Top story:బెంగాల్‌లో యోగి మార్క్… బుల్డోజర్ యాక్షన్ టీఎంసీ ఆఫీసు ధ్వంసం.. ఆట మొదలైంది!

అర్థరాత్రి కోల్‌కతాలో కలకలం రేపిన సీనే ఇది. టీఎంసీ న్యూమార్కెట్‌ యూనియన్‌ ఆఫీసు వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు.. బుల్డోజర్‌తో దాన్ని కూల్చివేశారు. ఈ ఘటనలో టీఎంసీ ఆఫీసు పూర్తిగా ధ్వంసమైపోయింది.

Post Published By: dialnews
Updated : 7 May 2026, 11:10 AM IST

అర్థరాత్రి కోల్‌కతాలో కలకలం రేపిన సీనే ఇది. టీఎంసీ న్యూమార్కెట్‌ యూనియన్‌ ఆఫీసు వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు.. బుల్డోజర్‌తో దాన్ని కూల్చివేశారు. ఈ ఘటనలో టీఎంసీ ఆఫీసు పూర్తిగా ధ్వంసమైపోయింది. పైగా బుల్డోజర్లు తీసుకొచ్చిన వారి చేతుల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ జెండాలు కన్పించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాతే సీన్‌లోకి టీఎంసీ ఎంట్రీ ఇచ్చింది. తమ కార్యాలయం కూల్చివేత దృశ్యాలను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 'బీజేపీ పరివర్తన్ మొదలైంది. ఈ మార్పు బుల్డోజర్‌తో వచ్చింది. బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వెళ్లి దాడులకు పాల్పడేందుకు ఆ పార్టీ వారికి లైసెన్స్ ఇచ్చినట్లు ఉంది. ఈ రోజు షాపులు, ఆఫీసులని కూలుస్తున్నారు. రేపు రాజకీయ ప్రత్యర్థులనూ వదిలిపెట్టరేమో..!' అని ట్వీట్‌లో మండిపడింది. పోలీసులు, కేంద్ర బలగాల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.

మరోవైపు.. ఈ ఆరోపణలను కాషాయ దళం తోసిపుచ్చింది. ఇది తమ పార్టీ కార్యకర్తలు చేసిన పని కాదని, టీఎంసీలోని అంతర్గత కుమ్ములాటలు, స్థానికుల ఆగ్రహం వల్ల జరిగి ఉండవచ్చని పేర్కొంది. అయితే, కూల్చివేత జరిగిన హాగ్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న టీఎంసీ కార్యాలయం అక్రమ కట్టడం అని స్థానికులు వాదిస్తున్నారు. గతంలో ఒక దుకాణదారుడికి చెందిన స్థలాన్ని టీఎంసీ నేతలు బలవంతంగా ఆక్రమించి అక్కడ కార్యాలయాన్ని నిర్మించారని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ ఆక్రమణను తొలగించారని చెబుతున్నారు. బెంగాల్‌లో అధికారం మారిన వెంటనే ఈ ఘటన జరగడం వల్ల, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీఎంసీ అంటుంటే, అక్రమ కట్టడాల తొలగింపు లేదా స్థానిక నిరసన అని మరో వర్గం అంటోంది. నిజానికి.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దగ్గర నుంచే బుల్డోజర్ పేరు రీసౌండ్ ఇచ్చింది. అందుకు కారణం యోగి మార్క్ మాస్ వార్నింగే.

. ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్‌లో విస్తృతంగా పర్యటించారు. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం మాఫియా రాజ్, జంగిల్ రాజ్‌ను ప్రోత్సహిస్తోందని, బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ మోడల్ అమలు చేస్తామని యోగి హామీ ఇచ్చారు. 'బుల్డోజర్ కేవలం రోడ్లు వేయడానికే కాదు, గూండాల వెన్నుపూస విరగ్గొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది' అని యోగి చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. వాస్తవానికి.. బీజేపీ రికార్డు విక్టరీకి యోగి మార్క్ బుల్డోజర్ బ్రాండ్ పాలిటిక్స్‌ కూడా కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్యలతో విసిగిపోయిన ఓటర్లు, కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, అక్రమ వసూళ్లతో ఇబ్బంది పడే సామాన్యులు బీజేపీ వైపు మొగ్గు చూపేలా బుల్డోజర్ ప్రచారం దోహదపడింది. బీజేపీ విజయం సాధించిన వెంటనే, కోల్‌కతా, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో ఆ పార్టీ మద్దతుదారులు బుల్డోజర్లతో విజయ యాత్రలు నిర్వహించారు. వారిలో దిలీప్ ఘోష్ కూడా ఉన్నారు.

ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో విజయం సాధించిన తర్వాత, దిలీప్ ఘోష్ తన మద్దతుదారులతో కలిసి ఇలా బుల్డోజర్ ఎక్కి ఊరేగింపు నిర్వహించారు. బుల్డోజర్ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్దదుమారాన్నే రేపింది. దిలీప్ ఘోష్ బుల్డోజర్ సెలబ్రేషన్‌కు కారణం మమతా బెనర్జీనే. ప్రచార సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ "బెంగాల్‌లో బుల్డోజర్లు నడవనివ్వను" అని సవాలు విసిరారు. దానికి సమాధానంగా, ఫలితాలు వచ్చిన వెంటనే బుల్డోజర్ ఎక్కి తిరగడం ద్వారా "ఇప్పుడు బెంగాల్‌లో బుల్డోజర్ల కాలం మొదలైందనే సంకేతాన్నిచ్చారు దిలీప్ ఘోష్. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న 'బుల్డోజర్ జస్టిస్' వెస్ట్ బెంగాల్‌లో కూడా వస్తుందని చెప్పకనే చెప్పారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ.. 'బెంగాల్ ప్రజలు అరాచక పాలన నుండి విముక్తి కోరుకున్నారు. బుల్డోజర్ కేవలం కూల్చడానికే కాదు, కొత్త బెంగాల్‌ను నిర్మించడానికి కూడా ఉపయోగపడుతుంది. అక్రమంగా సంపాదించిన వారు, ఆక్రమణలు చేసిన వారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది జరిగిన రెండోరోజే బుల్డోజర్లు తృణమూల్ పార్టీపైకి దండెత్తడం రాజకీయంగా రచ్చ రేపుతోంది.

 

Published : 
  • 7 May 2026, 11:10 AM IST