ఈ రోజుల్లో ఇళ్లల్లో కామన్‌గా కనిపించే దృశ్యం ఏంటంటే.. పిల్లలు చేతిలో ఫోన్ ఉంటేనే అన్నం తింటారు, ఫోన్ ఇస్తేనే అల్లరి చేయకుండా ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రశాంతంగా ఉన్నారని స్మార్ట్‌ఫోన్స్ లేదా టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నారు. కానీ, మనం చేస్తున్న ఈ చిన్న పొరపాటు పిల్లల భవిష్యత్తును ఎంతలా నాశనం చేస్తుందో మీకు తెలుసా? చిన్న వయసులోనే మొబైల్ స్క్రీన్లకు అలవాటు పడటం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి మందగించడమే కాకుండా, చదువులో కూడా తీవ్రంగా వెనుకబడిపోతారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది.
ఫ్రాన్స్‌కు చెందిన 'ఇన్సెర్మ్' మరియు 'నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్' పరిశోధకులు ఉమ్మడిగా ఒక సుదీర్ఘమైన అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు పుట్టినప్పటి నుండి దాదాపు 502 మంది పిల్లల ఎదుగుదలను, వారి అలవాట్లను నిశితంగా గమనించారు. పిల్లలు ఏయే వయసులో ఎంత సమయం స్క్రీన్ల ముందు గడుపుతున్నారో రికార్డ్ చేశారు. ఆ తర్వాత వారు 9 సంవత్సరాల వయసుకు వచ్చాక వారి చదువును, అలాగే 10.5 సంవత్సరాల వయసులో వారి జ్ఞాపకశక్తిని పరీక్షించారు.
ఈ రీసెర్చ్ లో తేలింది ఏంటంటే.. పిల్లలు కేవలం ఎన్ని గంటలు ఫోన్ చూశారనేది మాత్రమే కాదు, వారు ఏ వయసులో ఫోన్ చూడటం స్టార్ట్ చేశారనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా 1 సంవత్సరం వయసున్నప్పుడు మరియు బడికి వెళ్లే 6 సంవత్సరాల వయసులో ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న పిల్లలలో వర్కింగ్ మెమరీ చాలా తక్కువగా ఉందని తేలింది. ఒక చిన్నారి మెదడు మొదటి కొన్ని సంవత్సరాలలో చాలా వేగంగా ఎదుగుతుంది. ఆ సమయంలో వారు చుట్టుపక్కల మనుషులను చూసి, వస్తువులను తాకి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. కానీ దానికి బదులుగా వారు నిరంతరం మొబైల్ స్క్రీన్ల వైపు చూస్తూ ఉండిపోవడం వల్ల మెదడు ఆలోచించే శక్తి దెబ్బతింటుంది.
దీనివల్ల వారు పాఠశాలకు వెళ్ళిన తర్వాత టీచర్లు చెప్పే విషయాలపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. వారి వర్కింగ్ మెమరీ బలహీనపడటం వల్ల చదివిన విషయాలు గుర్తుండవు. ఫలితంగా 9 ఏళ్ల వయసు వచ్చేసరికి వారి అకడమిక్ పర్ఫార్మెన్స్.. అంటే పరీక్షల్లో మార్కులు, గ్రేడ్లు గణనీయంగా పడిపోతున్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఈ ప్రభావం కేవలం జ్ఞాపకశక్తితోనే ఆగదు ఫ్రెండ్స్.గతంలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలగరీ శాస్త్రవేత్తలు దాదాపు 18,000 మందికి పైగా పిల్లలపై జరిపిన 42 అధ్యయనాలను పరిశీలించారు. ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న పిల్లల్లో భాషా నైపుణ్యాలు.. అంటే మాట్లాడటం, పదాలను అర్థం చేసుకోవడం చాలా ఆలస్యంగా జరుగుతుందని వారు కనుగొన్నారు.
అంతేకాదు, 2023లో ఫ్రాన్స్ నిపుణులు చేసిన మరో పరిశోధనలో.. చిన్న వయసులోనే మొబైల్స్ వాడే పిల్లల్లో 'అటెన్షన్ డెఫిసిట్' అంటే ఏదైనా ఒక విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, విపరీతమైన చంచలత్వం వంటి మానసిక సమస్యలు వస్తున్నాయని తేలింది. అయితే ఫోన్ ఇవ్వడం పూర్తిగా ఆపేయాలా అంటే.. ఈ డిజిటల్ యుగంలో అది సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి:
వయస్సు పరిమితి: వీలైనంత వరకు 2 సంవత్సరాల లోపు పిల్లలకు అసలు మొబైల్స్ లేదా టీవీలు చూపించకపోవడమే మంచిది.
ఎడ్యుకేషనల్ కంటెంట్: ఒకవేళ పిల్లలు ఫోన్ చూసినా, అందులో కేవలం రైమ్స్, కథలు లేదా నాలెడ్జ్ పెంచే విద్యాసంబంధిత కంటెంట్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
కలిసి సమయం గడపడం: పిల్లలకు ఫోన్ ఇచ్చి వదిలేయకుండా, తల్లిదండ్రులు కూడా వారితో కలిసి కూర్చుని ఆ కంటెంట్ గురించి వివరిస్తూ మాట్లాడాలి.
ప్రత్యామ్నాయాలు: పిల్లలకు ఇండోర్, అవుట్ డోర్ ఆటలు ఆడించడం, కథల పుస్తకాలు చదివి వినిపించడం అలవాటు చేయాలి.
స్మార్ట్‌ఫోన్ అనేది మన అవసరాల కోసం వచ్చిన ఒక టెక్నాలజీ. కానీ అది మన పిల్లల బంగారు భవిష్యత్తును, వారి మేధోశక్తిని నాశనం చేసే విలన్ కాకూడదు. కాబట్టి ఇప్పటికైనా పిల్లల స్క్రీన్ టైమ్‌ను కంట్రోల్ చేయండి, వారికి ఫోన్ కంటే మీ విలువైన సమయాన్ని ఎక్కువగా ఇవ్వండి.