గుజరాత్ టైటాన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్‌లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు సన్నగిల్లాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈజీ టార్గెట్ ఛేదించడంలో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో కింది స్థానానికి దిగజారింది. ఇక మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో మొదటి స్థానానికి వచ్చింది.
ఈ సీజన్‌లో తొలిసారిగా 16 పాయింట్లు అందుకున్న ఏకైక జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఏ జట్టుకు అయినా 16 పాయింట్లు చాలా ముఖ్యం.ఇక ముంబై ఇండియన్స్‌పై గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైభవం రెండ్రోజులు కూడా కొనసాగలేదు. గుజరాత్ టాప్‌లోకి వెళ్లడంతో 14 పాయింట్లతో రెండో స్థానంలోకి వచ్చింది. గుజరాత్‌పై చిత్తు చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కత్తి మీద సామే అన్నట్టుగా మారింది.
ఆరెంజ్ ఆర్మీ తన తర్వాతి రెండు మ్యాచ్‌లను చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఆడనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై ఎస్ఆర్‌హెచ్‌పై రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలని చూస్తోంది. దాంతో సన్‌రైజర్స్ ఆశలు సన్నగిల్లేటట్టే ఉన్నాయి.చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో ఏడు, కోల్‌కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.