో వచ్చిన మార్పు. జన జీవితంలో కానీ... అభివృద్ధిలో కానీ.... సామాజిక అవకాశాల్లో గాని ఏపీలో ఎంత కూడా మార్పు రాలేదు.
ఏపీకి పది లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తామని చంద్రబాబు ఘనంగా చెబుతున్నారు. అసలు ఇలాంటి అన్ రెస్ట్.... వాతావరణం లో పెట్టుబడులు వస్తాయా? నిత్యం రావణ రాష్ట్రంలో రగిలిపోతున్న రాష్ట్రంలో ఏ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయి? పెట్టుబడులు పెట్టడానికి అనువైన సామాజిక వాతావరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉందా?రాష్ట్రవిభజన జరిగి 12 ఏళ్లు అయింది. రాజధాని లేదు. ఉద్యోగాల్లేవు. పరిశ్రమల్లేవు. విద్యాసంస్ధలు లేవు. ఎవరి అజెండా వారిదే. అవన్నీ గాలికొదిలేసి ఒకరిపై ఒకరు తెగబడి నరుక్కోవడం, కొట్టుకోవడం, ఇళ్లు తగలబెట్టుకోవడం.. ఇదేం సంస్కృతి? ఏపీ ఎటుపోతోంది? . ఇవే ప్రతీకార రాజకీయాలు , పరస్పర దాడులు కొనసాగితే.. మరో మూడేళ్ల తర్వాత అధికార మార్పిడి జరిగితే.. పరిస్ధితి ఏమిటి ? అప్పుడు నైతికంగా వీళ్లని ఖండించే హక్కు ఉంటుందా ? అప్పుడు మీరు చేశారు కాబట్టి.. ఇప్పుడు మేం చేశాం.. అనే వాదన కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఎక్కడోచోట ఫుల్స్టాప్ పెట్టాలి.
పార్టీ శ్రేణులు పిచ్చెత్తిపోయినట్టు మూకలు మూకలుగా తెగబడి దాడులు చేస్తుంటే చూడ్డానికి 70mm సినిమాలా బానే ఉంటుంది. కానీ దాని పర్యవసానాలు ఎంద దారుణంగా ఉంటాయో ఆ కార్యకర్తల కుటుంబాలకే తెలుసు. నాయకులు ఎప్పుడూ ఏసీ గదుల్లో క్షేమంగానే ఉంటారు. కానీ కార్యకర్తలు, చిన్న నాయకులు జైళ్లలో మగ్గిపోతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఫైనల్గా సాధించేది ఏమీ ఉండదు. ఓ కుటుంబానికో , ఓ వ్యక్తికో రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం తప్ప. ఏపీ ఇప్పటికే విభజనవల్ల అన్యాయమైపోయింది. ఇప్పుడు ఈ రాజకీయ కక్షలు, ప్రతీకార దాడుల వల్ల ఇంకా వెనక్కివెళ్తోంది. పెట్టుబడులు ఆకర్షించాలనుకునేవాళ్లు.. అభివృద్ధి కోరుకునేవాళ్లు.. ఇదే సంస్కృతి కొనసాగిస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి, ?అభివృద్ధి ఎలా జరుగుతుంది. ఇదే విషయాన్ని పార్టీలు, ప్రజలు ఆలోచించాలి.
2029 తర్వాత పిక్చర్ జనానికి క్లియర్ గా కనిపిస్తోంది. అధికారం ఒకరి నుంచి మరొకరికి మారితే.... ఏం జరుగుతుందో జనానికి ఇప్పటికే అర్థమైంది. టిడిపి వైసిపి రెండు వాళ్ల వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసం జనాన్ని కులాలు, మతాలు వర్గాలుగా విడగొట్టి నిత్యంవిద్వేషాలు రెచ్చగొట్టడమే ఏపీలో మూడు పార్టీలు పనిగా పెట్టుకున్నాయిఅసలు లడ్డు గోల తప్ప రాష్ట్రంలో మరే ముఖ్య విషయం లేదా? కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఏమి ఇచ్చారు? పోలవరం పరిస్థితి ఏంటి? పెరిగిపోతున్న అప్పుల్ని ఎలాగా నియంత్రించాలి? అభివృద్ధి పథకాల మాట ఏమిటి? ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఉంది? ఇవేమీ ఎవరూ మాట్లాడటం లేదు. చివరికి పవన్ కళ్యాణ్ లాంటివాడు ముఖ్యమైన విషయాలన్నీ పక్కనపడేసి,మతం సనాతన ధర్మం అనుకుంటూ.... జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. ఏపీ ఎటు పోతుంది? ఏపీ ఏమైపోతుంది?