ఐపీఎల్ అంటే కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే కాదు బాబాయ్.. దీని వెనుక ఒక చీకటి ప్రపంచం కూడా ఉంది. ఇప్పుడు మన స్టార్ క్రికెటర్ల మీద 'అందమైన అమ్మాయిల' కన్ను పడింది. అవును.. మీరు విన్నది నిజమే. మన ఆటగాళ్లను బుట్టలో వేసుకుని, రహస్యాలు లాగడానికి పెద్ద పెద్ద ముఠాలే రంగంలోకి దిగాయి. దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా పంపిన 8 పేజీల సీక్రెట్ లేఖ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ లెటర్‌లో ఏముంది..? ఈ 'హనీ ట్రాప్' అంటే ఏంటి..? మన ప్లేయర్లు ఎలా సేఫ్‌గా ఉండాలి..? హనీ ట్రాప్ అంటే.. అందమైన అమ్మాయిలను ఎరగా చూపి, సెలబ్రిటీలను లేదా ప్లేయర్లను ట్రాప్ చేయడం. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత హోటల్ రూమ్‌ల వరకు వెళ్లి.. రహస్యంగా వీడియోలు తీయడం లేదా వాళ్లను బ్లాక్‌మెయిల్ చేయడం వంటివి చేస్తారు. ఐపీఎల్ లాంటి హై-ప్రొఫైల్ ఈవెంట్లలో ఇలాంటి ప్రమాదాలు చాలా ఎక్కువ. అందుకే బీసీసీఐ ఈసారి ముందే మేల్కొంది. బీసీసీఐ తన 8 పేజీల గైడ్‌లైన్స్‌లో చాలా కఠినమైన రూల్స్ పెట్టింది.
ఇప్పుడు వల వేయడానికి నేరుగా రావాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందమైన ఫోటోలతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, ప్లేయర్లకు డైరెక్ట్ మెసేజ్ (DM)లు పంపిస్తున్నారు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి హనీ ట్రాప్ వల్ల కెరీర్లు నాశనమైన సందర్భాలు ఉన్నాయి. బుకీలు అందమైన అమ్మాయిలను ఎరగా పంపి, ప్లేయర్ల నుంచి పిచ్ రిపోర్ట్ లేదా టీమ్ వివరాలు లాగుతుంటారు. అందుకే ఈసారి బీసీసీఐ 'జీరో టాలరెన్స్' పాలసీని అనుసరిస్తోంది.టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా ఏ బయటి వ్యక్తి ఆటగాడి గదిలోకి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఏ సమయంలోనైనా బీసీసీఐ టాస్క్ ఫోర్స్ హోటల్ రూమ్‌లను తనిఖీ చేస్తుంది. ప్లేయర్లు హోటల్ దాటి బయటకు వెళ్తే సెక్యూరిటీ ఆఫీసర్‌కు ముందే చెప్పాలి. సెలవు రోజుల్లో కూడా ఇది వర్తిస్తుంది. కేవలం బయటి వారే కాదు, టీమ్ బస చేసే హోటల్ సిబ్బందితో కూడా ప్లేయర్లు పరిమితికి మించి మాట్లాడకూడదని నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 'టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్'కు రిపోర్ట్ చేయాలి.
ఒకవేళ ఏ ప్లేయర్ అయినా ఈ గైడ్‌లైన్స్ ఉల్లంఘిస్తే.. అది కేవలం క్రమశిక్షణారాహిత్యం మాత్రమే కాదు, 'క్రిమినల్ అఫెన్స్' (నేరం) కింద కూడా పరిగణించే అవకాశం ఉంది. షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో జరిమానా, లేదా లీగ్ నుంచి డిస్క్వాలిఫై చేసే అధికారం బీసీసీఐకి ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా.. ప్లేయర్స్ గదుల్లోకి వారి కుటుంబ సభ్యులు వెళ్లాలన్నా మేనేజర్ అనుమతి తప్పనిసరి అని ఈ కొత్త రూల్స్ చెబుతున్నాయి. ఎవరో ఒకరు చొరబడి ఏదైనా అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండటానికే ఈ కట్టుదిట్టమైన ఏర్పాటు.ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా ఒక హోటల్‌లో అభిషేక్ శర్మ వెళ్తుండగా, ఒక యువతి ఒక్కసారిగా అతని వద్దకు వచ్చి బలవంతంగా చేయి పట్టుకుని లాగింది. ఈ ఊహించని పరిణామంతో అభిషేక్ శర్మ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తీవ్ర అసౌకర్యానికి లోనయ్యాడని జాతీయ మీడియా పేర్కొంది. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని పక్కకు లాగేసి, ప్లేయర్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. అయితే ఇప్పటివరకు హైదరాబాద్ జట్టులో ఏ ఆటగాడు 'హనీ ట్రాప్'కు గురైనట్లు అధికారిక సమాచారం లేదు.
కేవలం హనీ ట్రాప్ మాత్రమే కాదు.. ప్లేయర్లు చేసే 'వేపింగ్'మీద కూడా బీసీసీఐ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేసిన విషయం, రీసెంట్‌గా చహల్ ఫ్లైట్‌లో కనిపించిన వీడియోల తర్వాత.. వీటిని 'క్రిమినల్ అఫెన్స్' (నేరం) కింద పరిగణిస్తామని బీసీసీఐ తేల్చి చెప్పింది.స్టేడియంలో గానీ, హోటల్లో గానీ ఇలాంటి పనులు చేస్తే ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. కేవలం ఆటగాళ్లనే కాదు.. టీమ్ ఓనర్లను కూడా బీసీసీఐ హెచ్చరించింది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్‌లో ఉన్న ప్లేయర్లతో లేదా కోచ్‌లతో ఓనర్లు మాట్లాడకూడదని చెప్పింది. ప్రతిదీ నిఘా నీడలోనే ఉంటుంది. ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తే సదరు టీమ్‌పై భారీ జరిమానా విధిస్తారు. మొత్తానికి ఐపీఎల్ 2026ని క్లీన్‌గా ఉంచేందుకు బీసీసీఐ నడుం బిగించింది. ఆటగాళ్లు కూడా ఈ అందమైన అమ్మాయిల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.