తగ్గు బంగారం అంటే.. సీరియస్‌గా తీసుకుందో ఏమో ! తగ్గడం అంటూ స్టార్ట్ చేస్తే ఇది స్టార్టింగ్ మాత్రమే.. ఎండింగ్ ఓ రేంజ్లో ఉంటుందన్నట్లు కనిపిస్తోంది బంగారం పరిస్థితి. తగ్గితే తగ్గింది కానీ.. మధ్యతరగతి జనాల మొహాల్లో చాలా రోజులకు కాస్త నవ్వు కనిపిస్తోంది. ఐతే బంగారం ధర ఎక్కడి వరకు తగ్గుతుంది.. ఎప్పటివరకు తగ్గుతుందనే చర్చ జనాల్లో జోరుగా నడుస్తోంది. ఓవరాల్‌గా కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలకు.. ఒక్కసారిగా బ్రేకులు పడుతున్నాయ్. ఇంటర్నేషనల్ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ బలపడటంలాంటి కారణాలతో.. బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు కుప్పకూలాయ్. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోవడం.. ఇన్వెస్టర్లను, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు.. గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయ్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలతోనూ ఎఫెక్ట్ కనిపిస్తోంది.
24 క్యారెట్ల తులం బంగారం లక్షా 47వేలకు చేరుకుంటే.. 22 క్యారెట్ల బంగారం లక్షా 35వేల దగ్గరకు వచ్చేసింది. బంగారంతో పాటు సిల్వర్ కూడా ఢమాల్ అంటోంది. ఐదు లక్షలకు పరుగులు తీస్తున్నట్లు కనిపించిన వెండి.. ఒక్కసారిగా మూడులక్షలకు పడిపోయింది. ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గడంతో.. బంగారం కొనుగోలుకు సామాన్యులు ఆసక్తి చూపుతున్నారు. ఐతే మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉందని.. వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సిల్వర్ సంగతి ఎలా ఉన్నా.. బంగారం ధరలు మరింత తగ్గే చాన్స్ ఉందనే ఒపీనియన్ వినిపిస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి.. 10 నుంచి 15 శాతం ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ధర ఇంకా పెరుగుతుందని నమ్మి.. ఆశపడి.. కలలు కని.. అప్పులు తెచ్చి మరీ కొన్న వాళ్లకు బంగారం చుక్కలు చూపిస్తోంది. దరిద్రం అంటే ఇదేరా అనే రేంజ్లో వెక్కిరిస్తోంది. జీవితాలను తలకిందులుచేస్తోంది. ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రేట్లు పెరుగుతూనే ఉంటాయన్న అంచనాతో.. అప్పు చేసి మరీ ఓ వ్యక్తి బంగారం కొని పెట్టుకున్నాడు. ఐతే ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో.. అతను కుయ్యోమొర్రో అంటున్న పరిస్థితి. ఆదిత్య షా అనే ఫైనాన్షియల్ అడ్వైజర్.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది తెగ చక్కర్లు కొడుతోంది. తనకు తెలిసిన ఓ వ్యక్తి.. క్రెడిట్ కార్డుపై గరిష్ఠ పరిమితి వరకూ లోన్ తీసుకుని.. బంగారం, వెండిపై పది లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడని ఆదిత్య చెప్పుకొచ్చాడు. నెల రోజుల్లో డబ్బుపై 10 నుంచి 12 శాతం రాబడి పక్కా అని బలంగా నమ్మి ఆ వ్యక్తి రిస్క్ తీసుకున్నాడని చెప్పారు. ఐతే జనాలు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో.. బంగారం, వెండి ధరలు రెండు రోజుల వ్యవధిలోనే దారుణంగా పడిపోయాయ్. దీంతో పెట్టుబడి పెట్టిన వ్యక్తి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అత్యాశకు పోతే జరిగేది ఇదే అంటూ ఆదిత్య రాసుకొచ్చాడు. సదరు వ్యక్తికి నష్టాలు, అప్పులు, భారీ క్రెడిట్ కార్డు బిల్లుతో తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పాడు. పెట్టుబడులపై రిస్క్‌ను తగ్గించే ప్రణాళిక.. మార్కెట్ నుంచి సరైన సమయంలో తప్పుకునేందుకు వ్యూహం లేకపోతే.. ఇలాంటి నష్టాలే ఎదురవుతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయ్.