పాక్ రాకున్నా కొలంబోకు భారత్… ఐసీసీ రూల్స్ పాటించనున్న బీసీసీఐ…!

పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ టీమిండియా మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమైంది

Post Published By: dialnews
Updated : 3 February 2026, 12:40 PM IST

పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ టీమిండియా మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమైంది. పాక్ క్రికెట్ బోర్డు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. అయితే బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు మాత్రం మ్యాచ్ ఉన్న రోజున కొలంబోకు వెళ్లి అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేయనుంది.టీమిండియా ఐసీసీ ప్రోటోకాల్‌ను పూర్తిగా పాటించనుంది.

నిర్ణీత సమయానికి ప్రాక్టీస్, ప్రీ-మ్యాచ్ ప్రెస్ మీట్, స్టేడియానికి హాజరు వంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొననుంది.టీమిండియా శ్రీలంకకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంది, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుందనీ, స్టేడియానికి సమయానికి చేరుకుంటుందనీ, మ్యాచ్ రిఫరీ నిర్ణయం కోసం వేచి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం టాస్‌కు ఒక జట్టు హాజరుకాకపోతే ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ ఇస్తారు. అందుకే ఫిబ్రవరి 15న సూర్యకుమార్ యాదవ్ టాస్‌కు హాజరవుతారని సమాచారం. ఒకవేళ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్‌కు రాకపోతే మ్యాచ్ రిఫరీ భారత్‌కు వాకోవర్ ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. కాగా ఈ బాయ్‌కాట్ నిర్ణయం పాకిస్తాన్ ఆటగాళ్లకు కూడా ముందుగా తెలియలేదు.

ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేయడంతోనే ఆటగాళ్లు విషయం తెలుసుకున్నట్లు సమాచారం.మరోవైపు ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలే ప్రధానమని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదిక మార్పుపై ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్ నిర్ణయంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని వల్ల భవిష్యత్‌లో తీవ్ర ప్రభావాలు ఉండవచ్చని హెచ్చరించింది. అభిమానుల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని పీసీబీకి సూచించింది.పాక్ బాయ్‌కాట్ చేసినా, భారత జట్టు మాత్రం క్రమశిక్షణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. రాజకీయ అంశాలకు దూరంగా, క్రీడాస్ఫూర్తిని కాపాడుతూ ఐసీసీ నియమాల ప్రకారం వ్యవహరించనుంది.

Published : 
  • 3 February 2026, 12:40 PM IST