ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి టీమ్ఇండియాలో చోటు కోసం పోటీ ఎక్కువైంది. ఈ దేశవాళీ టోర్నీమెంట్లో రాణించి అనేకమంది కుర్రాళ్లు తమ సత్తాను ప్రపంచానికి చాటుకున్నారు. దీంతో ఆయా ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఇది సెలక్టర్లకు సవాల్‌గా మారింది. ఎవరిని ఎంపిక చేయాలనేది కష్టంగా మారింది. ఒక్కోసారి ఈ విషయంలో సెలక్షన్ కమిటీ పలుమార్లు విమర్శలు ఎదుర్కొంటోంది. అందుకే బీసీసీఐ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఆటగాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందుకే 30 నుంచి 35 మంది ఆటగాళ్లతో రెండు టీ20 జట్లు తయారు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ మేరకు సెలక్షన్ కమిటీ ఓ జాబితా తయారు చేస్తున్నందని టాక్ వినిపిస్తుంది.
దీంతో ఒకే సమయంలో మన రెండు జట్లు వేర్వేరు ప్రత్యర్థులతో ఒకేసారి బరిలో దిగవచ్చు. ఈ విధంగా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. అటు అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లు, మరోవైపు ఆసియా గేమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీలకు ఒకేసారి ఆడేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో ఒక జట్టుకు ఎప్పటిలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉంటాడు. ఇంకో జట్టుకు శ్రేయస్ అయ్యర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ విండోలో భారత్‌కు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఉంది. స్వదేశంలో విండీస్‌తో టీమ్ఇండియా 5 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అదే సమయంలో మరోవైపు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి.
ఈ పోటీల్లో క్రికెట్ క్రీడ కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో రెండు జట్లు ఉంటే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. ఒక జట్టు విండీస్‌తో సిరీస్‌కు, ఇంకో టీమ్ ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుంది. ఇలా రెండు జట్లను గతంలో బీసీసీఐ ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. 2022 ఆసియా క్రీడల్లో భాగంగా క్రికెట్‌ను చేర్చారు. ఆ పోటీల్లో 2023 అక్టోబర్‌లో మ్యాచ్‌లు నిర్వహించారు. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్ల జట్టు వన్డే వరల్డ్‌కప్ కోసం సన్నద్దం అవుతోంది. అందుకే రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని యువ జట్టును బీసీసీఐ చైనాకు పంపింది. ఆ క్రీడల్లో సత్తా చాటిన యువ భారత్ గోల్డ్ మెడల్ సాధించింది.