చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ రూ.14 కోట్ల ఆటగాడికి గాయం

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో 14.20 కోట్ల భారీ ధర పెట్టి సీఎస్‌కే కొనుగోలు చేసిన అనామక ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు తీవ్ర గాయమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2026 | 07:31 PMLast Updated on: Jan 23, 2026 | 7:31 PM

Crciket Player Prashanth Veer Sustained A Serious Injury

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో 14.20 కోట్ల భారీ ధర పెట్టి సీఎస్‌కే కొనుగోలు చేసిన ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు తీవ్ర గాయమైంది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025-26‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రశాంత్ వీర్.. జార్ఖండ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.బౌండరీ వెళ్లకుండా బంతిని ఆపేందుకు ప్రశాంత్ వీర్ డైవ్ చేయగా..అతని కుడి భుజానికి తీవ్ర గాయమైంది. నొప్పితో విలవిలలాడిన ప్రశాంత్ వీర్‌ను ఫిజియోలు మైదానం బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కొన్నివారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. అతని భుజంలో గ్రేడ్-2 చీలిక ఉంటే మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమయ్యే సమయానికి అతను కోలుకునే ఛాన్స్ ఉంది. అయితే గాయం తర్వాత అతను మునపటిలా సత్తా చాటగలుగుతాడా? లేదా? అనేది సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఆందోళనగా మారింది. ఐపీఎల్ 2026 మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. అతి త్వరలోనే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్, కుడిచేతి వాటం బ్యాటింగ్ చేసే ప్రశాంత్ వీర్ కోసం ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటాపోటీగా బిడ్ వేసాయి. చివరకు సీఎస్‌కే 14.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.

ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్, కుడిచేతి వాటం బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ అతను. తన ఆట తీరు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పోలి ఉండటంతో ప్రశాంత్ వీర్‌ను జడేజా 2.o అని పిలుస్తారు. జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకే ప్రశాంత్ వీర్‌పై సీఎస్‌కే కోట్లు కుమ్మరించింది.యూపీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ప్రశాంత్ వీర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు యూపీ టీ20 లీగ్‌లో సత్తా చాటాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీతోనే ప్రశాంత్ వీర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గతేడాది డిసెంబర్‌లో లిస్ట్-ఏ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ప్రశాంత్ వీర్.. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీయడంతో పాటు 133 పరుగులు చేశాడు. 2023లో టీ20 క్రికెట్ మొదలు పెట్టిన ప్రశాంత్.. 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో పాటు 112 పరుగులు చేశాడు.