ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేవలం బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను ప్రదర్శించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి.ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ప్రమాదకరమైన ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్‌ను కవర్ పాయింట్ వద్ద అక్షర్ వెనక్కి పరిగెత్తుతూ అత్యంత చాకచక్యంగా అందుకున్నాడు. దాదాపు 24 మీటర్లు పరుగెత్తి అద్భుతమైన క్యాచ్ ను పట్టాడు.
ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వేసిన ఐదో ఓవర్లో హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను డైవ్ చేస్తూ పట్టుకున్న తీరు స్టేడియంను హోరెత్తించింది. ఈ క్యాచ్‌లతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కోలుకోలేని దెబ్బతింది.కేవలం నేరుగా క్యాచ్‌లు పట్టడమే కాకుండా, బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ చూపిన సమయస్ఫూర్తి అద్భుతం. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్లో విల్ జ్యాక్స్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద అక్షర్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో బంతిని తెలివిగా లోపలికి విసరగా, అక్కడే ఉన్న శివం దూబే దానిని అందుకుని విల్ జ్యాక్స్‌ను పెవిలియన్ పంపాడు. ఈ వికెట్ ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లింది.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ , శివం దూబే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది.254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా యంగ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ వీరోచిత పోరాటం చేశాడు. కేవలం 45 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 పరుగులు చేసి భారత్‌ను వణికించాడు. అయితే చివరి ఓవర్లో 30 పరుగులు అవసరమైన దశలో శివం దూబే బౌలింగ్‌లో బెథెల్ రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ మూడు సిక్సర్లు బాదినా, ఇంగ్లాండ్ 246 పరుగుల వద్దే నిలిచిపోయింది.